- Home
- Sports
- Cricket
- కపిల్ దేవ్ 175 కాదు.. 83లో మా గేమ్ ఛేంజింగ్ మూమెంట్ అదే.. బీసీసీఐ అధ్యక్షుడి షాకింగ్ కామెంట్స్
కపిల్ దేవ్ 175 కాదు.. 83లో మా గేమ్ ఛేంజింగ్ మూమెంట్ అదే.. బీసీసీఐ అధ్యక్షుడి షాకింగ్ కామెంట్స్
భారత క్రికెట్ జట్టు తొలి వన్డే ప్రపంచకప్ నెగ్గి నిన్నటి (జూన్ 25)కి 40 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆనాటి టీమ్ అంతా రీయూనియన్ అయింది.

భారత క్రికెట్ జట్టులో సువర్ణధ్యాయాలతో లిఖించిదగ్గ అపురూప ఘట్టం 1983 వన్డే వరల్డ్ కప్ విజయం. ఈ విజయం ఇచ్చిన జోష్ తో టీమిండియా క్రికెట్ లో పెను మార్పులు సంభవించాయి. యువతరం క్రికెట్ ను కెరీర్ గా మొదలుపెట్టింది అప్పట్నుంచే.. సచిన్, ద్రావిడ్, గంగూలీ, అజారుద్దీన్ వంటి ఎంతోమంది దిగ్గజాలకు ఆ విజయం స్ఫూర్తినిచ్చింది.
అయితే 1983లో భారత్ ఆడిన అన్ని మ్యాచ్ లలో వ్యక్తిగత ప్రదర్శనల విషయానికొస్తే జింబాబ్వే మీద 20 పరుగులలోపే 5 వికెట్లు కోల్పోయిన దశలో నాటి సారథి కపిల్ దేవ్ చేసిన అద్భుతమైన ఇన్నింగ్స్ చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. జింబాబ్వే బౌలర్లను చీల్చి చెండాడుతూ కపిల్ దేవ్ ఆ మ్యాచ్ లో 175 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
కానీ వరల్డ్ కప్ లో భారత్ కు గేమ్ ఛేంజింగ్ మూమెంట్ అయితే కపిల్ దేవ్ 175 కాదంటున్నాడు నాటి టీమ్ లో మెంబర్, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న రోజర్ బిన్నీ. ఒడిదొడుకుల మధ్య ఇంగ్లాండ్ వెళ్లిన తమకు నాటి డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ తో ఆడిన తొలి మ్యాచ్ లో ఇచ్చిన విజయం చాలా ప్రత్యేకమైందని బిన్నీ చెప్పాడు.
వరల్డ్ కప్ విజయానికి 40 ఏండ్లు పూర్తైన సందర్భంగా స్పోర్ట్స్ స్టార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిన్నీ మాట్లాడుతూ... ‘మేం వరల్డ్ కప్ గెలిచి 40 ఏండ్లు అయింది. కానీ నాకైతే అదేదో నిన్నా మొన్న ముగిసినట్టుగానే ఉంది. నాటి జ్ఞాపకాలు నా మైండ్ లో ఇంకా ఫ్రెష్ గా ఉన్నాయి. అప్పటి ప్రతీ మూమెంట్ నాకు గుర్తుంది.
అయితే ఆ టోర్నీలో మాకు గేమ్ ఛేంజింగ్ మూమెంట్ ఏదైనా ఉందా..? అంటే మాత్రం నేనైతే కచ్చితంగా మా తొలి మ్యాచ్ ను వెస్టిండీస్ మీద గెలవడమే అని చెబుతాను. లీగ్ దశలో భాగంగా మేం ఓల్డ్ ట్రాఫోర్డ్ (మాంచెస్టర్) లో వెస్టిండీస్ తో మ్యాచ్ ఆడాం. మా ప్రయాణం అక్కడే మొదలైంది.
అప్పటిదాకా మా సామర్థ్యం ఏంటో మాక్కూడా తెలిసేది కాదు. కానీ మేం ఆరోజు వెస్టిండీస్ ను ఓడించిన తర్వాత తెలిసింది మేం ఏదైనా సాధించగలమని... జూన్ 25న జరిగిన ఫైనల్ కంటే కూడా జూన్ 9 మాకు ఎంతో ముఖ్యమైంది. ఇక ఫైనల్ లో మేం విండీస్ ను మరోసారి ఓడించాం...’అని చెప్పాడు.