- Home
- Sports
- Cricket
- Champions Trophy 2025 : ఇదేం మాస్ బ్యాటింగ్ ఇబ్రహీం భయ్యా... ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించావుగా
Champions Trophy 2025 : ఇదేం మాస్ బ్యాటింగ్ ఇబ్రహీం భయ్యా... ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించావుగా
Afghanistan vs England : పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలాంటి అంచనాలు లేని అప్ఘానిస్తాన్ అద్భుతం చేసింది. క్రికెట్ లో ఎంతో ఘన చరిత్ర కలిగిన ఇంగ్లాండ్ ను చిత్తుచేసి విజయాన్ని అందుకుంది.

AFG vs ENG
AFG vs ENG : ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో మరో సంచలనం నమోదయ్యింది. క్రికెట్ కు పుట్టినిల్లు ఇంగ్లాండ్ ను పసికూన అప్ఘానిస్తాన్ ఓడించింది. ఈ సంచలన విజయంతో తాము పసికూనలం కాదు పవర్ ఫుల్ టీం అని అప్ఘాన్ ప్రపంచానికి చాటిచెప్పింది అప్ఘాన్. ముఖ్యంగా ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు అప్ఘాన్ ఓపెనర్ ఇబ్రహీం జర్దార్.
జోఫ్రా ఆర్చర్, జో రూట్, ఆదిల్ రషీద్ వంటి టాప్ బౌలర్లను గల్లీ క్రికెటర్లు అనుకున్నాడో ఏమో... చితకొట్టుడు కొట్టాడు జర్దాన్. ఇలా ఇంగ్లీష్ బౌలర్లతో ఓ ఆట ఆడుకుంటూ కేవలం 144 బంతుల్లోనే 12 ఫోర్లు, 6 సిక్సర్లతో చెలరేగిన అప్ఘాన్ ఓపెనర్ ఏకంగా 177 పరుగులు చేసాడు. ఈ స్కోరు జర్దార్ కెరీర్ లోనే కాదు ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అత్యధిక వ్యక్తిగత స్కోరు.
జర్దార్ మెరుపు ఇన్నింగ్స్ కు కెప్టెన్ అస్మతుల్లా షాహిది (67 బంతుల్లో 40 పరుగులు), అజ్మతుల్లా ఒమర్జాయి (31 బంతుల్లో 41 పరుగులు), మహ్మద్ నబీ (24 బంతుల్లో 40 పరుగులు) బాధ్యతాయుత బ్యాటింగ్ తోడయ్యింది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన అప్ఘానిస్తాన్ ఎవరి ఊహకందని స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఏకంగా 325 పరుగులు చేసి క్రికెట్ లోకాన్ని విస్మయానికి గురిచేసింది అప్ఘాన్ టీం.
Joe Root
జో రూట్ సెంచరీ వృధా :
అప్ఘాన్ విసిరిన భారీ లక్ష్యాన్ని చేధించలేకపోయింది ఇంగ్లాండ్ టీం. జో రూట్ సెంచరీతో అదరగొట్టినా జట్టును విజయతీరాలకు మాత్రం చేర్చలేకపోయాడు. జో రూట్ కేవలం 111 బంతుల్లోనే ఓ సిక్సర్, 11 ఫోర్ల సాయంతో 120 పరుగులు చేసాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లక్ష్యచేధన దిశగా సాగుతున్న సమయంలో జో రూట్ ని అప్ఘాన్ బౌలర్ ఒమర్జాయి బోల్తా కొట్టించాడు. ఈ వికెట్ పడిపోవడంతో ఇంగ్లాండ్ ఓటమి, అప్ఘాన్ గెలుపు ఖాయమైపోయాయి.
325 పరుగుల భారీ లక్ష్యచేధనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ టీంకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ కేవలం 19 పరుగుల వద్దే ఔటయ్యాడు. ఆ తర్వాత 30 పరుగుల వద్ద స్మిత్ ఔటయ్యాడు. అయితే కొద్దిసేపు డుక్కెట్ (38 పరుగులు) జో రూట్ తో కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. అంతా సాఫీగా సాగుతుందని అనుకున్న సమయంలో 98 పరుగుల వద్ద డుక్కెట్ ఔటయ్యాడు.
ఇంగ్లాండ్ బ్యాట్ మెన్స్ లో బ్రూక్ 25, బట్లర్ 38, ఓవర్టన్ 32 పరుగులు చేసారు. వీరందరితో కలిసి జో రూట్ మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే 45 ఓవర్లలో 287 పరుగుల వద్ద ఉండగా జో రూట్ 7వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లాండ్ గెలుపు ఆశలు ఆవిరైపోయాయి. చివరకు 49.5 ఓవర్లలో 317 పరుగులు చేసి ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది. ఇలా 8 పరుగుల తేడాతో అప్ఘానిస్తాన్ సంచలన విజయం సాధించింది.
AFG vs ENG
అప్ఘాన్ బౌలర్ ఐదు వికెట్ల ప్రదర్శన :
అప్ఘానిస్తాన్ బ్యాటింగ్ తోనే కాదు బౌలింగ్ లోనూ అదరగొట్టింది. బౌలర్ అజ్మతుల్లా ఒమర్జాయి ఐసిసి ఛాంపియన్ ట్రోఫీ చరిత్రలో నిలిచిపోయేలా బౌలింగ్ చేసాడు. చాలామంది టాప్ బౌలర్లు కలగనే 5 వికెట్ల ఫీట్ ను ఈ మ్యాచ్ లో ఒమర్జాయి సాధించాడు. 9.5 ఓవర్లు వేసిన అతడు 58 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇలా బ్యాట్ తోనూ, బాల్ తోనూ అదరగొట్టి అప్ఘాన్ గెలుపులో ఒమర్జాయి కీలక పాత్ర పోషించాడు.
మిగతా బౌలర్ల విషయానికి వస్తే ఫారుఖి 1, మహ్మద్ నబి 2, రషీద్ ఖాన్ 1, గుల్బదిన్ నయిబ్ 1 వికెట్ పడగొట్టారు. నూర్ అహ్మద్ కు వికెట్లు దక్కకపోయినా అందరికంటే తక్కువ పరుగులు ఇచ్చాడు.
ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ 3, లివింగ్ స్టోన్ 2, ఓవర్టన్ 1, ఆదిల్ రషీద్ 1 వికెట్ పడగొట్టారు. జో రూట్, మార్క్ వుడ్ కు వికెట్లేమీ దక్కలేదు. ఇంగ్లాండ్ బౌలర్లందరూ జర్దాన్ దెబ్బకు అధిక పరుగులు సమర్పించుకున్నారు.