ఐపీఎల్ మినీ వేలం తేదీని ఖరారు చేసిన బీసీసీఐ.. పర్స్ వాల్యూపై తుది నిర్ణయం..!
IPL 2023 Auction: ఈ ఏడాది క్రికెటర్లకు పండుగే. ఇదివరకే ఫిబ్రవరిలో ఐపీఎల్-15 సీజన్ కోసం మెగా వేలం నిర్వహించిన బీసీసీఐ తాజాగా మరో వేలం జరపనుంది. మెగా వేలం నిర్వహించిన బెంగళూరులోనే ‘మినీ వేలం’ను నిర్వహించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.

IPL 2022 Mega Auction in bengaluru
భారత క్రికెట్ కు కాసుల పంట పండిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో తదుపరి సీజన్ కోసం నిర్వహించబోయే వేలం తేదీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఖరారుచేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి.
ఐపీఎల్ తర్వాత సీజన్ 2023 మార్చి చివరివారం నుంచి ప్రారంభించేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తున్నది. కోవిడ్ కారణంగా గత మూడు సీజన్లుగా కళ తప్పిన ఐపీఎల్ ను ఈ ఏడాది నుంచి మునపటి వైభవం సాధించే దిశగా ప్రణాళికలు రచిస్తున్న విషయం తెలిసిందే.
ఈ మేరకు 2023 సీజన్ ను హోమ్ అండ్ అవే (ఇంటా బయటా) పద్ధతిలో నిర్వహించనున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గతంలోనే వెల్లడించాడు. తాజాగా ఈ సీజన్ కోసం బీసీసీఐ.. మినీ వేలం ప్రక్రియను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది.
ఈ ఏడాది డిసెంబర్ 16న ఐపీఎల్ వేలం నిర్వహించనున్నది. అయితే ఇది ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన మెగా వేలం వంటిది కాదు. దీనిని బీసీసీఐ ‘మినీ వేలం’గా జరపనుంది. మెగా వేలం నిర్వహించిన బెంగళూరులోనే మినీ వేలం కూడా నిర్వహించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.
ఏజీఎంలో మినీ వేలం తేదీ ఖరారు చేయడంతో పాటు ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను రూ. 90 కోట్ల నుంచి రూ. 95 కోట్లకు పెంచనున్నారని సమాచారం. అక్టోబర్ 18న ముంబైలో నిర్వహించే ఆన్యూవల్ జనరల్ మీటింగ్ (సాధారణ వార్షిక సమావేశం - ఏజీఎం) లో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తున్నది.
మినీ వేలానికి సంబంధించి గతంలో బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఇది మినీ వేలం. గతేడాది నిర్వహించిందే మెగా వేలం. తర్వాత వచ్చే మూడేండ్లూ మినీ వేలాలే. ఫ్రాంచైజీలు తమ జట్లలో సర్దుబాట్లు చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ ఏడాది వేలం ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఏజీఎం తర్వాత తెలుస్తాయి..’ అని చెప్పాడు.
ఇక ఈసారి వేలంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్లేయర్ రవీంద్ర జడేజా. పదేండ్లుగా సీఎస్కేతో ఆడుతున్న జడ్డూ.. వచ్చే సీజన్ లో ఫ్రాంచైజీ మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే జడేజా-సీఎస్కే మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఐపీఎల్-15లో అతడికి సారథ్యం కట్టబెట్టి మధ్యలోనే దాన్నుంచి తొలగించడంతో జడ్డూ కోపంగా ఉన్నాడు.