CSK vs RR: నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...
IPL 2020: 13వ సీజన్‌లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటిదాకా జరిగిన రెండు మ్యాచులు అబుదాబి, దుబాయ్‌లో జరగగా, నేటి మ్యాచ్ షార్జాలోని షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...
స్టీవ్ స్మిత్: టెస్టుల్లో నెం.1 బ్యాట్స్‌మెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్, టీ20ల్లో కూడా ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టగలడు. అయితే ఇప్పటిదాకా ఐపీఎల్‌లో సరైన ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు స్మిత్. ఐపీఎల్ కెరీర్‌లో 81 మ్యాచుల్లో 2022 పరుగులు చేశాడు. ఓ సెంచరీతో పాటు 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా నియమితుడైన స్టీవ్ స్మిత్‌పైనే ఎన్నో ఆశలు పెట్టుకుంది రాజస్థాన్.
మురళీ విజయ్: రాజస్థాన్ రాయల్స్‌పై మురళీ విజయ్‌కి మంచి రికార్డు ఉంది. రాయల్స్‌పై 2010లో జరిగిన మ్యాచ్‌లో 127 పరుగులతో అదరగొట్టాడు మురళీ విజయ్. గత మ్యాచ్‌లో ఘోరంగా ఫెయిలైన విజయ్, ఈ మ్యాచ్‌లో తుదిజట్టులో చోటు దక్కించుకోవడం అనుమానమే.
బెన్ స్టోక్స్: సునామీ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు బెన్ స్టోక్స్. ఇప్పటిదాకా ఐపీఎల్ కెరీర్‌లో 34 మ్యాచులు ఆడిన బెన్‌స్టోక్స్, ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీతో 635 పరుగులతో పాటు 26 వికెట్లు కూడా తీసుకున్నాడు.
జోస్ బట్లర్: రాజస్థాన్ రాయల్స్ జట్టులో స్టార్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు బట్లర్. ఇప్పటిదాకా 45 మ్యాచుల్లో 9 హాఫ్ సెంచరీలతో 1386 పరుగులు చేశాడు బట్లర్. 150+ స్టైయిక్ రేటుతో చెలరేగిపోయే బట్లర్ క్రీజులో ఉండే చెన్నై బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు.
రాబిన్ ఊతప్ప: భారత జట్టులో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోగలడు రాబిన్ ఊతప్ప. ఇప్పటిదాకా 177 మ్యాచులు ఆడిన ఊతప్ప, 4411 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున తొలిసారి ఆడబోతున్నాడు ఊతప్ప.
యశస్వి జైస్వాల్ (రాజస్థాన్ రాయల్స్)
అండర్-19 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా అందరి దృష్టినీ ఆకర్షించాడు యశస్వి జైశ్వాల్. పరిమిత ఓవర్ల ఫార్మాట్ అదరగొట్టే ఈ చిచ్చర పిడుగు, లిస్ట్-ఏ మ్యాచుల్లో 70.81 సగటుతో ఆరుసార్లు 50+ స్కోర్లు చేశాడు. యశస్వి జైస్వాల్: అండర్ 19 వరల్డ్‌కప్‌లో 400లకు పైగా పరుగులతో అదరగొట్టిన బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సెన్సేషనల్ యంగ్ బ్యాట్స్‌మెన్‌ను రూ.2 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసింది.
జోఫ్రా ఆర్చర్: గత రెండు సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు జోఫ్రా ఆర్చర్. 21 మ్యాచుల్లో 26 వికెట్లు తీసిన ఆర్చర్, చెన్నై బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడితే రాజస్థాన్ రాయల్స్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు.
సంజూ శాంసన్: ఐపీఎల్‌లో రెండు సెంచరీలు బాదిన అతి తక్కువ మందిలో సంజూ ఒకడు. గత సీజన్‌లో కూడా సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్, ఈ సీజన్‌లో రాణించి టీమిండియాలోకి కమ్ బ్యాక్ ఇవ్వాలని కసిగా ఉన్నాడు.
మహేంద్ర సింగ్ ధోనీ... ముంబైతో జరిగిన మొదటి మ్యాచ్‌లో ధోనీ ఎలా బ్యాటింగ్ చేస్తాడోనని కొన్ని కోట్ల మంది అభిమానులు ఆశగా ఎదురుచూశారు. కానీ ధోనీ ఆఖర్లో వచ్చి రెండు బంతులు మాత్రమే ఆడాడు. మరి నేటి మ్యాచ్‌లో అయినా ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ చూసే అవకాశం అభిమానులకు దొరుకుతుందో చూడాలి.