- Home
- Sports
- Cricket
- జాలి, దయ వద్దు.. కఠినంగా ఉండండి.. సీనియర్ అయినా సరే పక్కనపెట్టేయండి : టీమిండియాపై గవాస్కర్ ఆగ్రహం
జాలి, దయ వద్దు.. కఠినంగా ఉండండి.. సీనియర్ అయినా సరే పక్కనపెట్టేయండి : టీమిండియాపై గవాస్కర్ ఆగ్రహం
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత్ ఓటమి అభిమానులతో పాటు దిగ్గజ ఆటగాడు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ను కూడా ఆవేదనకు గురి చేసింది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టు ఆసీస్ చేతిలో ఓడిపోవడాన్ని అభిమానులతో పాటు మాజీ సారథి సునీల్ గవాస్కర్ కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన పలు విషయాలపై చాలా ఆవేశంగా మాట్లాడాడు. ఇంత చెత్త అప్రోచ్ తో ఐసీసీ టైటిల్స్ గెలవడం అసాధ్యమని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత గవాస్కర్ మాట్లాడుతూ... ‘ఓటమి తర్వాత అయినా టీమ్ మేనేజ్మెంట్, హెడ్‌కోచ్, కెప్టెన్ హానెస్ట్ గా ఉండాలి. అంతేకాదు డబ్ల్యూటీసీ ఫైనల్ లో మనం ఎందుకు ఓడాం..? ఈ మ్యాచ్ లో ఫాలో అయిన అప్రోచ్ ఏంటి..? ఈ అప్రోచ్ తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ను గెలవగలమా..?
టీమ్ సెలక్షన్ ఎలా ఉంది...? టాస్ గెలిచినప్పుడు నిర్ణయం తీసుకునే క్రమంలో ఏం కసరత్తులు చేశారు..? వీటన్నింటిపై నిజాయితీగా నిజాలు చెప్పాలి..’అని అన్నాడు. భారత జట్టు ఆసియా కప్పులు గెలిచినంత మాత్రానా గొప్ప కాదని.. వరల్డ్ టైటిల్స్ గెలిచే సత్తా తమకు ఉందా..? అన్నది బేరీజు వేసుకోవాలని సూచించాడు.
ఒకవేళ అలాంటి సత్తా లేనప్పుడు జట్టులో మార్పులు చేయాలని గవాస్కర్ సూచించాడు. ఇందులో భాగంగా జాలి, దయ వంటివి చూడకూడదని.. కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సన్నీ తెలిపాడు. ఒకవేళ ఎవరైనా సీనియర్ ప్లేయర్ సరిగ్గా పర్ఫామ్ చేయకుంటే అతడు ఎంత పెద్ద ప్లేయర్ అయినా వేటు వేయాల్సిందేనని.. ఈ విషయంలో ఎవరిపైనా జాలి చూపించాల్సిన అవసరం లేదని చెప్పాడు.
బాగా ఆడనివారిని తప్పించి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించాలని సన్నీ సూచించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ లో కోహ్లీ, రోహిత్, పుజారాల షాట్ సెలక్షన్ చెత్తగా ఉందని.. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని అన్నాడు.
మ్యాచ్ ఓడిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ ద్రావిడ్.. గంగూలీతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై గవాస్కర్ స్పందించాడు. ‘ఇతర దేశాల బ్యాటర్ల యావరేజ్ లు తగ్గుతున్నాయా..? లేదా..? అన్నది అనవసరం. మనం టీమిండియా గురించి మాట్లాడుకుంటున్నాం. భారత బ్యాటర్ల యావరేజ్ విదేశాలలో దారుణంగా తగ్గుతోంది. ఇది జట్టు వైఫల్యాలకు దారి తీస్తోంది. విదేశాలలో బౌలర్లు అంతో ఇంతో రాణించినా బ్యాటర్లు మాత్రం విఫలమవుతున్నారు.
అందరూ విఫలమవుతున్నారని నేను చెప్పడం లేదు. కానీ చాలా మంది ఇదే దారిలో ఉన్నారు. మ్యాచ్ లు ఇండియాలో ఆడితే వాళ్లు బ్యాటింగ్ లో ఇరగదీస్తున్నారు. కానీ విదేశాలలో ఆడితే మాత్రం ఎందుకు జీరోలు అవుతున్నారు..? దీనిపై ఏదో ఒకటి చేయాలి. లేకుంటే రాబోయే రోజుల్లో మరిన్ని దారుణ పరాజయాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది..’అని చెప్పాడు.