విండీస్ తో సిరీస్ కు ముందు టీమిండియాకు షాక్.. కీలక ఆటగాడికి కరోనా
WI vs IND: నేటి నుంచి వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత జట్టుకు వరుస షాకులు తాకుతున్నాయి. కీలక ఆటగాడు కరోనా బారిన పడ్డాడు.

Image credit: PTI
భారత్-వెస్టిండీస్ మధ్య నేటి (జులై 21) నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కావల్సి ఉంది. ఈ మేరకు ఇప్పటికే కరేబియన్ దీవులకు చేరిన భారత జట్టు అక్కడ ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంటున్నది. శుక్రవారం రాత్రి 7 గంటలకు తొలి వన్డే ప్రారంభమవుతుంది.
అయితే వన్డే సిరీస్ కు ముందు భారత జట్టుకు షాక్ తగిలింది. టీమిండియా స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో ఉంటున్న అతడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
దీంతో అతడు త్వరలోనే రాబోయే వెస్టిండీస్ తో టీ20 సిరీస్ కు అందుబాటులో ఉంటాడా..? లేదా..? అనేది అనుమానంగానే ఉంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికాతో సిరీస్ కు ముందే జాతీయ జట్టుతో ఆడాల్సి ఉన్న రాహుల్.. ఆ సిరీస్ కు ముందు గాయపడ్డాడు.
కాలికి శస్త్రచికిత్స కోసమని ఇటీవలే జర్మనీ వెళ్లొచ్చిన రాహుల్.. ఎన్సీఏలో శిక్షణ తీసుకుంటున్నాడు. విండీస్ తో టీ20 సిరీస్ కు ఎంపికైన రాహుల్.. ఫిట్నెస్ పరీక్షలో పాల్గొనాల్సి ఉంది.
అయితే ఫిట్నెస్ టెస్టుకు ముందే అతడు కరోనా బారిన పడటం గమనార్హం. దీంతో అతడు ఫిట్నెస్ టెస్టుకు హాజరవుతాడా..? అనేది అనుమానంగానే ఉంది. విండీస్ సిరీస్ కు వెళ్లాలంటే రాహుల్ కరోనా నెగిటివ్ రిపోర్టు సమర్పించాల్సిన అవసరముంది.
విండీస్ తో టీ20 సిరీస్ కు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్. వీరితో పాటు కెఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నారు. అయితే వాళ్లు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది.