- Home
- Sports
- Cricket
- టీమిండియా వీరులంతా ఐపీఎల్‌లో.. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు సిద్ధమవుతున్న పుజారా.. కౌంటీలలో సెంచరీ
టీమిండియా వీరులంతా ఐపీఎల్‌లో.. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు సిద్ధమవుతున్న పుజారా.. కౌంటీలలో సెంచరీ
Cheteshwar Pujara: టీమిండియా టెస్ట్ బ్యాటర్, అభిమానులు నయా వాల్ గా పిలుచుకునే ఛటేశ్వర్ పుజారా జూన్ లో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిస్ కోసం సిద్ధమవుతున్నాడు.

Image credit: PTI
భారత జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్లంతా దాదాపు ఐపీఎల్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ మొదలుకుని శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లు తమ తమ జట్లతో బిజీగా ఉన్నారు.
ఐపీఎల్ ముగిసిన కొద్దిరోజులకే భారత జట్టు.. ఇంగ్లాండ్ లోని ది ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో పాల్గొనాల్సి ఉంది. పైన పేర్కొన్నవాళ్లంతా డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో భారత జట్టు తరఫున ఆడేవాళ్లే. వీరిలో ఎవరికైనా గాయాలైనా, మరేదైనా జరగరానిది జరిగినా అది టీమిండియాకు మొదటికో మోసం.
వీళ్ల సంగతి ఇలా ఉంటే డబ్ల్యూటీసీ ఫైనల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ఒకే ఒక బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా. ఐపీఎల్ లో ఆడని పుజారా.. ఖాళీగా ఉండటం ఎందుకని ఇంగ్లాండ్ కు బయల్దేరాడు. అక్కడ జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్నాడు. ససెక్స్ జట్టుకు సారథిగా కూడా వ్యవహరిస్తున్న పుజారా.. డర్హమ్ తో జరుగుతున్న తొలి మ్యాచ్ లో సెంచరీ బాదాడు.
రెండ్రోజుల క్రితం మొదలైన ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్.. 376 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే తొలి ఇన్నింగ్స్ లో 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కానీ పుజారా రాకతో సీన్ మారిపోయింది. వికెట్ల పతనాన్ని అడ్డుకున్న నయా వాల్.. టామ్ క్లార్క్ తో కలిసి 112 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఇదిలాఉండగా పుజారాకు ఇంగ్లాండ్ కౌంటీలలో ఇది వరుసగా రెండో సీజన్. 2022లో కూడా అతడు సస్సెక్స్ తరఫున ఆడుతూ.. 13 ఇన్నింగ్స్ లలో 1.094 రన్స్ చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు కూడా ఉన్నాయి.
134 బంతుల్లో సెంచరీ చేసిన పుజారా.. మొత్తంగా 163 బంతుల్లో 115 పరుగులు చేసి నిష్క్రమించాడు. అతడికి ఇది ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 57వ సెంచరీ. పుజారా ఇచ్చిన స్ఫూర్తితో ససెక్స్ లోయరార్డర్ బ్యాటర్లు రెచ్చిపోయి ఆడారు. ఫలితంగా ఆ జట్టు రెండో రోజు ఆట ముగిసే 9 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది.
కాగా పుజారా ఫామ్ లో ఉండటం భారత్ కు కూడా మేలుచేసేదే. జూన్ 7 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాల్సి ఉన్న భారత్.. ఓవల్ లో ఆసీస్ బౌలర్లను ఎదుర్కుని నిలదొక్కుకోవడం చాలా అవసరం. అందుకు పుజారా రెండు నెలల ముందు నుంచే అక్కడి పరిస్థితులను అలవాటు పడుతుండటం శుభపరిణామమే.