- Home
- Sports
- Cricket
- నువ్వేం తోపువి కాదు.. సాధారణ ఆటగాడివే అని గుర్తుపెట్టుకో : కోహ్లిపై అక్తర్ షాకింగ్ కామెంట్స్
నువ్వేం తోపువి కాదు.. సాధారణ ఆటగాడివే అని గుర్తుపెట్టుకో : కోహ్లిపై అక్తర్ షాకింగ్ కామెంట్స్
TATA IPL 2022: గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయభ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లి కూడా అందరిలాంటి క్రికెటరే అని బాగా ఆడకుంటే జట్టులో నుంతి తీసేస్తారని గుర్తు చేశాడు.

పరుగుల యంత్రం విరాట్ కోహ్లి తన ఆటతీరు మార్చుకోవాలని లేకుంటే జట్టులో చోటు కూడా దక్కదని పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయభ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాడ్ టైమ్ వస్తే ఎంత గొప్ప ఆటగాడైనా తప్పుకోవాల్సిందేనని, కానీ తానే గొప్ప క్రికెటర్ అనే మైండ్ సెట్ ఉండటం కరెక్ట్ కాదని అక్తర్ సూచించాడు.
ఐపీఎల్ లో ఆర్సీబీ ఆడిన ఐదు మ్యాచుల్లో పంజాబ్, ముంబై పై మినహా కోహ్లి పెద్దగా రాణించింది లేదు. ఐదు మ్యాచుల్లో కలిపి కోహ్లి చేసిన పరుగులు 107 మాత్రమే.
ఈ నేపథ్యంలో అక్తర్ స్పందిస్తూ... ‘ఐపీఎల్ అనేది ఎవరు బాగా ఆడితే వారినే జట్టులో ఉంచుకునే ఫ్రాంచైజీ మోడల్ క్రికెట్. బాగా ఆడని ఆటగాళ్లను నిర్దాక్షణ్యంగా జట్టులోంచి తీసేస్తారు. అందులో రెండో ఆలోచనే లేదు. దానికి కోహ్లి అతీతుడేమీ కాదు.
బాగా ఆడకుంటే కోహ్లి అయినా పక్కకు తప్పుకోవాల్సిందే. ఇప్పటి పరిస్థితులలో స్టార్ హోదా ఎందుకూ పనికిరాదు. ఆ జట్టు (ఆర్సీబీ) లో ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న ఎందరో యువ ఆటగాళ్లు ఉన్నారు. కోహ్లి ఆడని రోజున జట్టు యాజమాన్యం కూడా అతడిని డ్రాప్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
కోహ్లి బుర్రలో ఇప్పుడు పదివేల ఆలోచనలు తిరుగుతూ ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. అతడో మంచి వ్యక్తి. అంతకుమించి గొప్ప క్రికెటర్. కానీ ఈ మధ్య కాలంలో అతడి ఫోకస్ సరిగా లేదు. గత కొంతకాలంగా అతడి ఆటతీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.
కోహ్లి ఆటపై చాలా మంది వేలెత్తి చూపుతున్నారు. దీనిని బట్టి చూస్తే అతడు ప్రమాదంలో ఉన్నట్టే. అందుకే ఒక విషయం చెబుతున్నా. నిన్ను నువ్వు సాధారణ ఆటగాడిగా ఫీలవ్వు. బ్యాట్ తీసుకుని నీ ఆట నువ్వు ఆడు.
స్టార్ హోదా, రికార్డులు అన్నీ పక్కనపెట్టు... బ్యాట్ తో పరుగులు చేసి చూపించు.. ఫామ్ లోకి వస్తే నిన్ను ఆపడం ఎవరి తరమూ కాదు...’ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
ఇక తాను కోహ్లితో క్రికెట్ ఆడలేదని, ఒకవేళ ఆడుంటే మాత్రం అతడు ఇన్ని పరుగులు కొట్టేవాడు కాదని అక్తర్ సరదాగా వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే ఇప్పటివరకు విరాట్ అద్భుతంగా ఆడాడని, భవిష్యత్ లో కూడా అదే ఆటతీరును కొనసాగించాలని అక్తర్ ఆశించాడు.