IPL 2022: రోహిత్ సేనకు భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అక్కడ మ్యాచులు లేనట్టే..
IPL 2022-Mumbai Indians: ఐపీఎల్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు రోహిత్ సేనకు బీసీసీఐ షాకిచ్చింది. ఆ జట్టుకు హోం అడ్వాంటేజీ కల్పిస్తున్నారని వస్తున్న వార్తలపై బీసీసీఐ స్పందించింది.

వచ్చే నెల 26 నుంచి ముంబై, పూణె, అహ్మదాబాద్ వేదికలలో జరుగబోయే ఐపీఎల్-2022 సీజన్ కు ముందే ఐదు సార్లు లీగ్ విజేత ముంబై ఇండియన్స్ కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు భారీ షాకిచ్చింది.
రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టుకు హోం గ్రౌండ్ అడ్వాంటేజీ లేకుండా చేసింది బీసీసీఐ.. తర్వాతి సీజన్ లో ఆ జట్టు ఆడబోయే మ్యాచులన్నీ ముంబై లో జరగవని బీసీసీఐ స్పష్టం చేసింది.
మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్.. ముంబైలోని వాంఖడే, బ్రబోర్న్, డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంతో పాటు జియో స్టేడియాలలో జరుగుతాయి.
ముంబైతో పాటు పూణెలో కూడా మ్యాచులను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది. లీగ్ మ్యాచులన్నీ ఈ ఐదు వేదికల్లోనే జరుగుతాయి.
అయితే ముంబైలోని వాంఖడే స్టేడియం రోహిత్ సేనకు హోం గ్రౌండ్. ఇక్కడ మ్యాచులు జరిగితే ఆ జట్టుకు ఉండే అడ్వాంటేజీ ఎంతో ఉంటుంది. ముంబై సొంత గ్రౌండ్ గా భావించే ఈ స్టేడియంలో వందలాది మ్యాచులు ఆడిన రోహిత్ సేనకు పిచ్ ఎలా స్పందిస్తుందో పూర్తి అవగాహన ఉంది.
పిచ్ తో పాటు సొంత స్టేడియంలో అభిమానుల నుంచి (ఈసారి ఐపీఎల్ లో 25 శాతం మంది ప్రేక్షకులను అనుమతించనున్నారు) రోహిత్ సేనకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఇవన్నీ ముంబై ఇండియన్స్ కు కలిసొచ్చేవని, ముంబై జట్టును వాంఖడే లో గానీ ఇతర నాలుగు స్టేడియాలలో ఆడనిస్తే అది ఆ జట్టుకు లాభం చేకూర్చినట్టేనని మిగతా ఫ్రాంచైజీలు వాపోయినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. ముంబైని వాంఖండే తో పాటు ఇతర నాలుగు వేదికలలో ఆడించకూడదని తమకు ఏ ఫ్రాంచైజీ ఫిర్యాదు చేయలేదని తెలిపింది. అయితే ముంబై మాత్రం తన మ్యాచులను పూణె స్టేడియంలో ఆడుతుందని స్పష్టం చేసింది.
ఇదే విషయమై బీసీసీఐ అధికారి ఒకరు స్పందిస్తూ.. ‘ముంబై ఇండియన్స్ ముంబైలో మ్యాచులు ఆడదు. పూణెలో ఆడుతుంది. ఈ విషయంలో ఇతర జట్లు ముంబై ఫ్రాంచైజీ మీద బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదు.
అవి కేవలం మీడియా రిపోర్టులు మాత్రమే.. ఒకవేళ ఎవరైనా అలా ఫిర్యాదు చేస్తే దాని గురించి మేం చర్చించి నిర్ణయం తీసుకుంటాం..’ అని తెలిపాడు.