గెలుపులు సరే.. లోపాల సంగతేంది..? ఆ ముగ్గురికి ముందుంది మహా ముప్పు
IND vs SA T20I: స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో భారత జట్టు వరుసగా రెండు పరాజయాల తర్వాత మళ్లీ విజయాల బాటపట్టింది. వైజాగ్ తో పాటు రాజ్కోట్ లో ముగిసిన మ్యాచ్ లలో విజయాలు సాధించింది.

టీ20లలో 12 విజయాలు.. ఇంకొక్కటి గెలిస్తే ప్రపంచ రికార్డు మన సొంతమయ్యేది. విరాట్ కోహ్లి శంకు స్థాపన చేసి రోహిత్ శర్మ నిర్మించిన ఆ కలల సౌధాన్ని రిషభ్ పంత్ సేన నిట్టనిలువునా ముంచింది. ఢిల్లీ తో పాటు కటక్ లో ఓటమి పాలై సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది.
కానీ వైజాగ్ లో జరిగిన మూడో మ్యాచ్ తో పాటు రాజ్కోట్ లో ముగిసిన మూడు, నాలుగు మ్యాచులలో భారత జట్టు మళ్లీ విజయాల బాట పట్టి సిరీస్ ను సమం చేసింది. ఇక బెంగళూరులో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. భారత జట్టు విజయాల బాటనైతే పట్టింది గానీ బ్యాటింగ్ లో లోపాలు మాత్రం ఇంకా దారి నిండా ముళ్లులా గుచ్చుకుంటూనే ఉన్నాయి. మరి వాటి సంగతేంది..? అని అడుగుతున్నారు టీమిండియా అభిమానులు.
ఈ సిరీస్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్ ల గైర్హాజరీలో భారత జట్టు.. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ లకు ఓపెనర్లుగా ప్రమోట్ చేసింది. శ్రేయాస్ అయ్యర్ ను వన్ డౌన్ లో పంపుతున్నది. ఇదేదో ఇప్పటిమట్టుకే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా పొట్టి ప్రపంచకప్ జరగాల్సి ఉంది. ఇప్పుడు చేసేవన్నీ పొట్టి ప్రపంచకప్ కు సన్నాహాలే అని అందరికీ తెలిసిందే.
మరి సీనియర్లు లేనప్పుడు వచ్చిన ఈ సదావకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకుంటున్నారా..? అంటే కాదనే సమాధానం వినిపిస్తున్నది. ఇషాన్, రుతురాజ్, అయ్యర్ లతో పాటు కెప్టెన్ రిషభ్ పంత్ కూడా అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో అట్టర్ ప్లాఫ్ అవుతున్నారు.
సఫారీ సిరీస్ కు ముందు జరిగిన ఐపీఎల్ లో కూడా ఈ నలుగురి ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. 2021 సీజన్ లో ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ అయిన గైక్వాడ్.. ఈ సిరీస్ లో వైజాగ్ మ్యాచ్ లో మాత్రమే కాస్త మెరుగ్గా ఆడాడు. మిగిలిన 3 మ్యాచుల్లో చేతులెత్తేశాడు. ఈ సిరీస్ లో అతడు చేసిన స్కోర్లు వరుసగా 5, 57, 1, 23 (మొత్తం 86 పరుగులు) గా ఉన్నాయి. ఐపీఎల్ లో కూడా గైక్వాడ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఐపీఎల్ కంటే ముందు శ్రీలంకతో జరిగిన సిరీస్ లో కూడా గైక్వాడ్ ఆకట్టుకోలేకపోయాడు.
గైక్వాడ్ విఫలమవుతుంటే మరోవైపు తనకు వచ్చిన అవకాశాన్ని ఇషాన్ కిషన్ రెండు చేతులా సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న ఈ రాంచీ కుర్రాడు.. అంచనాలకు మించి రాణిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ లో తనను తప్పకుండా ఆడించాల్సిందే అన్న రీతిలో చెలరేగుతున్నాడు.
టీమిండియా తరఫున టీ20లో గత 10 ఇన్నింగ్స్ లలో ఇషాన్ చేసిన స్కోర్లివి : 27, 54, 34, 76, 16, 89, 34, 2, 35, 29. ఉన్నంతసేపు మెరుపులు మెరిపిస్తున్న కిషన్.. రాబోయే టీ20 ప్రపంచకప్ లో తనను తప్పకుండా ఆడించాలన్న విధంగా ముద్ర వేసుకుంటున్నాడు.
ఇక శ్రేయాస్ విషయానికొస్తే.. సఫారీ సిరీస్ కు ముందు (ఐపీఎల్ ను పక్కనబెడితే) టీ20లలో అతడు భీకర ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ కంటే ముందు ముగిసిన శ్రీలంక తో జరిగిన మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో వరుసగా 3 హాఫ్ సెంచరీలు చేశాడు. అంతకుముందు విండీస్ సిరీస్ లో కూడా ఆకట్టుకున్నాడు.
కానీ ఐపీఎల్ లో కేకేఆర్ సారథిగా ఉన్న అయ్యర్.. అడపాదడపా తప్ప భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక సఫారీ సిరీస్ లో కూడా గత నాలుగు మ్యాచులలో 4, 14, 40, 36 పరుగులు చేశాడు.
ఈ ఇద్దరికంటే ఎక్కువ ఆందోళనపరుస్తన్న ఆటగాడు టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్. ఉన్నంతసేపు దాటిగా ఆడతాడనే పేరు తప్ప గత పది ఇన్నింగ్స్ లలో పంత్ స్కోర్లు చూస్తే అసలు అతడు టీ20లకు పనికొస్తాడా..? అన్న అనుమానం రాకమానదు.
Rishabh Pant
గత 10 ఇన్నింగ్స్ లలో పంత్ స్కోర్లు వరుసగా.. 17, 6, 5, 29, 52, 8, 4, 12, 17, 0 గా ఉన్నాయి. పది ఇన్నింగ్స్ లలో ఒకటే హాఫ్ పెంచరీ. వన్డేలు, టెస్టులలో నిలకడగా ఆడుతున్న పంత్.. టీ20లకు వచ్చేసరికి దారుణంగా విఫలమవుతున్నాడు.
ఈ నలుగురిలో కిషన్ సంగతి పక్కనబెడితే మిగిలిన ముగ్గురూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదన్నది గణాంకాలు చెబుతున్న వాస్తవం. వరుసగా విఫలమవుతున్న గైక్వాడ్, అయ్యర్, పంత్ లు తమ ఆటతీరు మార్చుకోకుంటే రాబోయే సిరీస్ లలో వాళ్లకు చోటు దక్కడం కష్టమే.
రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ లు తిరిగి జట్టులో చేరితే వీళ్ల స్థానాలు గల్లంతవడం ఖాయం. ఇప్పటికే పంత్ కు సీనియర్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముప్పును గ్రహించాలని.. పంత్ లేకుంటే ఇషాన్, దినేశ్ కార్తీక్, కెఎల్ రాహుల్ రూపంలో భారత్ కు వికెట్ కీపర్లున్నారని హెచ్చరిస్తున్నా అతడు మొద్దునిద్ర వీడటం లేదు
ఇక ప్రపంచకప్ కంటే ముందే భారత్.. పటిష్టమైన ఇంగ్లాండ్ తో పాటు వెస్టిండీస్, ఆసియా కప్ లలో ఆడాల్సి ఉంది. అందుకు సఫారీ సిరీస్ ను కూడా పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం జట్టులో ఉన్న పలువురికి చోటు దక్కడం కష్టమే.
మరి టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న భారత జట్టు ఆలోపు ఆటగాళ్లను సిద్ధం చేసేందుకు మరిన్ని ప్రయోగాలకు, సాహసాలకు దిగుతుందనడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని గ్రహించకుంటే పంత్ తో పాటు అయ్యర్, గైక్వాడ్ లకు ముప్పు తప్పదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.