ముంబై కెప్టెన్సీకి గుడ్ బై.. రిటైర్మెంట్ ప్లాన్ లో అజింక్య రహానే
Ajinkya Rahane: అజింక్య రహానే ముంబై రంజీ ట్రోఫీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. ఇకపై తాను ప్లేయర్ గానే జట్టులో కొనసాగుతానని ప్రకటించారు. దీంతో రహానే ఏం ప్లాన్ చేస్తున్నారనే చర్చ మొదలైంది.

అజింక్య రహానే షాకింగ్ నిర్ణయం
ముంబై క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సీనియర్ ప్లేయర్ అజింక్యా రహానే తన పదవికి వీడ్కోలు పలికాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పి అందరినీ షాక్ కు గురిచేశాడు. 2025-26 దేశవాళీ క్రికెట్ సీజన్ ప్రారంభానికి ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
2023-24 రంజీ ట్రోఫీ టైటిల్‌ను తొమ్మిదేళ్ల తర్వాత ముంబైకి అందించిన రహానే.. 2024-25 సీజన్‌లో జట్టును సెమీఫైనల్ వరకు నడిపించారు. ఇలాంటి సమయంలో ఇకపై ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని చెప్పడంతో హాట్ టాపిక్ గా మారింది.
KNOW
రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ లను గెలిచిన అజింక్య రహానే
42 సార్లు రంజీ టైటిల్ గెలిచిన ముంబై జట్టుకు రహానే మూడు సీజన్ల పాటు నాయకత్వం వహించారు. 2023-24లో ఆయన కెప్టెన్సీలో ముంబై రంజీ ట్రోఫీ గెలిచింది. అదే ఏడాది అక్టోబర్‌లో ఇరానీ కప్ ను కూడా ముంబైకి అందించారు.
అయితే 2024-25 సీజన్‌లో రహానే వ్యక్తిగత ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. తొమ్మిది మ్యాచ్‌ల్లో 467 పరుగులు మాత్రమే చేశాడు. 35.92 సగటుతో బ్యాటింగ్ కొనసాగించారు. ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీలను బాదారు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రహానే రికార్డు
గత సీజన్‌లో రహానే సూపర్ కెప్టెన్సీతో ముంబైకి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలిపించారు. ఈ టోర్నమెంట్‌లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచారు. 9 మ్యాచ్‌ల్లో 469 పరుగులు చేశారు. ఐదు హాఫ్ సెంచరీలు సాధించారు. 58.62 సగటు తో తన బ్యాటింగ్ ను కొనసాగించారు.
అజింక్య రహానే కెప్టెన్సీ పై ఏం చెప్పారు?
ముంబై కెప్టెన్సీని వీడటం పై అజింక్య రహానే సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తన నిర్ణయాన్ని రహానే X ద్వారా ప్రకటించారు. “ముంబై జట్టుతో కెప్టెన్సీ చేయడం, ఛాంపియన్‌షిప్‌లు గెలవడం నాకు గొప్ప గౌరవం. కొత్త సీజన్ ప్రారంభం అవుతున్న ఈ సమయంలో కొత్త నాయకుడిని తీసుకురావడానికి ఇదే సరైన సమయం. అందుకే నేను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నాను. కానీ ఆటగాడిగా ముంబై జట్టుకోసం ఆడతాను. జట్టుకు మరిన్ని టైటిళ్లు అందించడమే నా లక్ష్యం” అని రహానే అన్నారు.
Captaining and winning championships with the Mumbai team has been an absolute honour.
With a new domestic season ahead, I believe it’s the right time to groom a new leader, and hence I’ve decided not to continue in the captaincy role.
I remain fully committed to giving my best…— Ajinkya Rahane (@ajinkyarahane88) August 21, 2025
రహానే భవిష్యత్ ఏంటి?
రహానే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ముంబై తరఫున రెండవ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఉన్నారు. 76 మ్యాచ్‌ల్లో 5932 పరుగులు చేశారు. వీటిలో 19 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. లిస్ట్-A క్రికెట్‌లో 53 మ్యాచ్‌ల్లో 1906 పరుగులు చేశారు. ఇందులో నాలుగు సెంచరీలు, పది హాఫ్ సెంచరీలు సాధించారు.
అజింక్య రహానే భారత జట్టు తరపున మూడు ఫార్మాట్లలో కలిపి 8 వేలకు పైగా పరుగులు చేశారు. టెస్ట్ క్రికెట్ లో 85 మ్యాచ్ లలో 12 సెంచరీలతో 5,077 పరుగులు, వన్డే క్రికెట్ లో 90 మ్యాచ్ లలో 3 సెంచరీలతో 2,962 పరుగులు చేశారు. టీ20 ఇంటర్నేషనల్ లో 20 మ్యాచుల్లో 375 పరుగులు సాధించారు. ఇక ఐపీఎల్ లో రహానే 198 మ్యాచ్‌లు ఆడి 5,032 పరుగులు చేశారు. ఇందులో రెండు సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇటీవల లండన్‌లో వింబుల్డన్, లార్డ్స్ టెస్టు సందర్శన సమయంలో ఆయన “టెస్ట్ క్రికెట్‌పై ఇంకా ఆసక్తి ఉంది. తిరిగి ఆడాలని కోరిక ఉంది. నా ప్యాషన్ ఇంకా తగ్గలేదు” అని అన్నారు. అయితే, తాజాగా తీసుకున్న నిర్ణయం చూస్తే త్వరలోనే టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పే అవకాశముంది. ప్రస్తుతం భారత జట్టులో స్థానం కోసం చాలా మంది యంగ్ ప్లేయర్లు పోటీ పడుతున్నారు. సెలక్టర్లు కూడా జట్టు భవిష్యత్తు కోసం యంగ్ ప్లేయర్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ పరిస్థితుల మధ్య మళ్లీ రహానేకు టీమిండియాలో చోటు అంటే కష్టమే. కాగా, ప్రస్తుతం ముంబై కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రహానే ఇక ఆటగాడిగా జట్టులో కొనసాగనున్నారు.
ముంబై కెప్టెన్సీ రేసులో ఉన్నది ఎవరు?
రహానే తప్పుకోవడంతో ముంబై క్రికెట్‌లో కొత్త కెప్టెన్ ఎవరు అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి ఆల్‌రౌండర్ షార్దూల్ ఠాకూర్ పేరు కెప్టెన్సీ రేసులో మొదటి పేరుగా వినిపిస్తోంది. ఆయనను తాజాగా దులీప్ ట్రోఫీకి వెస్ట్‌జోన్ కెప్టెన్‌గా నియమించారు.
మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా రేసులో ఉన్నారు. ఆయన గత సంవత్సరం ముంబైకి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలిపించారు. అయ్యర్ ఐపీఎల్ 2024లో కోల్ కతా నైట్ రైడర్స్‌కు టైటిల్ గెలిపించగా, 2025లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చారు.
వీరితో పాటు యశస్వి జైస్వాల్, శంస్ ములానీ, సర్ఫరాజ్ ఖాన్ వంటి ఆటగాళ్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ కారణంగా పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి అయ్యర్, ఠాకూర్, ములానీ లేదా సర్ఫరాజ్‌లలో ఎవరో ఒకరు కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది.