- Home
- Sports
- Cricket
- గాయమన్నారు.. రెండు టెస్టులూ ఆడలేడన్నారు.. యాషెస్‌లో ఆడిస్తున్నారు.. అంటే అవి ఉత్తుత్తి గాయాలేనా..?
గాయమన్నారు.. రెండు టెస్టులూ ఆడలేడన్నారు.. యాషెస్‌లో ఆడిస్తున్నారు.. అంటే అవి ఉత్తుత్తి గాయాలేనా..?
Ashes 2023: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హెజిల్వుడ్ జనవరి తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా అతడిని క్రికెట్ ఆస్ట్రేలియా ఆడించలేదు.

ఈ ఏడాది స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ఆడిన జోష్ హెజిల్వుడ్ గాయంతో తర్వాత జాతీయ జట్టుకు దూరమయ్యాడు. అతడు ఫిబ్రవరి - మార్చిలో భారత్ వేదికగా జరిగిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఇండియా పర్యటనకు వచ్చినా అతడితో క్రికెట్ ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు.
ఇక ఇటీవలే ఓవల్ వేదికగా ముగిసిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో కూడా ఆస్ట్రేలియా ప్రకటించిన 15 మంది సభ్యులలో అతడి పేరు ఉంది. కానీ తీరా మ్యాచ్ ప్రారంభానికి మూడు రోజుల ముందు ఆసీస్.. అతడు పాత గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, డబ్ల్యూటీసీ ఫైనల్ తో పాటు యాషెస్ సిరీస్ లో రెండు టెస్టులకు అందుబాటులో ఉండేది అనుమానమే అని ప్రకటించింది.
కానీ తీరా యాషెస్ టెస్టు సిరీస్ లో భాగంగా నేడు ఇంగ్లాండ్ తో బర్మింగ్‌హామ్ వేదికగా ఆరంభమైన తొలి టెస్టులో హెజిల్వుడ్ ను ఆడిస్తున్నది. పాట్ కమిన్స్, జోష్ హెజిల్వుడ్, స్కాట్ బొలాండ్ లతో కూడిన బౌలింగ్ త్రయం తొలి టెస్టులో ఆడుతన్నది. ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ గాయం కారణంగా తొలి టెస్టుకు అందుబాటులో లేడు.
దీనిని బట్టి చూస్తే టీమిండియా బ్యాటింగ్ లైనప్ కు హెజిల్వుడ్ వంటి స్టార్ బౌలర్ ను వాడటం అవసరమా..? అని క్రికెట్ ఆస్ట్రేలియా భావనగా ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. ఆసీస్ కు డబ్ల్యూటీసీ గెలవడంతో పాటు యాషెస్ చాలా కీలకం.
Image credit: Getty
అందుకే హెజిల్వుడ్ ను పూర్తి ఫిట్నెస్ సాధించినా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడించకుండా యాషెస్ కోసం సన్నద్ధం చేశారన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఇది జోష్ కు కూడా ఫ్రెష్ గా తిరిగివచ్చేందుకు సహకరించింది.
ఇది నిజమైనా కాకపోయినా డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత ప్రదర్శన దారుణంగా ఉంది. రెండు ఇన్నింగ్స్ లలో కంగారూ బ్యాటర్లు పరుగుల ప్రవాహం పారించిన చోట మన బ్యాటర్లు క్రీజులో నిలబడటానికే తంటాలు పడ్డారు. హెజిల్వుడ్ లేకపోతేనే భారత పరిస్థితి ఇలా ఉంటే ఇక ఉంటే ఎంత భయంకరంగా ఉండేదోనని పలువురు ఫ్యాన్స్ వాపోతున్నారు.
ఇక యాషెస్ - 2023 లో భాగంగా బర్మింగ్‌హామ్ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బజ్ బాల్ పేరుకు తగ్గట్టే.. 13 ఓవర్లు ముగిసేటప్పటికీ ఒక వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది. జాక్ క్రాలే (40 బంతుల్లో 36 నాటౌట్, ఐదు ఫోర్లు) ధాటిగా ఆడుతుండగా ఓలీ పోప (34 బంతుల్లో 21 నాటౌట్) అతడికి తోడుగా నిలుస్తున్నాడు. బెన్ డకెట్ (12) ను హెజిల్వుడ్ ఔట్ చేశాడు.