కెప్టెన్‌కు తుది జట్టులో చోటు దక్కేనా..? సఫారీ సారథి పరిస్థితి దారుణం
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ కు ముందు దక్షిణాఫ్రికా జట్టు ఈ మెగా టోర్నీలో ఎలా రాణిస్తుందనేదానికంటే అసలు ఆ జట్టు సారథి టెంబ బవుమా తుది జట్టులో చోటు దక్కించుకుంటాడా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

సాధారణంగా ఒక జట్టుకు సారథిగా ఉన్న వ్యక్తి.. తుది జట్టులో ఎవరిని ఆడించాలి..? ఎవరిని పక్కనబెట్టాలి..? మ్యాచ్ ప్రణాళికలు ఏమిటి..? ప్రత్యర్థి జట్లను ఎలా దెబ్బతీయాలి..? వంటి విషయాలను టీమ్ మేనేజ్మెంట్ తో చర్చిస్తాడు.
కానీ దక్షిణాఫ్రికా సారథి టెంబ బవుమా పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. రాబోయే టీ20 ప్రపంచకప్ లో అతడు సారథిగా ఉన్నా బవుమాకు తుది జట్టులో ఆడే అవకాశముంటుందా..? అనేది సఫారీ జట్టులో మిలియన్ డాలర్ల ప్రశ్న అయింది.
గడిచిన కొంతకాలంగా బవుమా పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు. ముఖ్యంగా టీ20లలో అతడి ఆట నానాటికీ దిగజారుతున్నది. టీ20లలో బవుమా స్ట్రైక్ రేట్ 116.49గా ఉండగా సగటు 23.54 మాత్రమే. అన్నింటికీ మించి తన టీ20 కెరీర్ మొత్తంలో బవుమా కొట్టిన ఫోర్లు 50, సిక్సర్లు 13 మాత్రమే.
ఇప్పటివరకు 28 టీ20లు ఆడిన బవుమా.. 27 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా 565 పరుగులు చేశాడు. ఒక్కటంటే ఒక్కటి మాత్రమే హాఫ్ సెంచరీ ఉంది. ఇదిలాఉండగా గత కొంతకాలంగా బవుమా ఆట దారుణంగా ఉంది.
గడిచిన 8 టీ20 ఇన్నింగ్స్ లలో బవుమా స్కోర్లు ఇవి.. 3, 0, 0, 8, 8, 35, 10, 0. ఈ ఏడాది భారత్ తో జూన్ లో ఆడిన నాలుగు టీ20లతో పాటు ఇటీవలే ముగిసిన మూడు టీ20లలో బవుమా దారుణంగా విఫలమయ్యాడు. దీంతో వన్డే జట్టులో అతడిని ‘గాయం’ పేరు చెప్పి పక్కనబెట్టింది దక్షిణాఫ్రికా యాజమాన్యం. బవుమా ఆట తీరు చూసి ఇటీవలే అక్కడ ముగిసిన ఎస్ఎ టీ20 లీగ్ లో అతడిని ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయడానికి రాలేదంటేనే అతడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బవుమాకు ప్రధాన పోటీదారుగా ఉన్న రీజా హెండ్రిక్స్ మాత్రం దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు 48 టీ20లు ఆడిన హెండ్రిక్స్.. 47 ఇన్నింగ్స్ లలో 1,372 పరుగులు చేశాడు. అతడి సగటు 29.82గా ఉండగా స్ట్రైక్ రేట్ 125 దాటి ఉంది. అదీగాక టీ20లలో హెండ్రిక్స్.. 11 హాఫ్ పెంచరీలు చేయడమే గాక 160 ఫోర్లు, 22 సిక్సర్లు బాదాడు. దీంతో బవుమా కంటే హెండ్రిక్స్ వైపే సఫారీ మేనేజ్మెంట్ మొగ్గుచూపుతున్నదని దక్షిణాఫ్రికా క్రికెట్ వర్గాలలో చర్చలు జోరుగా సాగుతున్నాయి.