WPL Auction: ఆడేది.. ఆడించేది.. ఆఖరకు వేలం వేసేదీ మహిళే.. బీసీసీఐ కీలక నిర్ణయం..
WPL 2023 Auction: వచ్చే నెల నుంచి ముంబై వేదికగా జరుగబోయే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కు ముందు తొలి సీజన్ లో వేలం జరగాల్సి ఉంది. సోమవారం ముంబై లో వేలం జరుగనుంది.

భారత క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రేపు (ఫిబ్రవరి 13న) వేలం ప్రక్రియ జరుగనున్న విషయం తెలిసిందే. గడిచిన 16 సీజన్లలో బీసీసీఐ ఐపీఎల్ లో వేలం ప్రక్రియ మాదిరిగానే ఇది కూడా సాగనుంది. అయితే ఈ వేలానికి యాక్షనీర్ గా ఎవరు ఉండనున్నారనేది బీసీసీఐ తాజాగా ప్రకటించింది.
గత నాలుగు సీజన్లుగా ఐపీఎల్ వేలంను హ్యాగ్ ఎడ్మడస్ నిర్వహిస్తున్నాడు. కానీ మహిళా క్రికెటర్ల వేలం కావున వేలం ప్రక్రియలో కూడా బీసీసీఐ చిన్న మార్పు చేసింది. ఎడ్మడస్ ను కాకుండా ఈ వేలం ప్రక్రియకు మహిళనే ఎంచుకుంది. ముంబైకి చెందిన మలైకా అద్వానీని నియమించింది.
మలైకా అద్వానీ.. ముంబైలోని ఓ ఆర్ట్ సంస్థలో కన్సల్టెంట్ గా పనిచేస్తున్నది. మలైకా పనితీరును మెచ్చిన బీసీసీఐ.. సోమవారం జరుగబోయే వేలం ప్రక్రియను ఆమెకే అప్పజెప్పింది. ఎడ్మడస్ మాదిరిగా ఆమె కూడా డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ కు సంబంధించిన వేలాన్ని విజయవంతంగా నిర్వహిస్తుందని బీసీసీఐ భావిస్తున్నది.
కాగా మార్చి 4 నుంచి మొదలుకాబోయే ఈ లీగ్ లో ఆడేది మహిళలే. అంపైర్లు కూడా మహిళలనే నియమించనున్నారు. టీమ్ హెడ్ కోచ్ లు, ఇతర సిబ్బంది కూడా మహిళలే ఉండనున్నారు. తాజాగా వేలం నిర్వహించేది కూడా మహిళనే అవుతండటం గమనార్హం. రేపు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో గల జియో కన్వెన్షన్ సెంటర్ లో మధ్మాహ్నం 2:30 గంటల నుంచి వేలం జరగాల్సి ఉంది. ఈ వేలంలో 409 మంది మిగిలారని బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్నది. వీరిలో 246 మంది భారత క్రికెటర్లు కాగా 163 మంది ఓవర్సీస్ (విదేశీ) ప్లేయర్లున్నారు.
తొలి సీజన్ లో ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి బీసీసీఐ రూ. 10 లక్షల బేస్ ప్రైస్ ను నిర్ణయించింది. రూ. 10 లక్షలు, రూ. 20 లక్షలు, రూ. 30 లక్షలు, రూ. 40 లక్షలు, రూ. 50 లక్షల కేటగిరీలలో ఆటగాళ్లను విభజించారు. ఈ ధరల ప్రకారం ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. ఆటగాళ్లను దక్కించుకోవడానికి ఒక్కో టీమ్ రూ. 9 కోట్ల నుంచి రూ. 12 కోట్ల వరకూ ఖర్చు చేయవచ్చు. ఐదు టీమ్ లు కలిపి రూ. 60 కోట్ల దాకా ఖర్చు చేసే అవకాశముంది.
ఈ లీగ్ లో హయ్యస్ట్ ప్రైస్ (రూ. 50 లక్షల కేటగిరీ) లో భారత స్టార్ క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ, షఫాలీ వర్మతో పాటు మరో నలుగురు క్రికెటర్లు ఉన్నారు. మొత్తంగా రూ. 50 లక్షల కేటగిరీలో 24 మంది ఉన్నారు. రూ. 40 లక్షల కేటగిరీలో మొత్తం 30 మంది ప్లేయర్లు ఉండగా ఇందులో 8 మంది ఇండియన్ క్రికెటర్స్ ఉన్నారు.