కామన్వెల్త్ గేమ్స్ నుంచి రెజ్లింగ్, షూటింగ్, హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్ ఔట్ - భారత్ పై పగపట్టారా ఏంది?
Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్ 2026లో జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు జరుగుతాయి. అయితే, హోస్ట్ సిటీ గ్లాస్గో 2026 కామన్వెల్త్ గేమ్స్ నుండి హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, క్రికెట్, షూటింగ్ వంటి ప్రధాన క్రీడలను తొలగించడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
India , Cricket, Hockey , Commonwealth Games 2026
Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్ నుండి పలు క్రీడలను మినహాయించడంతో క్రీడా ప్రపంచంలో కలకలం మొదలైంది. ఇదే అంశం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. చాలా దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా భారత్ కు బిగ్ షాక్ అని చెప్పాలి. ఎందుకంటే కామన్వెల్త్ గేమ్స్ నుంచి ఔట్ చేసిన క్రీడలలో భారత్ కు అద్భుతమైన రికార్డు ఉంది. తప్పకుండా మెడల్స్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు స్కాట్లాండ్ లో జరుగుతాయి. అయితే, హోస్ట్ సిటీ గ్లాస్గో 2026 కామన్వెల్త్ గేమ్స్ నుండి హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, క్రికెట్, షూటింగ్ వంటి ప్రధాన క్రీడలను తొలగించింది. ఇప్పుడు క్రీడా వర్గాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. మరీ ముఖ్యంగా ఈ నిర్ణయంతో భారత్ మెడల్స్ గెలిచే అవకాశాలకు పెద్ద దెబ్బ తగిలింది.
కామన్వెల్త్ గేమ్స్ (CWG)లో భారత్ పతకం గెలిచే అవకాశాలకు భారీ దెబ్బ తగిలింది. ఆతిథ్య నగరం గ్లాస్గో 2026 కామన్వెల్త్ గేమ్స్ నుండి క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, రెజ్లింగ్, షూటింగ్, నెట్ బాల్, రోడ్ రేసింగ్ వంటి పలు క్రీడలను తొలగించారు. గ్లాస్గో గతంలో కూడా కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించింది.
2014లో నిర్వహించిన ఆ క్రీడల నుంచి టేబుల్ టెన్నిస్, స్క్వాష్, ట్రయాథ్లాన్ కూడా ఖర్చులను తగ్గించుకోవడానికి తొలగించింది. 2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో చేర్చిన తొమ్మిది క్రీడలు తదుపరి గేమ్‌లలో భాగం కావు. ఈ క్రీడలు కేవలం నాలుగు చోట్ల మాత్రమే జరుగుతాయి.
కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ఒక ప్రకటనలో 'స్పోర్టింగ్ ప్రోగ్రామ్‌లో అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్ (ట్రాక్ అండ్ ఫీల్డ్), స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, ట్రాక్ సైక్లింగ్, పారా ట్రాక్ సైక్లింగ్, నెట్‌బాల్, వెయిట్ లిఫ్టింగ్, పారా పవర్ లిఫ్టింగ్, బాక్సింగ్, జూడో, బౌల్స్, పారా బౌల్స్, 3x3 బాస్కెట్‌బాల్, 3x3 వీల్ చైర్ బాస్కెట్‌బాల్ గేమ్స్ ను చేర్చినట్టు పేర్కొంది. కేవలం 10 క్రీడలతోనే ఈ గేమ్స్ నిర్వహిస్తారని తెలిపింది.
అలాగే, ''ఈ గేమ్స్ నాలుగు వేదికలలో నిర్వహించబడతాయి - స్కాట్స్‌టౌన్ స్టేడియం, టోల్‌క్రాస్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ సెంటర్, ఎమిరేట్స్ అరేనా, స్కాటిష్ కాంపిటీషన్ కాంప్లెక్స్ (SEC). ఆటగాళ్లు, వారి సహాయక సిబ్బందికి హోటల్‌లో వసతి కల్పిస్తారు'' అని కూడా కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ పేర్కొంది.
అయితే, కేవలం పది ఆటలతోనే కామన్వెల్త్ గేమ్స్ 2026 ను నిర్వహించాలనే నిర్ణయం భారత్ కు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే కామన్వెల్త్ గేమ్స్ నుంచి మినాహాయించిన చాలా గేమ్స్ లో భారత్ కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 2022 కామన్వెల్త్ గేమ్స్ వివరాలు గమనిస్తే భారత్ మొత్తంగా 61 మెడల్స్ సాధించింది. అత్యధిక పతకాల గెలిచిన దేశాల జాబితాలో 4వ స్థానం సంపాదించింది.
భారత్ గెలిచిన 61 పతకాల్లో 22 గోల్డ్, 16 సిల్వర్, 23 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. వీటిలో ఇప్పుడు మినహాయించిన క్రీడలైన రెజ్లింగ్‌లో అత్యధికంగా 12 మెడల్స్ గెలుచుకుంది. అలాగే, వెయిట్ లిఫ్టింగ్‌లో 10 పతకాలు సాధించింది. ఇక హాకీ, బ్యాడ్మింటన్, క్రికెట్, షూటింగ్ భారత్ తప్పకుండా మెడల్స్ గెలుస్తుంది కానీ, ఇప్పుడు ఆయా గేమ్స్ ను కామన్వెల్త్ గేమ్స్ 2026 నుంచి మినహాయించారు.
హాకీ 1998లో కామన్వెల్త్ గేమ్స్‌లోకి చేరింది. భారత పురుషుల జట్టు మూడుసార్లు రజతం, రెండుసార్లు కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మహిళల టీమ్ ఒక స్వర్ణం సహా మూడు పతకాలు సాధించింది.
కామన్వెల్త్ గేమ్స్ 2026 నుంచి బ్యాడ్మింటన్ మినహాయించడంపై భారత బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ వంటి దేశాల పురోగతిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. "బ్యాడ్మింటన్ మాకు చాలా సగర్వాన్ని, విజయాన్ని తెచ్చిపెట్టింది. ఇది మా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అంతర్జాతీయ వేదికపై ప్రతిభను చూపించుకోవడానికి ఒక ముఖ్యమైన వేదికగా ఉపయోగపడుతుందని" పేర్కొన్నారు.