ఆసియా కప్ 2025: టీమిండియా ముందున్న 5 సవాళ్లు ఇవే
Asia Cup 2025 Team India: ఆసియా కప్ 2025లో టైటిల్ నిలబెట్టుకోవడంలో భారత జట్టు ఐదు ప్రధాన సవాళ్లను ఎదుర్కోనుంది. ఓపెనింగ్ జోడీ, సంజూ శాంసన్ స్థానంతో పాటు పలు సవాళ్లు ఉన్నాయి. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆసియా కప్ టైటిల్ డిఫెన్స్‌కు సిద్ధమవుతున్న భారత్
ఆసియా కప్ 2025లో తమ టైటిల్‌ను కాపాడుకోవడానికి భారత జట్టు సన్నద్ధమవుతోంది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తో జరగబోయే గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌తో ప్రారంభం కానుంది.
సోమవారం ముంబయిలో బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రధాన సెలక్టర్ అజిత్ అగార్కర్ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేయడం ఒక క్లిష్టమైన పని అయితే, ప్రతి మ్యాచ్‌కు తుది ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేయడం టీం మేనేజ్‌మెంట్‌కు మరింత పెద్ద సవాల్‌గా మారనుంది. కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని మేనేజ్‌మెంట్ ఈ సవాళ్లను ఎదుర్కోనుంది.
KNOW
ఓపెనింగ్ కాంబినేషన్ సమస్య
టీమిండియా మేనేజ్‌మెంట్ ముందు ఉన్న పెద్ద సవాళ్లలో ఓపెనింగ్ కాంబినేషన్ ఒకటి. ఏడాది పాటు రెడ్ బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టిన తర్వాత శుభ్‌మన్ గిల్ మళ్లీ టీ20 ఫార్మాట్‌లోకి వచ్చాడు. గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించడం వల్ల ఆయన ప్లేయింగ్ 11లో తప్పకుండా ఉంటారు.
అయితే, గిల్ తో ఓపెనింగ్ చేసే భాగస్వామి ఎవరు అన్నది నిర్ణయించాల్సిన కీలక అంశం. గత మూడు T20I సిరీస్‌లలో (బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌తో) సంజూ శాంసన్, అభిషేక్ శర్మలను ఓపెనర్లుగా దించారు. వైట్ బాల్ ఫార్మాట్‌లో గిల్ పాత్ర టాప్ ఆర్డర్‌లో కీలకం కావడంతో, సంజూ లేదా అభిషేక్ ఎవరిని ఓపెనర్‌గా ఎంచుకోవాలి అన్నది టీం మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారనుంది.
సంజూ శాంసన్ ను ఎక్కడ ఆడిస్తారు?
అభిషేక్ శర్మ, గిల్‌లను లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం ఓపెనర్లుగా ఎంచుకుంటే, సంజూ శాంసన్ స్థానం ఏమిటన్నది పెద్ద ప్రశ్న. అతను గత మూడు సిరీస్‌లలో అభిషేక్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు. ఓపెనర్‌గా ఆడుతూ మూడు సెంచరీలు బాదాడు.
జట్టు అతన్ని నెంబర్ 3లో ఆడనివ్వవచ్చు కానీ దానికోసం మిడిలార్డర్ లో మార్పులు చేయాలి. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా స్థానాలను మార్చాల్సి ఉంటుంది. సంజూ శాంసన్ అనుభవం, పవర్‌ప్లేలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించగల సత్తా ఉన్న ప్లేయర్ కావడంతో అతని స్థానంపై తుది నిర్ణయం కీలకం కానుంది.
7వ స్థానం కోసం పోటీలో ముగ్గురు
ఆసియా కప్ 2025లో భారత జట్టులో 7వ స్థానానికి ముగ్గురు ప్రధాన పోటీదారులు ఉన్నారు. వారిలో శివమ్ దూబే, రింకూ సింగ్, జితేశ్ శర్మలు ఉన్నారు. ఈ స్థానంలో బ్యాటింగ్ చేసే ఆటగాడు ఐదు వికెట్లు పడిన తర్వాత క్రీజ్‌లోకి వస్తాడు. అతని బాధ్యత ఇన్నింగ్స్‌ను నిలబెట్టడం లేదా డెత్ ఓవర్లలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించడం.
బౌలింగ్ ఆల్‌రౌండర్ కోసం వెళ్తే శివమ్ దూబేకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాటింగ్ బలం కోసం వెళ్తే రింకూ సింగ్ లేదా జితేశ్‌ను ఎంచుకోవచ్చు. అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అదనపు బ్యాటర్ అవసరం ఉందని చెప్పడం రింకూ ఎంపికకు సంకేతంగా భావించవచ్చు.
పేస్ బౌలింగ్ కాంబినేషన్ లో ఎవరుంటారు?
జస్ప్రిత్ బుమ్రా పేస్ దళానికి నాయకత్వం వహించనున్నప్పటికీ, ఆయన అన్ని మ్యాచ్‌లు ఆడతారా లేక కొన్ని మాత్రమే ఆడతారా అన్న సందేహం ఉంది. ముగ్గురు పేసర్లతో వెళ్లాలా లేక ఇద్దరితో పాటు స్పిన్నర్‌ని ఆడించాలా అన్నది నిర్ణయించాలి.
బుమ్రా ఆడని సందర్భంలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాల పాత్ర కీలకం కానుంది. భిన్న పరిస్థితులకు అనుగుణంగా పేసర్లు-స్పిన్నర్లు సమతౌల్యం చేయడం టీం మేనేజ్‌మెంట్ ముందున్న ప్రధాన పరీక్ష.
కుల్దీప్ యాదవ్ స్థానంపై సందేహాలు
కుల్దీప్ యాదవ్‌ను 15 మంది జట్టులో చేర్చినా, ఆయన ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకుంటారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. వరుణ్ చక్రవర్తి స్పిన్ దళానికి నాయకత్వం వహించనున్నారు. గతేడాది నుంచి 33 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశారు.
అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్‌గా మిడిల్ ఓవర్లలో అదరగొడతారు. ముగ్గురు పేసర్లతో వెళ్తే కుల్దీప్ స్థానానికి అవకాశం తక్కువ. ఇద్దరు పేసర్లను ఆడిస్తే అదనపు స్పిన్నర్‌గా ఆయనకు అవకాశం లభిస్తుంది. యూఏఈ పిచ్ పరిస్థితుల ఆధారంగా కుల్దీప్ స్థానంపై తుది నిర్ణయం తీసుకోవాలి.