ఓపెనర్‌గా వస్తే ఏమీ అర్థం కాదు.. ఈ ప్లేస్‌లో బ్యాటింగ్ చేయడమే బాగుంది : కెఎల్ రాహుల్
INDvsSL: ఇండియా-శ్రీలంక మధ్య గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసిన రెండో వన్డేలో భారత్ విజయం కీలక పాత్ర పోషించాడు వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్. ఈ మ్యాచ్ లో రాహుల్ ఆచితూచి ఆడి భారత్ కు విజయాన్ని అందించాడు.
గతంలో టీమిండియాకు ఓపెనర్ గా వచ్చిన కెఎల్ రాహుల్.. గత రెండు సిరీస్ లుగా తన స్థానాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. వన్డేలలో కొత్త ఓపెనర్ శుభమన్ గిల్ నిలకడగా రాణిస్తుండటంతో రాహుల్ స్థానాన్ని అతడు భర్తీ చేస్తున్నాడు. రాహుల్.. ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్నాడు.
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని భారత జట్టు రాహుల్ కు అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. అతడు గతంలో మాదిరిగా జట్టులో కేవలం బ్యాటర్ గా ఉంటే చాలదు. వికెట్ కీపర్ గా కూడా టీమ్ కు సేవలందించాల్సి వస్తున్నది. రిషభ్ పంత్ కు గాయం అవడంతో టీమిండియా రాహుల్ మీదే ఆధారపడుతున్నది.
శ్రీలంకతో వన్డే సిరీస్ లో భాగంగా రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్నాడు. తొలి వన్డేలో ఉన్నది తక్కువసేపే అయినా రాహుల్ మెరుపులు మెరిపించాడు. అలాగే రెండో వన్డేలో 216 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్.. 62 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో బ్యాటింగ్ కు వచ్చి శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
మ్యాచ్ అనంతరం రాహుల్ ఇదే విషయమై స్పందిస్తూ.. ‘మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు రావడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. గేమ్ ను బాగా అర్థం చేసుకోవచ్చు. ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే హడావిడిగా మళ్లీ ఓపెనింగ్ కు వెళ్లాలన్న టెన్షన్ ఉండదు. హాయిగా స్నానం చేసి నచ్చింది తిని మ్యాచ్ ను ఎంజాయ్ చేయొచ్చు. నేను బ్యాటింగ్ కు వెళ్లే సమయం వరకు మ్యాచ్ ను, పరిస్థితులను బాగా అర్థం చేసుకోవచ్చు.
మనం బ్యాటింగ్ కు వెళ్లేసరికి గేమ్ ఎలా ఉందనేది అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుంది. దాంతో పరిస్థితులను బట్టి మనం ఆడొచ్చు. నేను గతంలో మిడిలార్డర్ లోనే ఆడేవాడిని. 2019లో శిఖర్ ధావన్ కు గాయం కారణంగా నన్ను ఓపెనర్ గా రమ్మన్నారు. ఆ తర్వాత వికెట్ కీపింగ్ చేయమన్నారు. ఇప్పుడు మళ్లీ మిడిలార్డర్ కు వెళ్లాను. ఇవన్నీ భలే ఫన్నీగా ఉన్నాయి. రోహిత్ శర్మ తనకు నా నుంచి ఏం కావాలో అది చెప్పాడు. అతడు ఎప్పుడూ నాకు సపోర్ట్ గా ఉంటాడు..’ అని అన్నాడు.
ఇక నిన్నటి మ్యాచ్ లో తమ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారని, ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి తీసుకొచ్చారని కొనియాడాడు. అయితే ఛేదనలో తమకు పరిస్థితులు అంత అనుకూలంగా ఏమీ లేవని.. లంక బౌలర్లు తమపై ఒత్తిడి తీసుకొచ్చారని రాహుల్ అన్నాడు. సాధించాల్సిన లక్ష్యం మరీ పెద్దదేమీ కాకపోవడంతో క్రీజులో నిలిస్తే గెలవడం అంత కష్టమేమీ కాదని అర్థమైనాక తాను కూడా అందుకు తగ్గట్టుగా ఆటను మార్చుకున్నానని చెప్పాడు.