- Home
- Sports
- Cricket
- తాను పోయే లోపు ఆ పని చేసి వెళ్తానంటున్న అఫ్రిది.. బీసీసీఐని ఫాలో అవుతున్న పాక్ చీఫ్ సెలక్టర్
తాను పోయే లోపు ఆ పని చేసి వెళ్తానంటున్న అఫ్రిది.. బీసీసీఐని ఫాలో అవుతున్న పాక్ చీఫ్ సెలక్టర్
పాకిస్తాన్ మాజీ సారథి, ఇటీవలే పాక్ తాత్కాలిక చీఫ్ సెలక్టర్ గా నియమితుడైన షాహిద్ అఫ్రిది తన తొలి విలేకరుల సమావేశంలో భారీ శపథాలు చేశాడు. తన పదవీకాలం ముగిసేలోపు పాకిస్తాన్ క్రికెట్ లో...

కొద్దిరోజుల క్రితమే రమీజ్ రాజా అండ్ కో. ను తప్పించిన పాకిస్తాన్ ప్రభుత్వం.. మాజీ సారథి షాహిద్ అఫ్రిదికి చీఫ్ సెలక్టర్ బాధ్యతలు అప్పగించింది. అయితే తన తొలి పాత్రికేయుల సమావేశంలో అఫ్రిది.. మంగమ్మ శపథాలు చేశాడు. మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్, మాజీ పేసర్ ఇఫ్తికార్ అంజుమ్, హరూన్ రషీద్ లతో కలిసిన సెలక్షన్ కమిటీ త్వరలో సమావేశం కానున్న నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్తాన్ క్రికెట్ టీమ్ బెంచ్ ను బలోపేతం చేస్తానని అఫ్రిది శపథం పూనాడు. తాను పదవి నుంచి దిగిపోయేవరకు పాకిస్తాన్ క్రికెట్ లో రెండు పటిష్టమైన క్రికెట్ టీమ్స్ ను తయారుచేస్తానని అన్నాడు. ఆ విషయంలో రాజీ పడే సవాలే లేదని చెప్పాడు.
ఈ మేరకు శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘చీఫ్ సెలక్టర్ గా నా పదవీ కాలం ముగిసేలోపు పాక్ క్రికెట్ టీమ్ బెంచ్ ను బలోపేతం చేస్తా. నేను పాకిస్తాన్ కోసం ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉండేలా రెండు జట్లను తయారుచేస్తా..’ అని తెలిపాడు.
ప్రధాన జట్టుకు సమాంతరంగా మరో జట్టును తయారుచేయడం పాకిస్తాన్ కు కొత్తగా అనిపిస్తున్నప్పటికీ ప్రపంచ క్రికెట్ లో అది పాత చింతకాయ పచ్చడే. ఇంగ్లాండ్ (ఈసీబీ), ఇండియా (బీసీసీఐ) ఇవి కొద్దికాలంగా అమలుపరుస్తున్న విధానాలే. ఏకకాలంలో ఆ జట్లు రెండు దేశాలతో ఆడేంత సామర్థ్యం సాధించుకున్నాయి.
2021లో భారత జట్టు ఇంగ్లాండ్ లో టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్తే.. ద్వితీయ శ్రేణి జట్టు శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడింది. 2022లో కూడా టీమిండియా టీ20 ప్రపంచకప్ ఆడేందుకు వెళ్తే.. ఇక్కడ శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జట్టు.. దక్షిణాఫ్రికా ప్రధాన జట్టుతో పోటీ పడి సిరీస్ నెగ్గింది.
ఇంగ్లాండ్ కూడా గత జూలై లో బెన్ స్టోక్స్ సారథ్యంలో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడగా ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలోని జట్టు ఐర్లాండ్ తో వన్డే సిరీస్ ఆడింది. ఇప్పుడు పాకిస్తాన్ చెప్పేది కూడా అదే. ఆ జట్టుకు గాయాల బెడద వేధిస్తున్నది. కీలక టోర్నీలకు ముందు ప్రధాన ఆటగాళ్లు గాయపడటంతో పాక్ కు కష్టాలు తప్పడం లేదు.
షాహీన్ అఫ్రిది గాయంతో తప్పుకోవడంతో ఆ జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంది. ఇక ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో షాహీన్ తో పాటు ఆ జట్టు ప్రధాన పేసర్లు హరీస్ రౌఫ్, నసీమ్ షాలు కూడా చివరి రెండు టెస్టులకు దూరమయ్యారు. దీంతో అంతగా అనుభవం లేని బౌలర్లతో పాకిస్తాన్ బరిలోకి దిగి సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు షాహిద్ అఫ్రిది ఆ లోటును పూడ్చి ప్రధాన జట్టుకు సమాంతరంగా మరో జట్టును తయారుచేస్తానంటున్నాడు. మరి ఈ ప్రయత్నంలో అతడు ఏ మేరకు విజయవంతమవుతాడనేది కాలమే నిర్ణయించనుంది.