ఆసియా కప్ 2025 సూపర్-4 షెడ్యూల్ ఇదే.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు?
Asia Cup 2025 Super 4 schedule : ఆసియా కప్ 2025 సూపర్-4 షెడ్యూల్ విడుదలైంది. భారత్-పాకిస్తాన్ లు ఈ టోర్నీలో మరోసారి తలపడున్నాయి. భారత్, పాకిస్తాన్ తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు కూడా సూపర్ 4 పోరులో ఉన్నాయి.

ఆసియా కప్‌లో సూపర్-4లో నాలుగు జట్ల మధ్య బిగ్ ఫైట్
ఆసియా కప్ 2025లో 11 గ్రూప్ మ్యాచ్‌లు పూర్తయ్యాక, సూపర్-4 దశకు చేరిన నాలుగు జట్లు ఏవో తేలాయి. గురువారం అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్‌పై విజయం సాధించి గ్రూప్-B నుంచి అర్హత సాధించింది. దీంతో బంగ్లాదేశ్ కూడా ఆటోమేటిక్‌గా సూపర్-4 రౌండ్‌లోకి ప్రవేశించింది. మరోవైపు, గ్రూప్-A నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు ఇప్పటికే సూపక్ 4 కు చేరుకున్నాయి.
శ్రీలంక విజయంతో బంగ్లాదేశ్ కు అదృష్టం కలిసింది
అబుదాబిలో జరిగిన నిర్ణయాత్మక పోరులో ఆఫ్ఘానిస్తాన్ 169 పరుగులు చేసింది. సూపర్ 4కు అర్హత పొందడానికి శ్రీలంక కనీసం 101 పరుగులు చేయాల్సి వుండగా, లంకేయులు లక్ష్యాన్ని ఒక ఓవర్ మిగిలి ఉండగానే చేధించారు. దీంతో శ్రీలంక వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి 6 పాయింట్లతో గ్రూప్-Bలో టాప్ లో నిలిచింది. ఈ విజయంతో ఆఫ్ఘానిస్తాన్ టోర్నీ నుంచి అవుట్ అయింది. అలాగే, బంగ్లాదేశ్ సూపర్ 4 రౌండ్‌కు చేరుకుంది.
సూపర్ 4 లో భారత్-పాకిస్తాన్
గ్రూప్-Aలో భారత్, పాకిస్తాన్ జట్లు సూపర్-4లోకి ప్రవేశించాయి. షెడ్యూల్ ప్రకారం ఈ రెండు జట్లు సెప్టెంబర్ 21న దుబాయ్‌లో తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటికే గ్రూప్-A మ్యాచ్ లో భారత్, పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సూపర్-4 దశలో భారత్-పాకిస్తాన్ మరోసారి తలపడడం అభిమానులకు పండగే.
ఆసియా కప్ 2025 సూపర్ 4 టీమిండియా షెడ్యూల్
భారత్ సెప్టెంబర్ 19న అబుదాబిలో ఒమన్‌తో చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఫలితం పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు కాబట్టి జట్టు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వొచ్చు. సూపర్-4లో భారత్ మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి:
• భారత్ vs పాకిస్తాన్ – సెప్టెంబర్ 21, దుబాయ్
• భారత్ vs బంగ్లాదేశ్ – సెప్టెంబర్ 24, దుబాయ్
• భారత్ vs శ్రీలంక – సెప్టెంబర్ 26, దుబాయ్
ఫైనల్ సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరగనుంది. సూపర్-4 పాయింట్ల పట్టికలో అగ్రస్థానాల్లో నిలిచిన రెండు జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఇక్కడ కూడా భారత్, పాకిస్తాన్ అదరగొడితే మరోసారి ఫైనల్‌లో ఎదురుపడే అవకాశముంది.
ఆసియా కప్ సూపర్-4 పూర్తి షెడ్యూల్
• శ్రీలంక vs బంగ్లాదేశ్ – సెప్టెంబర్ 20, దుబాయ్
• భారత్ vs పాకిస్తాన్ – సెప్టెంబర్ 21, దుబాయ్
• పాకిస్తాన్ vs శ్రీలంక – సెప్టెంబర్ 23, అబుదాబి
• భారత్ vs బంగ్లాదేశ్ – సెప్టెంబర్ 24, దుబాయ్
• పాకిస్తాన్ vs బంగ్లాదేశ్ – సెప్టెంబర్ 25, దుబాయ్
• భారత్ vs శ్రీలంక – సెప్టెంబర్ 26, దుబాయ్
• ఆసియా కప్ 2025 ఫైనల్ – సెప్టెంబర్ 28, దుబాయ్