3 సెంచరీలు.. 431 పరుగులతో కంగారెత్తించారు
Australia vs South Africa: ఆస్ట్రేలియా మరోసారి తమ బ్యాటింగ్ పవర్ ను చూపిస్తూ పరుగుల సునామీ రేపింది. దక్షిణాఫ్రికాపై చివరి వన్డేలో 3 సెంచరీలతో 431 పరుగులు చేసింది. 276 రన్స్ తేడాతో ప్రోటిస్ జట్టును చిత్తుచేసింది.

సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా దూకుడు
మ్యాకై లోని గ్రేట్ బారియర్ రీఫ్ అరీనా స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించింది. అలాగే, రికార్డుల మోత మోగించింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభం నుంచే దూకుడును కొనసాగించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ అద్భుత భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 34.1 ఓవర్లలో 250 పరుగులు జోడించి దక్షిణాఫ్రికా బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు.
ఇద్దరు ప్లేయర్లు ఫోర్లు, సిక్సర్ల మోత మోగించారు. ట్రావిస్ హెడ్ 103 బంతుల్లో 142 పరుగుల (17 ఫోర్లు, 5 సిక్స్‌లు) సూపర్ నాక్ ఆడాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ 106 బంతుల్లో 100 పరుగులతో (6 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ కొట్టాడు.
KNOW
తొలి వన్డే సెంచరీ కొట్టిన కామెరాన్ గ్రీన్
ఇద్దరు ఓపెనర్ల తర్వాత క్రీజులోకి వచ్చిన కామెరాన్ గ్రీన్ ఆసీస్ ఇన్నింగ్స్ ను మరింతగా పరుగులు పెట్టించాడు. సునామీ బ్యాటింగ్ తో సెంచరీ కొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా 400+ పరుగుల మార్కును అందుకుంది. కేవలం 55 బంతుల్లోనే 118 పరుగుల సూపర్ ఇన్నింగ్స్ ను ఆడాడు. కామెరాన్ గ్రీన్ కు ఇది తొలి వన్డే సెంచరీ. అలాగే, ఆస్ట్రేలియా ఆటగాళ్లలో రెండో వేగవంతమైన వన్డే సెంచరీ కూడా.
కామెరాన్ గ్రీన్ ఇన్నింగ్స్‌లో 8 సిక్స్‌లు, 6 ఫోర్లు బాదాడు. చివర్లో అలెక్స్ కారీ 50* పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ను ఆడాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 82 బంతుల్లో 164 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.
ఒకే మ్యాచ్‌లో 3 సెంచరీలతో మరో రికార్డు
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మరో ప్రత్యేక ఘనత సాధించింది. 4897 వన్డే మ్యాచ్‌ల చరిత్రలో ఒకే జట్టు తరఫున ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలు చేయడం చాలా అరుదుగా ఉంది. ఆస్ట్రేలియా చరిత్రలో ఇది రెండవ సారి నమోదుకావడం విశేషం. అయితే, మొదటిసారి ఈ ఘనత సాధించిన జట్టు దక్షిణాఫ్రికా. 2015లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో హషీమ్ ఆమ్లా (153*), రైలి రుసో (128), ఏబీ డివిలియర్స్ (149) సెంచరీలతో అదరగొట్టారు.
బౌలింగ్ లోనూ అదరగొట్టిన ఆసీస్.. కుప్పకూలిన దక్షిణాఫ్రికా
432 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆరంభం నుంచే కష్టాల్లో పడింది. కంగారు బౌలర్లు రాణించడంతో ఓపెనర్లు, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు ఎక్కువ సమయం క్రీజులో నిలవలేకపోయారు. ఐడెన్ మార్క్రామ్ (2), ర్యాన్ రికెల్టన్ (11), టెంబా బావుమా (19)లు త్వరగానే పెవిలియన్ కు చేరారు. కొంతసేపు డి జోర్సీ (33), బ్రెవిస్ (49) లు పోరాటం చేశారు, కానీ జట్టును విజయం వైపు నడిపించలేకపోయారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 24.5 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది.
ఆస్ట్రేలియా బౌలర్ల మెరుపులు
ఆస్ట్రేలియా బౌలర్లలో కూపర్ కనోలీ అత్యధికంగా 5 వికెట్లు తీశాడు. సేవియర్ బార్ట్లెట్, షాన్ అబాట్ తలో రెండు వికెట్లు సాధించారు. దీంతో ఆస్ట్రేలియా 276 పరుగుల తేడాతో అద్భుత విజయం నమోదు చేసింది.
అయితే, మొదటి రెండు వన్డేల్లో గెలిచిన దక్షిణాఫ్రికా సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. దీనికి ముందు జరిగిన టీ20 సిరీస్‌ను అదే తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది. ఈ మ్యాచ్‌తో ఆస్ట్రేలియా వన్డే చరిత్రలో రెండో అత్యధిక స్కోరు (431) సాధించింది.