- Home
- Sports
- Cricket
- పదవీకాలం ముగిసినా కుర్చీలను వదలమంటున్న బీసీసీఐ బాసులు.. కోర్టుమెట్లెక్కిన దాదా అండ్ కో
పదవీకాలం ముగిసినా కుర్చీలను వదలమంటున్న బీసీసీఐ బాసులు.. కోర్టుమెట్లెక్కిన దాదా అండ్ కో
BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సుప్రీంకోర్టు తలుపుతట్టింది. బీసీసీఐ రాజ్యాంగ సవరణ మీద అత్యవసర విచారణ జరపాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా లు పదవీకాలం పొడగించేందుకు యత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు బీసీసీఐ బాసులు రాజ్యాంగాన్ని మార్చాలని కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 2019 లో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షాలు తమ పదవులు చేపట్టారు. వీరి పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ తో ముగియాల్సి ఉంది. అయితే కొత్త పాలకవర్గం ఎంపికయ్యే వరకు తమకు కూలింగ్ పీరియడ్ ను పొడిగించాలని కోరుతూ దాదా అండ్ కో కోర్టు మెట్లెక్కింది.
కూలింగ్ పీరియడ్ అంటే.. పదవీకాలం ముగిసినప్పటి నుంచి కొత్త పాలకమండలి ఏర్పాటయ్యేవరకు పాత వారినే కొనసాగించడం అని అర్థం. ఈ మేరకు బీసీసీఐ రాజ్యాంగ సవరణ చేసుకునేందుకు వీలుగా తమకు అవకాశం కల్పించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ సిఫార్సుల మేరకు బీసీసీఐ లేదా రాష్ట్రాల క్రికెట్ బోర్డులలో కొనసాగాలంటే అత్యధికంగా ఆరేళ్లకు మించి పని చేయకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వస్తే మధ్యలో మూడేండ్ల కూలింగ్ పీరియడ్ అనే నిబంధన ఉంది.
అయితే 2019 లో బీసీసీఐ రాజ్యాంగంలో సవరణ చేశారు. దీని ప్రకారం బోర్డులోని సభ్యులు ఆరేండ్లు దాటినా ఆ పదవిలో కొనసాగేందుకు వీలు కల్పించారు. ఈ సవరణ మేరకే గంగూలీ, జై షా ఈ సెప్టెంబర్ తో తమ పదవీ కాలం ముగుస్తున్నా పదవీలో మరికొన్నాళ్లదాకా కొనసాగొచ్చు. బీసీసీఐ రాజ్యాంగంలో చేసిన ఈ సవరణలను అంగీకరించాలని కోరుతూ 2020 ఏప్రిల్ లో బీసీసీసీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.
అప్పుడు కరోనా కారణంగా మిగతా అంశాల విచారణ లో ఈ పిటిషన్ కు కోర్టు అంతగా ప్రాధాన్యమివ్వలేదు. కానీ గంగూలీ అండ్ కో పాలక వర్గం పదవీకాలం ముగుస్గుండటంతో ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని బీసీసీఐ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కాగా ఇందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. వచ్చే వారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశాన్ని విచారిస్తుందని తెలిపింది.
దాదా బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టకముందే బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) లో సుదీర్ఘకాలం పనిచేశాడు. జై షా కూడా బీసీసీఐ సెక్రటరీ కాకముందు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ లో సభ్యుడిగా ఉన్నాడు. నిబంధనల ప్రకారం 2020 జులైలోనే వీరి పదవీకాలం ముగిసింది. కానీ బీసీసీఐ చేసిన సవరణ కారణంగా వీళ్లింకా పదవిలో కొనసాగుతున్నారు.