Team India: విరాట్, రోహిత్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
Team India: రాబోయే వన్డే వరల్డ్ కప్ జట్టులో ఉండరనే రిపోర్టుల మధ్య విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ కొత్త ప్లాన్ రెడీ చేసింది. ఇద్దరు సీనియర్ స్టార్ ప్లేయర్లపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టింది.

విరాట్, రోహిత్ భవిష్యత్తుపై ప్రశ్నలు
భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భవిష్యత్తుపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ ఇద్దరూ గతేడాది టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 2025 మేలో ఐపీఎల్ మధ్యలోనే టెస్ట్ క్రికెట్ నుంచి కూడా రిటైర్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ప్రస్తుతం ఈ స్టార్ ప్లేయర్లు వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే 2027 క్రికెట్ ప్రపంచ కప్‌కు ముందు తమ ఆట సమయం, ప్రణాళికలపై వారు క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో రాబోయే వన్డే ప్రపంచ కప్ జట్టులో ఉండరనే రిపోర్టులు సంచలనం రేపాయి.
KNOW
రోహిత్, విరాట్ కోసం బీసీసీఐ కొత్త ప్లాన్
బీసీసీఐ ఈ ఇద్దరికి విజయ్ హజారే ట్రోఫీ పూర్తి సీజన్ ఆడే భారం తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళిక చేస్తోంది. వీరిని ‘ఇండియా A’ మ్యాచ్‌లలో ఆడేలా ప్రోత్సహించనుంది. ఇదివరకు వెలువడిన నివేదిక ప్రకారం.. 2027 ప్రపంచ కప్ ప్రణాళికలో భాగం కావాలంటే విజయ్ హజారే ట్రోఫీలో ఆడటం తప్పనిసరి అని చర్చ మొదలైంది. అయితే, తాజా సమాచారం ప్రకారం, మొత్తం ట్రోఫీ ఆడటం ఈ ఇద్దరికి సాధ్యం కాని పరిస్థితి ఉంది. అందుకే వీరికి బీసీసీఐ కొత్త ప్లాన్ రెడీ చేసింది.
ఇండియా A మ్యాచ్‌లు ఆడనున్న రోహిత్, విరాట్
బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం... నవంబరులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ల మధ్యలో ఇండియా A, దక్షిణాఫ్రికా A మధ్య రాజ్‌కోట్‌లో మూడు 50 ఓవర్ల మ్యాచ్‌లు (నవంబర్ 13, 16, 19) జరగనున్నాయి. విజయ్ హజారే ట్రోఫీకి ముందు ఈ మ్యాచ్‌లు ఆడటం ద్వారా ఆటలో ఫిట్‌నెస్, ఫామ్ మెయింటెయిన్ చేయడం వీరి లక్ష్యం కావచ్చు.
భారత జట్టు ఎంపిక కమిటీ నిర్ణయం కీలకం
బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు.. ఈ ‘A’ మ్యాచ్‌ల్లో ఆడాలా లేదా అనేది చివరకు ఎంపిక కమిటీపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్లు ఈ ఇద్దరికి ప్రాధాన్యత ఇవ్వాలా అన్నది నిర్ణయించాలి. అలాగే, ఈ మ్యాచ్‌లకు ముందు ఆడే ఆరు వన్డే మ్యాచ్‌లు కూడా వీరి ప్రణాళికలో ప్రభావం చూపవచ్చు.
విజయ్ హజారేలో అవకాశాలు తక్కువతో..
విజయ్ హజారే ట్రోఫీ 2025 డిసెంబర్ 24 నుంచి 2026 జనవరి 18 వరకు జరుగుతుంది. ఇదే సమయంలో భారత్-న్యూజిలాండ్ వన్డేలు (జనవరి 11, 14, 18) జరుగుతాయి. కాబట్టి విరాట్, రోహిత్ ట్రోఫీ ఆడినా రెండు లేదా మూడు మ్యాచ్‌లకే పరిమితమవుతారని అంచనా.
దీంతో, బీసీసీఐ వీరిని పూర్తిగా దేశీయ ట్రోఫీ భారం నుంచి తప్పించి, ఎంపిక చేసిన ఇండియా A మ్యాచ్‌ల్లో ఆడేలా ప్రణాళిక చేస్తోంది. దీంతో రాబోయే వన్డే ప్రపంచ కప్ వరకు వీరిని ఫామ్ లో ఉంచేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోందని క్రికెట్ సర్కిల్ లో చర్చ సాగుతోంది. అంటే రోహిత్, కోహ్లీలను మరో ఐసీసీ ట్రోఫీలో కూడా చూడవచ్చు.