ఒకే ఇన్నింగ్స్‌లో 7 సిక్సులు.. ఆసియా కప్ లో పరుగుల సునామీ.. ఎవరా ప్లేయర్?
Asia Cup 2025: ఆసియా కప్ టీ20లో హాంకాంగ్ ప్లేయర్ బాబర్ హయాత్ ఒకే ఇన్నింగ్స్‌లో 7 సిక్సులు కొట్టి రికార్డు సృష్టించాడు. ఈ రికార్డును ఇప్పటికీ ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆసియా కప్ లో బాబర్ హయాత్ సునామీ నాక్
ఆసియా కప్ టీ20 చరిత్రలో హాంకాంగ్ జట్టు బాట్స్‌మన్ బాబర్ హయాత్ తన అద్భుతమైన ధనాధన్ బ్యాటింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 సిక్సులు కొట్టి ప్రత్యేక రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డును ఎవ్వరూ బద్దలు కొట్టలేకపోయారు.
విరాట్ కోహ్లీ 429 పరుగులతో ఆసియా కప్ టీ20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నా, ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సులు కొట్టిన ఘనత మాత్రం బాబర్ హయాత్‌కే దక్కింది.
KNOW
ఓమన్ తో జరిగిన మ్యచ్ లో సూపర్ ఇన్నింగ్స్
2016 ఫిబ్రవరి 19న ఫతుల్లాలోని ఖాన్ సాహెబ్ ఉస్మాన్ అలీ స్టేడియంలో హాంకాంగ్-ఓమన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఓమన్ బ్యాటింగ్ ఎంచుకుంది. జీషాన్ మసూద్, జతీందర్ సింగ్‌లు మంచి ఆరంభం ఇచ్చారు. జీషాన్ మసూద్ 13 బంతుల్లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఆ తర్వాత జతీందర్ సింగ్ 35 బంతుల్లో 42 పరుగులు చేసి జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. వాఘవ్ వాటెగావంకర్ 14 పరుగులు, ఆమిర్ అలీ 32 పరుగులు, మెహ్రాన్ ఖాన్ 28 పరుగులు చేశారు. 20 ఓవర్లలో ఓమన్ 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. హాంకాంగ్ బౌలర్ నదీమ్ అహ్మద్ అత్యధికంగా 3 వికెట్లు తీశాడు.
హాంకాంగ్ ఇన్నింగ్స్‌లో బాబర్ హయాత్ సూపర్ బ్యాటింగ్
లక్ష్యాన్ని చేధించడానికి వచ్చిన హాంకాంగ్ జట్టు ఆరంభంలోనే కష్టాల్లో పడింది. కిన్చిత్ షా 0 పరుగులకే ఔటవడంతో జట్టు 5 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. ఇక్కడి నుంచి బాబర్ హయాత్ తన దాడి ప్రారంభించాడు. అంషుమాన్ రథ్‌తో కలిసి రెండో వికెట్‌కు 58 పరుగులు జోడించాడు. కానీ రథ్ 11 పరుగులకే ఔటవడంతో జట్టు మళ్లీ ఒత్తిడిలోకి చేరింది.
బాబర్ హయాత్ పోరాటం
వికెట్లు పడిపోతున్నా బాబర్ హయాత్ మాత్రం క్రీజులో నిలబడి దుమ్మురేపాడు. 60 బంతుల్లో 122 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 7 సిక్సులు, 9 ఫోర్లు బాదడం విశేషం. అతని ఇన్నింగ్స్ కారణంగానే హాంకాంగ్ పోరాడగలిగింది. చివరి వరకు పోరాడినా హాంకాంగ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు మాత్రమే చేసింది. ఓమన్ 5 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది.
బాబర్ హయాత్ సిక్సర్ల రికార్డు
ఈ మ్యాచ్‌లో బాబర్ హయాత్ బాదిన 7 సిక్సులు ఇప్పటికీ ఆసియా కప్ టీ20 చరిత్రలో అత్యధికం. ఈ రికార్డు బాబర్ పేరుతో నిలిచిపోగా, ఆసియా కప్ చరిత్రలోని అత్యుత్తమ వ్యక్తిగత ఇన్నింగ్స్‌లలో ఇది ఒకటిగా గుర్తింపుపొందింది. బాబర్ హయాత్ ప్రదర్శన క్రికెట్ అభిమానుల మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది.