ఆసియా కప్ 2023 ఫైనల్‌లో 9వ సారి ఇండియా వర్సెస్ శ్రీలంక... లెక్కల్లో మనమే టాప్, అయినా...
ఆసియా కప్ 2023 టోర్నీ ఫైనల్‌కి ఇండియాతో పాటు శ్రీలంక అర్హత సాధించింది. పాకిస్తాన్‌తో జరిగిన ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో శ్రీలంక ఆఖరి బంతికి గెలిచి, ఫైనల్‌కి దూసుకొచ్చింది. ఆసియా కప్ 2023 ఫైనల్‌లో ఇండియా, శ్రీలంక పోటీపడడం ఇది 9వ సారి..
40 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ ఇండియా- పాకిస్తాన్ ఫైనల్ ఆడలేదు. ఈసారి ఫైనల్‌లో దాయాది జట్లు పోటీపడతాయని ఆశించినా, పాకిస్తాన్ వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి.. ఫైనల్‌కి రాలేకపోయింది..
India vs Sri Lanka Asia Cup 2023
శ్రీలంక- పాకిస్తాన్ మధ్య నాలుగు సార్లు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగగా, భారత జట్టు - బంగ్లాదేశ్ మధ్య రెండు సార్లు ఫైనల్ జరిగింది. బంగ్లాదేశ్- పాకిస్తాన్ జట్ల మధ్య ఓ సారి ఆసియా కప్ 2023 ఫైనల్ ఆడింది..
1984లో జరిగిన మొదటి ఆసియా కప్ టోర్నీలో ఇండియా- శ్రీలంక ఫైనల్ చేరగా, రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. 1986 ఆసియా కప్ టోర్నీలో టీమిండియా ఆడలేదు. పాకిస్తాన్‌ని ఫైనల్‌లో ఓడించిన శ్రీలంక, టైటిల్ గెలిచింది..
1988లో ఇండియా- శ్రీలంక రెండోసారి ఫైనల్ చేరాయి. శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుని, రెండోసారి ఆసియా కప్ టైటిల్ గెలిచింది భారత జట్టు. ఆ తర్వాత 1990, 1995 ఎడిషన్లలో కూడా ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి టైటిల్స్ గెలిచింది టీమిండియా..
1997లో కూడా వరుసగా నాలుగో సారి ఇండియా- శ్రీలంక, ఆసియా కప్ టోర్నీ ఫైనల్ ఆడాయి. తొలిసారి ఫైనల్‌లో భారత జట్టుపై గెలిచిన శ్రీలంక, రెండో ఆసియా కప్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత 2000 ఆసియా కప్‌లో భారత జట్టు, ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది..
Kohli-Rohit hug
2004లో మరోసారి ఇండియా, శ్రీలంక మధ్య ఆసియా కప్ ఫైనల్ జరిగింది. ఆ మ్యాచ్‌లో టీమిండియాపై 25 పరుగుల తేడాతో నెగ్గిన శ్రీలంక, 2008లోనూ సేమ్ సీన్ రిపీట్ చేసింది. 2008లో ఏకంగా 100 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది శ్రీలంక..
2010 ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకపై రివెంజ్ తీర్చుకుంది భారత జట్టు. 81 పరుగుల తేడాతో లంకను ఫైనల్‌లో ఓడించింది. 2012లో తొలిసారిగా ఇండియా, శ్రీలంక జట్లు లేకుండా ఆసియా కప్ ఫైనల్ జరిగింది. 2012 ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై 2 పరుగుల తేడాతో గెలిచి, రెండోసారి ఆసియా కప్ గెలిచింది పాకిస్తాన్..
2014లో భారత జట్టు ఫైనల్‌కి రాలేకపోయింది. ఫైనల్‌లో పాకిస్తాన్‌ని 5 వికెట్ల తేడాతో ఓడించి, ఐదో సారి ఆసియా కప్ గెలిచింది శ్రీలంక. 2016, 2018 సీజన్లలో ఇండియా- బంగ్లాదేశ్ మధ్య ఆసియా కప్ ఫైనల్ జరిగింది. ఈ రెండు సార్లు బంగ్లా, భారత జట్టు చేతుల్లో ఓడింది..
2022 ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంక, పాకిస్తాన్ ఫైనల్ చేరాయి. పాక్‌ని ఓడించిన శ్రీలంక, ఆరోసారి ఆసియా కప్ టైటిల్ గెలిచింది. ఓవరాల్‌గా ఇండియా - శ్రీలంక మధ్య ఇప్పటిదాకా 8 సార్లు ఆసియా కప్ ఫైనల్ జరిగింది..
1984, 1988, 1990, 1995, 2010 ఎడిషన్లలో టీమిండియా, శ్రీలంకను ఓడించి ఆసియా కప్ టైటిల్స్ గెలిచింది. 1997, 2004, 2008 సీజన్లలో శ్రీలంక జట్టు, భారత జట్టును ఓడించి ఆసియా కప్ టైటిల్స్ గెలిచింది...