- Home
- Sports
- Cricket
- ఐదు నెలలు కూడా లేదు.. ఇంకా షెడ్యూలే రాలేదు.. బీసీసీఐ, ఐసీసీ తీరుపై టీమ్స్ అసంతృప్తి..!
ఐదు నెలలు కూడా లేదు.. ఇంకా షెడ్యూలే రాలేదు.. బీసీసీఐ, ఐసీసీ తీరుపై టీమ్స్ అసంతృప్తి..!
ODI WC 2023 Schedule: ఐపీఎల్ -16 సీజన్ తో బిజీబిజీగా గడుపుతున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి తో పాటు అంతర్జాతీయ క్రికెట్ మండలి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగనుంది. ఇదివరకే వరల్డ్ కప్ సూపర్ లీగ్ లో టాప్ - 8 లో ఉన్న జట్లు ప్రపంచకప్ కు నేరుగా అర్హత సాధించి ఉండగా జూన్ నుంచి జింబాబ్వే వేదికగా క్వాలిఫై రౌండ్ కూడా జరగాల్సి ఉంది. అయితే సమయం ముంచుకొస్తున్నా బీసీసీఐ, ఐసీసీలు ఇంకా వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేయకపోవడంపై మిగిలిన జట్లు, ఆయా దేశాల క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ మొదలవనుందని ఇప్పటికే పలు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ తుది షెడ్యూల్ రాలేదు. బీసీసీఐ, ఐసీసీలు దానికి ఫైనల్ టచ్ ఇస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై బీసీసీఐ నుంచి గానీ ఐసీసీ నుంచి గానీ అధికారిక ప్రకటన రాలేదు.
ఇదే ఇప్పుడు మిగతా దేశాల క్రికెట్ బోర్డులను, ఆ దేశాల అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నది. సాధారణంగా ఐసీసీ వంటి బడా ఈవెంట్లు ఉంటే ఆరు నెలల ముందుగానే షెడ్యూల్ విడుదలవుతుంది. గతేడాది ఆసీస్ వేదికగా ముగిసిన టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ లో జరుగగా అంతకు ఆరు నెలలు ముందుగానే షెడ్యూల్ విడుదలైంది. కానీ ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ కోసం ఇంకా ఐదు నెలలు కూడా గడువు లేదు. అయినా బీసీసీఐ ఇంకా షెడ్యూల్ విడుదల చేయలేదు.
వరల్డ్ కప్ అంటే అదేదో ఐపీఎల్, ద్వైపాక్షిక సిరీస్ లను నిర్వహించినంత ఈజీ కాదు. వివిధ దేశాల నుంచి భారత్ కు వచ్చే క్రికెట్ ఫ్యాన్స్ ముందుగానే ట్రావెల్ ప్లాన్స్ పెట్టుకుంటారు. టీమ్స్ కూడా ఆ మేరకు ప్రిపేర్ అవుతుంటాయి. ఎవరిని ఆడించాలి..? ఎవరైతే కరెక్ట్..? వంటివి బేరీజు వేసుకుంటాయి. అవసరమైతే ప్రిపరేషన్స్ లో భాగంగా మరో దేశంతో ద్వైపాక్షిక సిరీస్ లను కూడా రూపకల్పన చేసుకోవాల్సి ఉంటుంది.
అంతేగాక షెడ్యూల్ ను బట్టి రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్స్ స్టేడియాలలో పెండింగ్ పనులు, పర్మిషన్లు వంటి పనులు పూర్తి చేసుకునే వీలు చిక్కుతుంది. అసలే ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని దేశంలోని హైదరాబాద్, వాంఖెడే, కోల్కతా లలోని స్టేడియాలను బీసీసీఐ పునర్నిర్మాణిస్తున్నది. దానికి కూడా చాలా టైమ్ పట్టే అవకాశం లేకపోలేదు.
Image credit: PTI
కాగా బీసీసీఐ వర్గాల మేరకు ఐపీఎల్ -16 ముగిసిన వెంటనే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ను గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఐపీఎల్ ఫైనల్స్, డబ్ల్యూటీసీ ఫైనల్స్ మధ్యలో ఈ ఈవెంట్ ఉండొచ్చని సమచారం.