- Home
- Sports
- Cricket
- బాబర్‌కు కోహ్లీతో పోలికా.. అంత సీన్ లేదు.. పాక్ సారథి ఓ పెద్ద జీరో: పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ కామెంట్స్
బాబర్‌కు కోహ్లీతో పోలికా.. అంత సీన్ లేదు.. పాక్ సారథి ఓ పెద్ద జీరో: పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ కామెంట్స్
Babar Azam: పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ ను ఆ జట్టు అభిమానులు, మాజీ క్రికెటర్లు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పోలుస్తారు. అయితే బాబర్ కు అంత సీన్ లేదని, అతడో పెద్ద జీరో అని అంటున్నాడు అదే దేశానికి చెందిన మాజీ ఆటగాడు కనేరియా.

స్వదేశంలో ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ జట్టు సారథి బాబర్ ఆజమ్ పై ఆ జట్టు మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాబర్ ను కోహ్లీతో పోల్చడం తెలివితక్కువ పని అని.. అతడికి అంత సీన్ లేదని కనేరియా విమర్శించాడు. టీమిండియాలో రోహిత్, కోహ్లీలు దిగ్గజాలు అని, వారితో బాబర్ ను పోల్చి వాళ్ల స్థాయిని తగ్గించొద్దని సూచించాడు.
రావల్పిండి, ముల్తాన్ తో పాటు కరాచీలో కూడా దారుణంగా ఓడి స్వదేశంలో వరుసగా నాలుగు మ్యాచ్ (అంతకుముందు ఆస్ట్రేలియాతో ఒక మ్యాచ్) లు కోల్పోయిన తర్వాత బాబర్ పై ఆ జట్టు సీనియర్లు,అభిమానులు గుర్రుగా ఉన్నారు. బాబర్ ఆజమ్ కెప్టెన్సీపైనా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
తాజాగా కనేరియా తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ లో క్రికెట్ అభిమానులు, పలువురు మాజీ క్రికెటర్లు బాబర్ ఆజమ్ ను టీమిండియా రన్ మిషీన్ విరాట్ కోహ్లీతో పోలుస్తారు. ఇది తెలివితక్కువ పని. కోహ్లీ తో పోల్చేంత స్థాయిలో బాబర్ ఆట లేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ల స్థాయి వేరు. వారితో బాబర్ ను పోల్చితే వాళ్ల స్థాయి దిగజారుతుంది.
అసలు ఇప్పుడున్న పాకిస్తాన్ టీమ్ లో రోహిత్, కోహ్లీతో పోల్చదగే ఆటగాడు ఒక్కడూ లేడు. వాళ్లతో పోల్చుకున్నప్పుడు పాక్ ప్లేయర్లు తాము కింగ్‌ల్లా ఫీల్ అవుతున్నారు. కానీ మ్యాచ్ లు గెలవండి.. మంచి ఫలితాలు సాధించండి అంటే మాత్రం అట్టర్ ఫ్లాఫ్ అవుతున్నారు. కెప్టెన్ గా బాబర్ ఆజమ్ ఓ పెద్ద జీరో. అసలు అతడికి జట్టును నడిపించే లక్షణాలు లేవు.
మరీ ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో బాబర్ కు కెప్టెన్సీ అనేది చాలా తప్పుడు నిర్ణయం. బెన్ స్టోక్స్, బ్రెండన్ మెక్ కల్లమ్ ను చూసి అయినా బాబర్ కెప్టెన్సీ నేర్చుకుంటే బాగుండు. అలా కాని పక్షంలో తన ఈగోను పక్కనబెట్టి నేరుగా మాజీ సారథి సర్ఫరాజ్ అహ్మద్ దగ్గరకు వెళ్లి ఎలా సారథ్యం చేయాలో అడగాలి.. అప్పుడే పాకిస్తాన్ కు మంచి పలితాలొస్తాయి..’ అని తెలిపాడు.
అంతేగాక బాబర్ ఆజమ్ టెస్టు క్రికెట్ కు పనికిరాడని, అతడు ఈ ఫార్మాట్ నుంచి వీలైనంత త్వరగా తప్పుకుంటే అతడి కెరీర్ కే మంచిదని సూచించాడు. పాకిస్తాన్ - ఇంగ్లాండ్ మధ్య నేడు కరాచీ వేదికగా ముగిసిన నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను పర్యాటక జట్టు 3-0తో గెలుచుకున్న విషయం తెలిసిందే.