పృథ్వీ షా కు ఊరట.. అవన్నీ తప్పుడు ఆరోపణలు అంటూ కొట్టిపారేసిన ముంబై పోలీసులు
మోడల్, బోజ్‌పురి నటి అయిన సప్నా గిల్ ను లైంగిక వేధింపులకు గురి చేశాడన్న ఆరోపణలను ఎదుర్కుంటున్న టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా కు కాస్త ఊరట దక్కింది. అవన్నీ నిరాధార ఆరోపణలని ముంబై పోలీసులు కొట్టిపారేశారు.

ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో పృథ్వీ షా.. ఓ పార్టీలో సెల్ఫీ అడిగినందుకు గాను తనపై అసభ్యంగా ప్రవర్తించాడని, తనపై దాడి చేయడమే గాక తన ప్రైవేట్ పార్ట్స్ తాకాడని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే.
దీనిపై తాజాగా ముంబై పోలీసులు స్పందించారు. షాపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలని, ఈ వ్యవహారంలో అతడి తప్పేమీ లేదని స్పష్టం చేశారు. ‘షా మీద సప్పా గిల్ చేసి లైంగిక వేధింపుల ఆరోపణలు నిరాధారం. అవన్నీ తప్పుడు ఆరోపణలు. సప్నా తాగి ఉంది. ఆమెనే షా కారును వెంబడించింది. పృథ్వీ సెల్ఫీ అడిగితే ఇవ్వడానిక నిరాకరించడంతో ఇలా చేసింది..’అని తెలిపారు.
ఇది షా కు కాస్త ఊరట కలిగించేదే. ఈ ఏడాది జనవరిలో భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినా తుది జట్టులో అతడికి ఆడే అవకాశం రాలేదు. ఇక ఐపీఎల్ - 16 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడిన అతడు ఈ సీజన్ లో దారుణంగా విఫలమయ్యాడు. వరుసగా ఐదు మ్యాచ్ లలో నిరాశపరచడంతో అతడిని తుది జట్టు నుంచి తప్పించాల్సిన పరిస్థితులు వచ్చాయి.
వీటన్నింటితో పాటు సప్నా కేసు కూడా జతకలవడంతో ఇక పృథ్వీ కెరీర్ ఏమవనుందో అని అతడి అభిమానులు తెగ ఆందోళన చెందారు. కానీ తాజాగా ముంబై పోలీసులు ఇందులో పృథ్వీ తప్పేమీ లేదని తేల్చి చెప్పడంతో అతడితో పాటు షా అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా ఈ కేసులో సప్నా గిల్ ను ముంబై పోలీసులు అరెస్టు చేయగా.. కొద్దిరోజుల తర్వాత ఆమె విడుదలైంది. ఏప్రిల్ లో షా పై కేసు నమోదు చేయాలని ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టుకు ఇచ్చిన ఫిర్యాదులో సప్నా గిల్.. తనతో పాటు వచ్చిన ఠాకూర్ టీనేజర్ అని.. సెల్ఫీ అడిగినందుకు వెళ్లిన తమపై పృథ్వీ స్నేహితుల బృందం దాడి చేశారని పేర్కొంది. ఠాకూర్ పై దాడికి దిగినందుకే తాను సర్దిచెప్పేందుకు మధ్యలోకి వెళ్లానని.. ఈ క్రమంలో షా తనను అసభ్యకరంగా తాకాడని, దురుసుగా ప్రవర్తించాడని తీవ్ర ఆరోపణలు చేసింది.
పృథ్వీతో పాటు పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని సప్నా గిల్ తన ఫిర్యాదులో పేర్కొంది. పృథ్వీ పై కేసు నమోదు చేయడంలో ఎయిర్ పోర్ట్ పోలీసులు సరిగా విధులు నిర్వర్తించలేదని.. పోలీసులు సరిగా స్పందించకపోవడంతోనే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు ఫిర్యాదులో తెలిపింది. తాజాగా ముంబై పోలీసులు మాత్రం ఇవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేయడం గమనార్హం.