సెలక్షన్ కమిటీకి కొత్త తలనొప్పి.. ఆసియా కప్ 2025 భారత జట్టులో ఉండేది ఎవరు?
Asia Cup 2025 India Squad: ఆసియా కప్ 2025 కోసం సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అయ్యాడు. బుమ్రా కూడా ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ టోర్నీ కోసం భారత జట్టును ఆగస్టు 19న ప్రకటించనున్నారు. పోటీలో చాలా మంది ప్లేయర్లు ఉన్నారు.

ఆసియా కప్ భారత జట్టు.. సూర్యకుమార్ ఫిట్‌నెస్ టెస్ట్ పాస్
వచ్చే నెలలో యూఏఈలో జరగనున్న ఆసియా కప్ 2025 కోసం భారత క్రికెట్ జట్టును ఆగస్టు 19న ప్రకటించనున్నారు. సీనియర్ ప్లేయర్లతో పాటు చాలా మంది యంగ్ ప్లేయర్లు జట్టులో స్థానం కోసం పోటీపడుతున్నారు. జట్టును ఎంపిక చేయడం సెలక్షన్ కమిటీకి పెద్ద సవాలుగా మారింది.
ఈ క్రమంలోనే ఒక గుడ్ న్యూస్ వచ్చింది. భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్ట్ విజయవంతంగా పూర్తి చేశాడు. ఇటీవల ఆయనకు హెర్నియా ఆపరేషన్ జరగడంతో విశ్రాంతి తీసుకున్నారు. ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ కాకపోతే కొత్త కెప్టెన్‌ను వెతకాల్సి వచ్చేది. కానీ ఈ పరీక్షలో విజయం సాధించడంతో ఆసియా కప్ లో సూర్యకుమార్ ఆడటం ఖాయం అయింది. అయితే, జట్టులో ఉండే మిగతా ప్లేయర్ల ఎంపికపై ఆసక్తి నెలకొంది.
KNOW
ఆసియా కప్ కు సిద్ధంగా బుమ్రా
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఆసియా కప్ 2025 కోసం సిద్ధమని సెలెక్టర్లకు తెలియజేశాడు. మోకాలి గాయంతో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ చివరి మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. అయితే బుమ్రా సెలెక్టర్లకు తాను పూర్తిగా కోలుకున్నాననీ, ఆసియా కప్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.
బుమ్రా నిర్ణయం అభిమానులకు ఊరటనిచ్చింది. ఇంగ్లాండ్ సిరీస్‌లో బుమ్రా మూడు టెస్టుల్లో మాత్రమే ఆడటం వివాదాస్పదమైంది. కానీ, ఆడిన మ్యాచ్ లలో అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు. ఇప్పుడు ఆసియా కప్‌లో అతని ప్రదర్శన టీమిండియాకు కీలకం కానుంది.
సెలక్షన్ కమిటీ జట్టును ఎప్పుడు ప్రకటించనుంది?
ఆగస్టు 19న ముంబైలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఆ సమావేశం అనంతరం అధికారికంగా ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ప్రకటింనున్నారు.
ఇంగ్లాండ్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన శుభ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్‌ను తిరిగి టీ20 జట్టులోకి తీసుకుంటారా అన్నదే ప్రధాన చర్చాంశంగా ఉండనుంది. వీరిని తీసుకుంటే సంజూ శాంసన్ స్థానం ప్రభావితం కావచ్చు.
సంజూ-అభిషేక్ ఓపెనింగ్ జోడీగా ఉంటారా?
ఐపీఎల్‌లో, అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా మెరుగైన ప్రదర్శన చేసిన సంజూ శాంసన్ ఇప్పటికే మూడు సెంచరీలు సాధించాడు. మరోవైపు అభిషేక్ శర్మ ఓపెనింగ్‌లో స్థిరంగా రాణిస్తున్నాడు.
ఆసియా కప్ 2025 కోసం ఈ జోడీని కొనసాగించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, శుభ్ మన్ గిల్ లేదా యశస్వి జైస్వాల్‌ను జట్టులోకి తీసుకుంటే బ్యాటింగ్ క్రమంలో మార్పులు తప్పవు. కెప్టెన్ సూర్యకుమార్ నాలుగో స్థానంలో, హార్దిక్ పాండ్య ఐదో స్థానంలో, తిలక్ వర్మ మూడో స్థానంలో ఆడే అవకాశం ఉంది.
భారత జట్టులో స్థానం కోసం గట్టి పోటీ !
జట్టులో స్థానం కోసం చాలా మంది ప్లేయర్లు పోటీ పడుతున్నారు. శుభ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, కృనాల్ పాండ్యా, జితేష్ శర్మ, ధ్రువ్ జురేల్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రానాలు పోటీలో ఉన్నారు.
శ్రేయస్ అయ్యర్ టీ20 జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు తగ్గాయని సమాచారం. మరోవైపు అర్ష్‌దీప్ సింగ్‌కు బౌలింగ్ విభాగంలో స్థానం ఖాయం కానుంది. మహ్మద్ సిరాజ్ తిరిగి వస్తాడా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
గిల్ జట్టులోకి వస్తే ఆయనను వైస్ కెప్టెన్‌గా ప్రకటించే అవకాశముంది. సంజూ శాంసన్ మొదటి వికెట్ కీపర్‌గా ఆడితే జితేష్ శర్మ లేదా ధ్రువ్ జురెల్ రెండో వికెట్ కీపర్‌గా ఉండొచ్చు.
కాగా, ఆసియా కప్ 2025లో సెప్టెంబర్ 10న యూఏఈపై భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 14న భారత్-పాకిస్తాన్ పోరు జరగనుండటంతో క్రికెట్ ప్రపంచం ఆ మ్యాచ్‌ను ఆసక్తిగా ఎదురు చూస్తోంది.