- Home
- Sports
- Cricket
- Rohit Sharma: ఇప్పటికే చాలా క్రికెట్ ఆడావ్.. బ్రేక్ తీసుకో.. హిట్ మ్యాన్ కు వాన్ సూచన
Rohit Sharma: ఇప్పటికే చాలా క్రికెట్ ఆడావ్.. బ్రేక్ తీసుకో.. హిట్ మ్యాన్ కు వాన్ సూచన
TATA IPL 2022: ఐపీఎల్-15లో వరుసగా విఫలమవుతూ తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ క్రికెట్ కు కాస్త బ్రేక్ ఇస్తే బెటరని అంటున్నాడు మైఖెల్ వాన్.

తీరికలేని క్రికెట్ కారణంగా మానసికంగానే గాక శారీరకంగా కూడా క్రికెటర్లు అలిసిపోతున్నారని, అందుకే చాలా మంది క్రికెటర్లు ఫామ్ కోల్పోవడం, సరిగా రాణించలేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో క్రికెటర్లు కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని.. తద్వారా వాళ్లు రీఫ్రెష్ అయి బాగా ఆడే అవకాశం ఉంటుందనేది క్రికెట్ పండితుల వాదన. ఇన్నాళ్లు చాలా మంది మాజీ క్రికెటర్లు, అభిమానులు ఈ సలహాను భారత మాజీ సారథి విరాట్ కోహ్లికి ఇచ్చేవారు.
ఇప్పుడు రోహిత్ శర్మ వంతు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా తీరిక లేని క్రికెట్ ఆడటం వల్లే హిట్ మ్యాన్ ఐపీఎల్ లో విఫలమవుతున్నాడని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖెల్ వాన్ అన్నాడు.
వాన్ స్పందిస్తూ... ‘రోహిత్ శర్మ కొన్ని రోజులు విరామం తీసుకుంటే బాగుంటుందని నేను భావిస్తున్నాను. అతడు చాలా కాలంగా సుదీర్ఘ క్రికెట్ ఆడుతున్నాడు. అదే రోహిత్ ఆటపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. విరామం తీసుకుని కొన్నాళ్ల తర్వాత తిరిగి గ్రౌండ్ లో అడుగుపెట్టు.
ఇప్పటికే 8 మ్యాచులు ఓడిన ముంబై ఇక ఐపీఎల్ లో కోల్పోయేదేం లేదు. ఈ ఏడాది వాళ్లది కాదు. అంతే. అయితే రోహిత్ కొన్ని మ్యాచులకు విశ్రాంతి తీసుకుని మిగిలిన వాళ్లకు అవకాశమివ్వాలి. రోహిత్ గైర్హాజరీలో ఎవరైనా కొత్త ఆటగాళ్లు కూడా వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా...’ అని చెప్పాడు.
ఇక ఇటీవలే విరాట్ కోహ్లికి కూడా విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. కోహ్లి కూడా సుదీర్ఘ కాలంగా తీరిక లేని క్రికెట్ ఆడుతున్నాడని, అందుకే అతడు గత కొంతకాలంగా విరామం లేక విఫలమవుతున్నాడని చెప్పుకొచ్చాడు. రవిశాస్త్రితో పాటు పలవురు మాజీ క్రికెటర్లు కూడా కోహ్లి ఆటతీరుపై ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ సీజన్ లో రోహిత్ శర్మ.. 8 మ్యాచులలో 153 పరుగులు చేశాడు. బ్యాటింగ్ సగటు 19.13 సగటు మాత్రమే. ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. ఇక విరాట్ కోహ్లి.. 8 మ్యాచులలో 17 బ్యాటింగ్ సగటుతో 119 రన్స్ చేశాడు. కోహ్లి కూడా ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.