కటక్ మ్యాచ్ కు వర్షం ముప్పు.. ఛాన్స్ అయితే ఉందంటున్న వాతావరణ శాఖ
IND vs SA T20I: ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య కటక్ లో ఆదివారం రాత్రి జరగాల్సి ఉన్న రెండో టీ20కి వరుణుడి ముప్పు తప్పదా..? అంటే అవుననే అంటోంది వాతావరణ శాఖ.

ఢిల్లీ లో జరిగిన తొలి టీ20 లో ఓడి కటక్ కు చేరుకున్న టీమిండియా.. ఇక్కడ దక్షిణాఫ్రికా పై బదులు తీర్చుకోవడంతో పాటు సిరీస్ లో ఆధిక్యం సాధించాలని భావిస్తున్నది.
అయితే ఈ మ్యాచ్ కు వరుణుడి ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతున్నది. భువనేశ్వర్ లో గల స్థానిక వాతావరణ కేంద్రం (ఆర్ఎంసీ) నివేదిక మేరకు కటక్ లో ఆదివారం సాయంత్రం వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.
ఇదే విషయమై ఆర్ఎంసీ భువనేశ్వర్ డైరెక్టర్ హెచ్ఆర్ బిశ్వాస్ మాట్లాడుతూ.. ‘కటక్ లో ఆదివారం సాయంత్రం వర్షం కురిసే అవకాశాలు 50:50 గా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం వర్షం కురవదని మేమైతే కచ్చితంగా చెప్పలేం. తేలికపాటి జల్లులతో కూడిన వర్షం పడే అవకాశమైతే ఉంది..
అయితే భారీ వర్షమైతే కురవకపోవచ్చు. ఒకవేళ వర్షం కురిసినా అది మ్యాచ్ కు ఆటంకం కలిగించేంతగా అయితే ఉండకపోవచ్చు..’ అని వెల్లడించారు.
కాగా.. ఈ మ్యాచ్ లో వర్షం వచ్చినా పిచ్, ఔట్ ఫీల్డ్ పాడవకుండా తగిన ఏర్పాట్లు చేశామని ఒడిషా క్రికెట్ అసోసియేషన్ (ఒసిఎ) అధికారి ఒకరు తెలిపారు. ‘బీసీసీఐ టెక్నికల్ కమిటీ సూచనల మేరకు మేము గ్రౌండ్ లో తగిన ఏర్పాట్లు చేశాం.. ఒకవేళ వర్షం కురిసినా మొత్తం ఫీల్డ్ ఏరియా కవర్ అయ్యేంత కవర్ ను కొనుగోలు చేశాం..’ అని చెప్పుకొచ్చాడు.
రెండేండ్ల తర్వాత కటక్ లో మ్యాచ్ జరుగుతుండటంతో ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శనివారం ప్రాక్టీస్ మ్యాచ్ జరిగినా దానిని చూడటానికి కూడా స్టేడియం నిండుగా క్రికెట్ అభిమానులు కనిపించడం గమనార్హం..