- Home
- Sports
- Cricket
- అయ్యో అర్జున్.. అక్కడా నిరాశేనా.. క్రికెట్ దేవుడి కొడుకుకు రంజీ జట్టులో దక్కని చోటు
అయ్యో అర్జున్.. అక్కడా నిరాశేనా.. క్రికెట్ దేవుడి కొడుకుకు రంజీ జట్టులో దక్కని చోటు
Arjun Tendulkar: భారత క్రికెట్ లో దేవుడిగా కొలిచే సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ అరంగేట్రానికి మరికొన్నాళ్లు ఆగాల్సిందే. ఐపీఎల్ లో అతడికి అవకాశం దక్కలేదు.

సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్ ఇప్పట్లో పట్టాలు ఎక్కేలా కనిపించడంలేదు. ఐపీఎల్ లో అతడిని రిటైన్ చేసుకున్న ముంబై ఇండియన్స్ జట్టు.. గత సీజన్ తో పాటు 2022 లో కూడా ఒక్క మ్యాచ్ అయినా ఆడించలేదు.
బెంచ్ కే పరిమితం చేయడంతో తీవ్ర నిరాశకు గురైన అర్జున్ కు ఇప్పుడు మరో షాక్ తగిలింది. రంజీ ట్రోఫీ కోసం ముంబై ప్రకటించిన రంజీ జట్టు లో అర్జున్ పేరు లేదు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇంతవరకు అరంగేట్రం చేయని అర్జున్ ను రంజీలలో ఆడిస్తారని.. జూన్ నుంచి మొదలుకాబోయే రంజీ నాకౌట్ దశలో అతడి పేరు కచ్చితంగా ఉంటుందని అంతా ఆశించారు.
కానీ తాజాగా ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన జట్టులో అర్జున్ పేరు కనిపించలేదు. బెంగళూరు వేదికగా సాగే రంజీ నాకౌట్ దశలో ముంబై.. ఉత్తరాఖండ్ జట్టుతో తలపడనున్నది. ఈ టీమ్ కు ఐపీఎల్ లో ఢిల్లీ ఓపెనర్ గా ఉన్న పృథ్వీ షా సారథ్యం వహించనున్నాడు.
అర్జున్ కు అవకాశమివ్వని ముంబై క్రికెట్ అసోసియేషన్.. ఢిల్లీ క్యాపిటల్స్ లో ఆడిన సర్ఫరాజ్ ఖాన్ తో పాటు అతడి సోదరుడు ముషీర్ ఖాన్ కు కూడా స్థానం కల్పించడం గమనార్హం. రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు కూడా ఈ జట్టులో చోటు లభించింది.
ఐపీఎల్ లో తనను ఆడించకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన అర్జున్ కు ఇప్పుడు రంజీ జట్టులో కూడా చోటు దక్కకపోవడం మరింత కుంగదీసేదే. ముంబై ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నప్పుడు పలువురు కొత్త ఆటగాళ్లకు అవకాశమిచ్చిన రోహిత్ శర్మ.. అర్జున్ ను పట్టించుకోకోపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
రంజీ నాకౌట్ దశకు ఎంపికైన ముంబై జట్టు : పృథ్వీ షా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, భూపేన్ లాల్వానీ, అర్మన్ జాఫర్, సర్ఫరాజ్ ఖాన్, సువేద్ పార్కర్, ఆకర్షిత్ గోమల్, ఆదిత్య తారే, హార్ధిక్ తమోర్, అమన్ ఖాన్, సాయిరాజ్ పాటిల్, షామ్స్ ములానీ, దురిముల్ మట్కర్, తనుష్ కోటియాన్, శశాంక్ అతార్డే, ధావల్ కులకర్ణి, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవాస్తీ, రొస్తాన్ డయాస్, సిద్ధార్థ రౌత్, ముషీర్ ఖాన్