The Ashes: లైంగికవేధింపుల గాయం.. టిమ్ పైన్ కు విశ్రాంతి.. యాషెస్ కు ఆసీస్ వికెట్ కీపర్ ఇతడే..
Alex Carey: మరో వారం రోజుల్లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ జరుగనున్నది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే టిమ్ పైన్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాటు జట్టు నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో బోర్డు కొత్త వికెట్ కీపర్ ను ఎంపిక చేసింది.
లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆస్ట్రేలియా టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న మాజీ కెప్టెన్ టిమ్ పైన్.. తాజాగా జట్టు నుంచి కూడా తప్పుకున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో మానసికంగా కుంగిపోయిన అతడు ప్రస్తుత టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
అయితే పైన్ ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించినా.. కీపర్ గా కొనసాగుతాడని ఆసీస్ సెలెక్టర్లు భావించినా అతడు మాత్రం విరామం ప్రకటించడంతో వారికి కొత్త కీపర్ ను వెతికి పట్టుకోవాల్సిన అవసరమొచ్చింది.
ఈ నేపథ్యంలో సౌత్ ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అలెక్స్ కేరీ.. టిమ్ పైన్ స్థానాన్ని భర్తీ చేయబోతున్నాడు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం అతడి పేరును కన్ఫర్మ్ చేసింది.
Alex Carey
ఆస్ట్రేలియా తరఫున 45 వన్డేలు, 38 టీ20 లు ఆడిన కేరీ.. యాషెస్ సిరీస్ కోసం మరో వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్నా.. సెలెక్టర్లు మాత్రం కేరీ వైపు మొగ్గుచూపారు.
అయితే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు మాత్రం ఇంగ్లిస్ పేరును సూచించినా సెలెక్టర్లు మాత్రం అలెక్స్ కేరీనే ఎంపికచేశారు. ఆ జట్టు దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ తో పాటు మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలిలు.. పైన్ స్థానాన్ని ఇంగ్లిస్ భర్తీ చేయగల సమర్థుడని భావించారు.
వికెట్ కీపింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా బాగా చేసే ఇంగ్లిస్ ను ఎంపికచేస్తే యాషెస్ సిరీస్ లో ఆసీస్ కు ఎంతో ఉపకరిస్తుందని వాళ్లు సూచించారు. అంతేగాక గత కొద్దికాలంగా ఇంగ్లిస్.. దేశవాళీ క్రికెట్ లో మంచి ప్రదర్శన చేస్తున్నాడు.
ఇదిలాఉండగా.. తన సహోద్యోగిని లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలతో టిమ్ పైన్ ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన క్రికెట్ ఆస్ట్రేలియా ఆ జట్టు పేసర్ పాట్ కమిన్స్ ను సారథిగా నియమించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 8 నుంచి ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు జరుగనున్నది.