- Home
- Sports
- Cricket
- బాబ్బాబు.. మా దగ్గర ఐపీఎల్ ఆడండి.. అక్కడి కంటే ఖర్చు తక్కువ.. లాభమెక్కువ.. బీసీసీఐకి సఫారీ బోర్డు ప్రతిపాదన
బాబ్బాబు.. మా దగ్గర ఐపీఎల్ ఆడండి.. అక్కడి కంటే ఖర్చు తక్కువ.. లాభమెక్కువ.. బీసీసీఐకి సఫారీ బోర్డు ప్రతిపాదన
IPL 2022 Venue: ఈ ఏడాది భారత్ లోనే ఐపీఎల్ ను నిర్వహించాలని అనుకుంటున్నా దేశంలో కరోనా ఉధృతి నానాటికీ ఎక్కువవుతున్నది. మార్చికల్లా అవి పీక్స్ కు చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అందివచ్చిన అవకాశాన్ని...

ఈ ఏడాది మార్చి నుంచి మొదలుకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేదికలు ఇంకా ఖరారు కాలేదు. భారత్ లో కరోనా మూడో వేవ్ దృష్ట్యా.. ఈ లీగ్ ఈసారి కూడా విదేశాలకు తరలే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐపీఎల్-2022 ను ఈసారి ఇండియాలోనే నిర్వహిస్తామని గతంలో బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా చెప్పినా.. తాజాగా పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు.
బీసీసీఐ తో పాటు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా.. ఈ ఏడాది లీగ్ ను ఎక్కడ నిర్వహించాలనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నది. ఇప్పటికే గతేడాది సగం సీజన్ తో పాటు 2020లో మొత్తం సీజన్ దుబాయ్ లో నిర్వహించింది బీసీసీఐ. కానీ ఈసారి ఎలాగైనా ఇండియాలోనే నిర్వహించాలనుకున్నది.
తానొకటి తలిస్తే విధి మరొకటి తలిచినట్టు.. మొన్నటిదాకా స్తబ్దుగా ఉన్న కరోనా కేసులు ఇప్పుడు మళ్లీ విజృంభిస్తున్నాయి. మూడో వేవ్.. మార్చి కల్లా పీక్స్ కు చేరుకుంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఇండియాలో నిర్వహించకుంటే ఎక్కడ..? అనేదానిమీద కూడా బీసీసీఐ చర్చోపచర్చలు సాగిస్తున్నది.
ప్లాన్-బీలో భాగంగా.. భారత్ లో కాకుంటే గత రెండేండ్ల మాదిరిగానే యూఏఈలో గానీ లేదంటే దక్షిణాఫ్రికాలో గానీ ఐపీఎల్-2022 సీజన్ ను నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నది. అయితే దుబాయ్ కంటే ఐపీఎల్ తమ దేశంలో నిర్వహిస్తేనే బెటర్ అంటున్నది సౌతాఫ్రికా. ఈ మేరకు తమ దేశంలో ఐపీఎల్ ను నిర్వహిస్తే వచ్చే ప్రయోజనాలన్నింటినీ ఏకరువు పెడుతూ బీసీసీఐకి ఓ నివేదిక కూడా సమర్పించినట్టు బోర్డు వర్గాల సమాచారం.
ఈ నివేదికలో.. ఐపీఎల్-15 ను తమ దేశంలో నిర్వహిస్తేనే బెటరని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు బీసీసీఐని కాక పడుతున్నది. దుబాయ్ తో పోలిస్తే తాము హోటల్స్ లో తక్కువ చార్జ్ చేస్తామని, అంతేగాక బస్ ప్రయాణాలు గాక మొత్తం విమానాల ద్వారా (ఎయిర్ ట్రావెల్)నే ఆటగాళ్లను ఓ చోటు నుంచి మరో చోటుకు చేరుస్తామని పేర్కొంది
విమాన ప్రయాణాల ద్వారా కరోనా వ్యాప్తి తక్కువగా ఉండటమే గాక.. దుబాయ్ తో పోలిస్తే తాము విమాన ప్రయాణానికి తక్కువ చార్జ్ చేస్తామని బీసీసీఐకి నివేదించింది. దీని ద్వారా ఫ్రాంచైజీలకు బోలెడు నిర్వహణ ఖర్చు కలిసొస్తుందని తెలిపింది.
ఇక ఐపీఎల్ నిర్వహణ కోసం నాలుగు స్టేడియాల వివరాలను కూడా సీఎస్ఏ.. బీసీసీఐ కి పంపిన నివేదికలో పేర్కొంది జోహన్నస్బర్గ్ లోని వాండరర్స్ స్టేడియం, సెంచూరియన్ లోని ప్రిటోరియా, బెన్నోయ్ లోని విలియమ్మోర్ పార్క్, పోచెఫ్స్ట్రోమ్ లోని సెన్వాస్ క్రికెట్ స్టేడియాలు ఐపీఎల్ నిర్వహణ కు అనుకూలంగా ఉంటాయని పేర్కొంది. ఇవి చాలకుంటే న్యూలాండ్స్ (కేప్టౌన్), పార్ల్ వేదికలను కూడా ఉపయోగించుకోవచ్చునని ప్రతిపాదనలలో పేర్కొన్నట్టు సమాచారం.
సీఎస్ఏ ప్రతిపాదించిన స్టేడియాలలో ఒక్క సెన్వాస్ క్రికెట్ స్టేడియం మినహా.. మిగిలిన వేదికలన్నింటిలో భారత జట్టు టెస్టు, వన్డేలు ఆడిన విషయం తెలిసిందే.
ఇదిలాఉండగా.. ఐపీఎల్ నిర్వహణ, ఇతరత్రా అంశాల మీద బీసీసీఐ కూడా సీఎస్ఏతో చర్చలు జరుపుతున్నది. ఒకవేళ సఫారీ బోర్డు ప్రతిపాదనలు గనుక బీసీసీఐకి నచ్చితే 2009 మాదిరి ఈసారి కూడా ఐపీఎల్ ను సౌతాఫ్రికా లో చూడొచ్చు. 2009లో ఐపీఎల్ ను దక్షిణాఫ్రికాలోనే నిర్వహించిన విషయం తెలిసిందే.