నేనైతే అలా చేయను.. దానిని బ్యాన్ చేయాలి.. ‘మన్కడింగ్’పై మోయిన్ అలీ షాకింగ్ కామెంట్స్
Deepti Sharma Run Out Row: వికెట్ కోసం పరితపించే బౌలర్.. ఆ మేరకు ఏ పని చేయకుండానే వికెట్ పొందాలని చూస్తే మాత్రం అది తప్పు. వికెట్ తీయడం కోసం ఎంతో కొంత కృషి చేయాలి. రనౌట్ లో కూడా కొంత శ్రమ ఉందని అంటున్నాడు ఇంగ్లాండ్ స్పిన్నర్ మోయిన్ అలీ..

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో వన్టేలో భారత స్పిన్నర్ దీప్తి శర్మ.. బ్రిటీష్ బ్యాటర్ చార్లీ డీన్ ను ‘రనౌట్’ చేసిన వ్యవహారంపై ఇంగ్లాండ్ క్రికెట్ లో జోరుగా చర్చ సాగుతున్నది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ పురుషుల జట్టు వైస్ కెప్టెన్ ( పాకిస్తాన్ సిరీస్ లో సారథిగా వ్యవహరిస్తున్నాడు) మోయిన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టెలిగ్రాఫ్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అలీ మాట్లాడుతూ.. ‘నేనైతే అలా (నాన్ స్ట్రైకర్ ను బంతి విసరకముందే రనౌట్ చేయడం) చేయను. నేను ఎవరి మీదైనా కోపంగా ఉన్నా సరే ఆ పని చేస్తానని అనుకోను. అయితే ఇది క్రికెట్ చట్టాల్లో ఉంది. అదేం చట్టవ్యతిరేకం కూడా కాదు. చట్టాల్లో ఉన్నది కాబట్టే దానిని చేసేవాళ్లు కూడా అది రైట్ అని సమర్థిస్తున్నారు.
అయితే వికెట్ కోసం పరితపించే బౌలర్.. ఆ మేరకు ఏ పని చేయకుండానే వికెట్ పొందాలని చూస్తే మాత్రం అది తప్పు. వికెట్ కోసం ఎంతో కొంత కృషి చేయాలి. రనౌట్ లో కూడా కొంత శ్రమ ఉంది. అది కూడా చేయకుండా అప్పనంగా వికెట్ తీయడమనేది కరెక్ట్ కాదు.
నేనైతే ఇప్పటివరకు అలా చేయలేదు. నేను నా చిన్నప్పుడు క్రికెట్ ఆడే రోజుల్లో కూడా ఇలా చేయలేదు. అయితే బ్యాటర్లు మాత్రం తప్పకుండా క్రీజులోనే ఉండాలి. ఇది కొంచెం కష్టైమన వ్యవహారమే అయినా తప్పదు. నాన్ స్ట్రైక్ లో ఉండే బ్యాటర్.. బౌలర్ రనప్ ను బట్టి తన కదలికలను మార్చుకుంటూ ఉంటాడు. బౌలర్ క్రీజు దాటి బౌలింగ్ వేసేప్పుడు ఆ బ్యాటర్ తప్పకుండా ముందుకు కదులుతాడు.
అంతేగానీ బౌలర్ చేతుల్లోనే బంతి ఉందా..? అతడు రనౌట్ చేస్తున్నాడా..? అనేది చూడడు. ఇది చాలా కష్టం. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. ఈ తరహా ఔట్ లను చట్టాల నుంచి తొలగించాలి..’ అని తెలిపాడు.
మూడో వన్డేలో చార్లీ డీన్ పదే పదే క్రీజు దాటి ముందుకు వస్తుండటాన్ని గమనించిన దీప్తి శర్మ.. బంతి వేయబోతూ వికెట్లను గిరాటేసింది. అప్పటికే ఆమె బౌలింగ్ యాక్షన్ ను పూర్తి చేసింది. చార్లీ కూడా క్రీజులో లేకపోవడంతో థర్డ్ అంపైర్ దీనిని ఔట్ గా ప్రకటించాడు.