- Home
- Sports
- Cricket
- గుజరాత్ టైటాన్స్ కు బిగ్ షాక్.. కోచ్ పదవి నుంచి తప్పుకోనున్న కిర్స్టెన్.. కారణమిదే..
గుజరాత్ టైటాన్స్ కు బిగ్ షాక్.. కోచ్ పదవి నుంచి తప్పుకోనున్న కిర్స్టెన్.. కారణమిదే..
IPL 2022 GT vs SRH: ఐపీఎల్ లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచుల్లో ఒకే మ్యాచ్ లో ఓడిన ఆ జట్టు కోచ్ గ్యారీ కిర్స్టెన్.. తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు.

ఐపీఎల్ - 2022 సీజన్ లో బ్రేకుల్లేకుండా దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ కు ఆ జట్టు బ్యాటింగ్ కోచ్, మెంటార్ గ్యారీ కిర్స్టెన్ షాక్ ఇవ్వనున్నాడు. త్వరలోనే అతడు కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్టు సమాచారం.
గ్యారీ కిర్స్టెన్ త్వరలోనే ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. రాబోయే రెండు రోజుల్లో ఈ విషయమై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన వెలువరించే అవకాశముంది.
ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు కొత్త సారథిగా బెన్ స్టోక్స్ ను ఖాయం చేసిన ఈసీబీ.. కోచింగ్ పదవిని కిర్స్టెన్ కు కట్టబెట్టనుంది. ఈ మేరకు గ్యారీతో పలుమార్లు సంప్రదింపులు కూడా జరిపిన ఈసీబీకి అతడు తన సమ్మతిని కూడా తెలియజేశాడని ఇంగ్లాండ్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.
అధికారిక ప్రకటన వెలువడితే గ్యారీ ఇంగ్లాండ్ జట్టుతో కలవాల్సి ఉంటుంది. ఒప్పందం మేరకు అతడు ఇంగ్లాండ్ కోచ్ గా ఉండగా మరే జట్టుకు అదే బాధ్యతల్లో పనిచేసే అవకాశం ఉండదు. దీంతో ఈ ఐపీఎల్ తర్వాత అతడు గుజరాత్ టైటాన్స్ ను వీడతాడని తెలుస్తున్నది.
అయితే కొత్త హెడ్ కోచ్ గా ఎంపికైనా గ్యారీ మాత్రం ఇంగ్లాండ్ తో ఐపీఎల్ తర్వాతే కలువనున్నాడు. ఇంగ్లాండ్ జట్టు జూన్ 2 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ ఆడనున్నది. తొలి మ్యాచ్ కు దూరంగా ఉండే గ్యారీ.. జూన్ 10 నుంచి ట్రెంట్ బ్రిడ్జ్ లో జరిగే రెండో మ్యాచ్ కు మాత్రం అందుబాటులో ఉంటాడు.
ఐపీఎల్ మే 29 న ముగియనుంది. అయితే ప్రస్తుతం 7 మ్యాచులాడి 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్.. ప్లేఆఫ్స్ కు దాదాపుగా వెళ్లినట్టే. వాళ్లు ఆడబోయే మరో 7 మ్యాచుల్లో రెండు గెలిచినా పాండ్యా సేన ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. బుధవారం ఆ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ ఆడనున్నది.
కాగా గతేడాది వరుస వైఫల్యాలతో ఇంగ్లాండ్ మాజీ హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్వుడ్.. ఆ జట్టు ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఆ జట్టుకు ఇంగ్లాండ్ మాజీ సారథి పాల్ కాలింగ్వుడ్ తాత్కాలిక హెడ్ కోచ్ గా ఉన్నాడు. న్యూజిలాండ్ తో తొలి టెస్టులో కూడా అతడే కోచ్ గా వ్యవహరించనున్నాడు.
దక్షిణాఫ్రికా జట్టు నుంచి రిటైర్ అయ్యాక గ్యారీ భారత జట్టుకు 2008 నుంచి 2011 వరకు హెడ్ కోచ్ గా పనిచేశాడు. అతడి మార్గదర్శకత్వంలోనే భారత జట్టు 28 ఏండ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ నెగ్గింది. ఆ తర్వాత గ్యారీ రెండేండ్ల పాటు సౌతాఫ్రికాకు, ఆ తర్వాత పలు ఫ్రాంచైజీలకు హెడ్ కోచ్ గా పనిచేశాడు.