బాబర్ కెప్టెన్సీ ‘పవిత్రమైన ఆవు’ వంటిది.. విమర్శించకూడదు.. మాజీ ఆల్‌రౌండర్ సెటైర్
IND vs PAK: భారత్‌తో ఆదివారం ముగిసిన మ్యాచ్ లో చివరి బంతికి ఓడిన పాకిస్తాన్ జట్టుపై అక్కడి మాజీలు మండిపడుతున్నారు. బాబర్ ఆజమ్ కెప్టెన్సీపై విమర్శలు కురిపిస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా భారత్-పాక్ మధ్య ముగిసిన లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో పాక్ ఓటమికి బాబర్ ఆజమ్ కెప్టెన్సీయే కారణమంటున్నారు అక్కడి మాజీ క్రికెటర్లు.
అయితే బాబర్ ఏం చేసినా అతడిని పల్లెత్తు మాట కూడా అనొద్దనే విధంగా బోర్డు వ్యవహరిస్తున్నదని పాక్ మాజీ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ ఫైర్ అయ్యాడు. భారత్ తో మ్యాచ్ లో ఓడాక హఫీజ్ మాట్లాడుతూ బాబర్ ఆజమ్ కెప్టెన్సీ ‘పవిత్రమైన ఆవు’ వంటిదని, ఆ ఆవును ఎవరూ ఏమీ అనవద్దని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.
హఫీజ్ స్పందిస్తూ.. ‘బాబర్ ఆజమ్ కెప్టెన్సీ పవిత్రమైన ఆవుతో సమానంగా ఉంది. దానిని (కెప్టెన్సీ) మనం విమర్శించడానికి వీళ్లేదు. బాబర్ కెప్టెన్సీ ఎంత అధ్వాన్నంగా ఉందనేది ఈ మ్యాచ్ ద్వారా మరోసారి స్పష్టమైంది. బాబర్ కెప్టెన్సీని విమర్శిస్తే అతడు ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడని, 32 ఏండ్లు వచ్చాక నేర్చుకుంటాడని సమాధానాలు వినిపిస్తున్నాయి.
ఈ రోజు మ్యాచ్ నే తీసుకోండి. భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 7 నుంచి 11 ఓవర్ వరకు ఆ జట్టు పరుగులు చేయడానికే ఇబ్బంది పడింది. ఓవర్ కు కనీసం నాలుగు పరుగులు కూడా రాలేదు. మరి బాబర్ తన స్పిన్నర్లతో అప్పుడే నాలుగు ఓవర్ల కోటాను ఎందుకు పూర్తి చేయలేదు..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్ లో బాబర్ చివరి ఓవర్ ను స్పిన్నర్ మహ్మద్ నవాజ్ కు ఇచ్చాడు. కానీ నవాజ్ కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేశాడు. చివరి 6 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా.. తొలి బంతికే పాండ్యాను ఔట్ చేసిన అతడు.. ఆ తర్వాత కోహ్లీ బాదిన సిక్సర్ తో లయ కోల్పోయాడు. నోబాల్ తో అతడి లయ పూర్తిగా తప్పింది.
పలువురు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా ఇదే విషయాన్ని ఎత్తి చూపుతున్నారు. స్పిన్నర్ కు చివరి ఓవర్ ఇవ్వకుండా నాణ్యమైన పేసర్ తో ఆఖరి ఓవర్ వేయిస్తే ఫలితం మరో విధంగా ఉండేదేమోనని వాపోతున్నారు. గతేడాది ప్రపంచకప్ లో భారత్ ను ఓడించినప్పుడు బాబర్ ఆజమ్ అండ్ కో ను పాకిస్తాన్ మీడియా ఆకాశానికెత్తింది. కానీ ఇప్పుడు అదే మీడియా, అక్కడి ప్రజలు పాకిస్తాన్ జట్టును ముఖ్యంగా బాబర్ ఆజమ్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.