- Home
- Sports
- Cricket
- IPL: అందుకే నేను ఐపీఎల్ ఆడకూడదని నిశ్చయించుకున్నా.. ఆసీస్ స్టార్ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు
IPL: అందుకే నేను ఐపీఎల్ ఆడకూడదని నిశ్చయించుకున్నా.. ఆసీస్ స్టార్ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు
IPL Mega Auction 2022: పలు దేశాలకు చెందిన క్రికెటర్లు తమ దేశపు ద్వైపాక్షిక సిరీస్ లు కూడా పక్కకుపెట్టి మరీ ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆడుతుంటే ఈ ఆసీస్ పేసర్ మాత్రం...

విశ్వవ్యాప్తమైన లీగ్ గా గుర్తింపు పొందిన ఐపీఎల్ లో ఆడేందుకు దేశ విదేశాల్లో ఉన్న వర్ధమాన క్రికెటర్లు మొదలు స్టార్స్ ఎందరో ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఐపీఎల్ స్థాయి పెరుగుతుందే కానీ తగ్గడం లేదు.
ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు చెందిన ఆటగాళ్లైతే తమ దేశపు ద్వైపాక్షిక సిరీస్ లు కూడా పక్కకుపెట్టి ఈ క్యాష్ రిచ్ లీగ్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాడు.
ఈ ఏడాది మార్చి 27 నుంచి మొదులకాబోయే ఐపీఎల్-15 సీజన్ లో ఆడకూడదని అతడు నిశ్చయించుకున్నాడు. గతంలో వేలంలో తన పేరు నమోదు చేసుకుందామని అనుకున్నా తర్వాత మనసు మార్చుకున్నాడు.
ఇదే విషయమై తాజాగా స్టార్క్ స్పందిస్తూ... ‘గతంలో నేను కూడా ఈ సీజన్ ఆడదామని అనుకున్నాను. కానీ తర్వాత దానిని విరమించుకున్నాను. 22 వారాల పాటు బయో బబుల్ లో గడపాలని నేను అనుకోలేదు.. అందుకే వేలం నుంచి తప్పుకున్నాను...
ఐపీఎల్ కు తిరిగి వెళ్లాలని భావించాను. కానీ నా ఫస్ట్ ప్రియారిటీ ఆస్ట్రేలియానే. నా దేశం కోసం నేను వీలైనంత ఎక్కువ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాను..’ అని అన్నాడు.
ఐపీఎల్ లో గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడిన స్టార్క్.. 27 మ్యాచులలో 37 వికెట్లు తీశాడు. 2018లో అతడిని కోల్కతా నైట్ రైడర్స్ రూ. 9.4 కోట్లు పెట్టి దక్కించుకుంది. కానీ గాయం కారణంగా స్టార్క్ ఆ సీజన్ ఆడలేదు.
కాగా.. 2020-21 లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు స్టార్క్ ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాన బౌలర్ గా ఉన్న అతడు .. భారత్ తో టెస్టు సిరీస్ లో 11 వికెట్లు మాత్రమే తీశాడు. గతేడాది ముగిసిన టీ20 ప్రపంచకప్ లో కూడా అతడు పెద్దగా రాణించలేదు. దాంతో స్టార్క్ పని అయిపోయిందని అందరూ భావించారు.
కానీ ఇటీవలే ముగిసిన యాషెస్ సిరీస్ లో స్టార్క్ విజృంభించాడు. మళ్లీ తన ఫామ్ ను అందుకుని ఆసీస్ యాషెస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సిరీస్ లో ఐదు టెస్టులు ఆడిన స్టార్క్.. 19 వికెట్లతో చెలరేగాడు.