'మీ సామర్థ్యాలను నమ్మండి.. కష్టపడి పనిచేయండి'.. భారత స్టార్ క్రికెటర్ కామెంట్స్ వైరల్
Delhi Premier League 2024 : టీమిండియా స్టార్ బౌలర్ ఇషాంత్ శర్మ ఢిల్లీ ప్లేయర్ల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. క్రికెట్ ఫార్మాట్ ఏదైనా కష్టమైనది కావచ్చు కానీ, ప్లేయర్లు వారి సామర్థ్యాలపై విశ్వాసం ఉంచి కష్టపడితే మంచి ఫలితాలు తీసుకువస్తారని అన్నారు.
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ ఆగస్టు 17న ప్రారంభమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో దక్షిణ ఢిల్లీ సూపర్‌స్టార్స్‌తో పురాణి డిల్లీ 6 పోటీపడింది. రిషబ్ పంత్ నేతృత్వంలోని జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 197/3 స్కోరు చేసినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయింది.
భారత క్రికెటర్, వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ డిల్లీ 6 కు చెందిన 20 మంది సభ్యుల జట్టులో భాగమైనప్పటికీ పంత్ అండ్ టీమ్ మేనేజ్‌మెంట్ యువకులతో ముందుకు సాగడంతో ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోలేకపోయాడు.
ఏది ఏమైనప్పటికీ ఇషాంత్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగమైనందుకు ఎంత థ్రిల్‌గా ఉన్నట్టు తెలిపాడు. ఎందుకంటే మొదటిసారిగా తన సొంత ప్రాంతంలో జరుగుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. 35 ఏళ్ల ఈ సీనియన్ బౌలర్ కు 165 టీ20 మ్యాచ్ లు ఆడిన ఆనుభవం ఉంది. ఇది యువకులతో కూడిన జట్టుకు ప్రేరణ కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు.
ఈ క్రమంలో ఇషాంత్ శర్మ మాట్లాడుతూ.. "ఢిల్లీ ప్రీమియర్ లీగ్ కోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఢిల్లీలో లీగ్ తొలిసారిగా జరుగుతోంది. యువ ఆటగాళ్లకు నా సందేశం ఒక్కటే.. కష్టపడి పనిచేయడం.. మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచడం.. ఈ ఫార్మాట్ క్రూరమైనది కావచ్చు, కానీ మీరు మీపై నమ్మకం ఉంచితే గెలుపు మీ సొంతం. సామర్థ్యాలు-కష్టపడి పని చేస్తే మీరు ఏ ఫార్మాట్‌లోనైనా అద్భుతాలు చేయగలరు" అని ఇషాంత్ పేర్కొన్నాడు.
"నేను చాలా కాలంగా రిషబ్‌తో కలిసి ఆడుతున్నాను, అతనితో ఆడటం నాకు ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది" అని ఇషాంత్ చెప్పాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ మొదటి ఎడిషన్‌లో 33 పురుషులు, 7 మహిళల మ్యాచ్ లు సహా మొత్తం 40 మ్యాచ్‌లు జరుగుతాయి. అన్నీ కూడా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతాయి. టోర్నమెంట్ ఆగస్ట్ 17 నుండి సెప్టెంబర్ 8 వరకు కొనసాగనుంది.