- Home
- Sports
- Cricket
- రాహుల్‌కు గాయం.. కెఎస్ భరత్ అట్టర్ ఫ్లాప్.. వికెట్ కీపర్‌గా అతడే బెస్ట్ అంటున్న రవిశాస్త్రి
రాహుల్‌కు గాయం.. కెఎస్ భరత్ అట్టర్ ఫ్లాప్.. వికెట్ కీపర్‌గా అతడే బెస్ట్ అంటున్న రవిశాస్త్రి
WTC Finals 2023: ఈ ఏడాది జూన్ 7-11 మధ్య ఇంగ్లాండ్ లోని ‘ది ఓవల్’ వేదికగా భారత జట్టు ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడనుంది.

మరో నెలరోజుల్లో లండన్ వేదికగా జరగాల్సి ఉన్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో భారత జట్టును ఇదివరకే ప్రకటించింది బీసీసీఐ. ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా జరుగబోయే ఈ టీమ్ లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ గా సేవలందించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. టీమ్ లో రాహుల్ తో పాటు మరో వికెట్ కీపర్ గా కెఎస్ భరత్ ను కూడా తీసుకున్నా అతడిని ఆడించే అవకాశాలు తక్కువే.
Image credit: PTI
భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి - మార్చిలో జరిగిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో కెఎస్ భరత్ నాలుగు టెస్టులు ఆడి దారుణంగా విఫలమయ్యాడు. రిషభ్ పంత్ గైర్హాజరీలో భరత్ అంచనాలకు అందుకోకపోగా పేలవ ప్రదర్శనతో విసుగు తెప్పించాడు.
అయితే తాజాగా కెఎల్ రాహుల్ ఐపీఎల్ లో రెండ్రోజుల క్రితం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డ విషయం తెలిసిందే. అతడు నడవడానికే ఇబ్బందిపడ్డాడు. రాహుల్ కు గాయాలతో అవినాభావ సంబంధముంది. అతడు టీమిండియా తరఫున ఆడిన మ్యాచ్ ల కంటే గాయాల కారణంగా మిస్ అయిన మ్యాచ్ ల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది.
రాహుల్ కు గాయం, భరత్ కు ఫామ్ లేమి నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు రాహుల్ కు బ్యాకప్ కీపర్ గా వెటరన్ ఆటగాడు వృద్ధిమాన్ సాహాను జట్టులోకి తీసుకోవాలని అంటున్నాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. సాహాకు అంతర్జాతీయ అనుభవం ఐసీసీ ట్రోఫీలో భారత్ కు కలిసొస్తుందని శాస్త్రి అభిప్రాయపడ్డాడు.
Image credit: PTI
శాస్త్రి మాట్లాడుతూ.. ‘ఒకవేళ మీ ప్రధాన వికెట్ కీపర్ గాయపడితే అతడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? నాకు తెలిసి సాహా అయితే ఆ స్థానానికి కరెక్ట్ గా సెట్ అవుతాడు. సాహా నా హయాంలో టెస్టు జట్టులో బాగా రాణించాడు. అతడి వికెట్ కీపింగ్ స్కిల్స్ అద్భుతం. బ్యాటింగ్ కూడా చేయగలడు. ఐపీఎల్ లో కూడా రాణిస్తున్నాడు.. బ్యాకప్ కీపర్ గా అతడే కరెక్ట్..’ అని చెప్పాడు.
గత ఐపీఎల్ సీజన్ నుంచి గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్న సాహా.. తన సహజ శైలికి భిన్నంగా ఆటను మార్చుకున్నాడు. 2022 సీజన్ లో 11 మ్యాచ్ లు ఆడి 317 పరుగులు చేశాడు. ఇక 2023 సీజన్ లో ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడి 151 రన్స్ సాధించాడు.