భారత్ vs పాకిస్థాన్ : సూర్యకుమార్ vs సల్మాన్ అఘా.. నో షేక్ హ్యాండ్స్ వివాదం
Asia Cup 2025 IND vs PAK : ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్, సల్మాన్ అఘా చేతులు కలపకపోవడంతో మరో వివాదం మొదలైంది. నో షేక్ హ్యాండ్స్ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

భారత్ vs పాకిస్థాన్ : టాస్‌లో ఉద్రిక్తత
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం ఆసియా కప్ 2025 ఆరో మ్యాచ్ భారత్-పాకిస్థాన్ మధ్య ప్రారంభమైంది. టాస్ సమయంలోనే రెండు జట్ల మధ్య ఉన్న ఉద్రిక్తత బయటపడింది. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. అయితే, పాక్ కెప్టెన్, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేతులు కలపకుండానే వెళ్లిపోయారు. అలాగే, ఒకరినొకరు పెద్దగా చూసుకోనులేదు.
సూర్యకుమార్ యాదవ్ vs సల్మాన్ అలీ అఘా : నో షేక్ హ్యాండ్స్
మ్యాచ్‌కు కొన్ని గంటల ముందే సూర్యకుమార్ తన జట్టుకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అదే సల్మాన్ అఘాతో నో షేక్ హ్యాండ్స్. అయితే, ఇది వ్యక్తిగత నిర్ణయం అనీ, ఎవరికైనా చేతులు కలపాలనిపిస్తే చేసుకోవచ్చని ఆటగాళ్లకు సూచించారు. ఈ సంఘటన టాస్ అనంతరం వీడియో రూపంలో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది.
పహల్గామ్ దాడి నేపథ్యంలోనే సూర్య నిర్ణయం
ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ జట్లు తొలిసారిగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ను బహిష్కరించాలని చాలా మంది డిమాండ్ చేశారు. అయినప్పటికీ, బీసీసీఐ, భారత ప్రభుత్వం మల్టీనేషనల్ టోర్నమెంట్ బాధ్యతల కారణంగా మ్యాచ్ ఆడటానికి అంగీకరించాయి. కాబట్టి ఆటగాళ్లకు వెనక్కి తగ్గే అవకాశం లేదు.
Coin falls in favour of Pakistan and they choose to bat first 🏏
Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork#DPWorldAsiaCup2025pic.twitter.com/IU98kUSWda— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025
సూర్యకుమార్ ఎమన్నారంటే?
టాస్ అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ, తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నామని చెప్పారు. రాత్రి సమయంలో డ్యూస్ ప్రభావం ఉంటుందని, అదే ప్రయోజనకరమని పేర్కొన్నారు. జట్టులో ఎలాంటి మార్పులు లేవని కూడా వెల్లడించారు.
IND vs PAK: దుబాయ్ పోలీసుల హెచ్చరికలు
దుబాయ్ పోలీసులు మ్యాచ్ సందర్భంగా ప్రత్యేక సూచనలు జారీ చేశారు. అభిమానులు ముందుగానే స్టేడియానికి రావాలని, నిబంధనలు పాటించాలని ఆదేశించారు. నిషేధిత వస్తువులు తీసుకువస్తే జరిమానాలు లేదా జైలు శిక్షలు విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.
కాగా, భారత్ ఈ టోర్నీ తొలి మ్యాచ్ లో యూఏఈపై ఘన విజయం సాధించింది. అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి కేవలం 57 పరుగులకే కుప్పకూలింది. గిల్, అభిషేక్ శర్మల ఆగ్రెసివ్ బ్యాటింగ్‌తో భారత్ 4.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది.
ఇక పాకిస్థాన్ తమ మొదటి మ్యాచ్‌లో ఓమన్‌ను 93 పరుగుల తేడాతో ఓడించింది. హారిస్ హాఫ్ సెంచరీ బాదగా, బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో విజయాన్ని నమోదు చేసింది.
భారత్-పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకు 19 సార్లు తలపడ్డాయి. వీటిలో భారత్ 10 విజయాలు సాధించగా, పాకిస్థాన్ 6 మ్యాచ్‌లు గెలిచింది. మూడు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి.