- Home
- Sports
- Cricket
- Shane Warne: చనిపోయే ముందే నాకు మెసేజ్ చేశాడు.. దానిని నా జీవితంలో డిలీట్ చేయను : గిల్లీ ఎమోషనల్ కామెంట్స్
Shane Warne: చనిపోయే ముందే నాకు మెసేజ్ చేశాడు.. దానిని నా జీవితంలో డిలీట్ చేయను : గిల్లీ ఎమోషనల్ కామెంట్స్
Adam Gilchrist About Shane Warne: ఈనెల 4న మరణించడానికి కొద్దిసేపటి ముందు షేన్ వార్న్ నుంచి తనకు మెసేజ్ వచ్చిందని.. ఆ సందేశాన్ని తాను ఎప్పటికీ డిలీట్ చేయబోనని అన్నాడు గిల్లీ...

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ మరణంపై ఆ దేశానికి చెందిన మరో లెజెండరీ ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ట్ స్పందించాడు. వార్న్ చనిపోయే కొద్దిగంటల ముందే తనకు మెసేజ్ చేశాడని చెప్పుకొచ్చాడు.
తామిద్దరం కలిసి ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్లమని.. తనకు అత్యంత ఆప్తులైన వారిలో వార్న్ కూడా ఒకడని గిల్లీ అన్నాడు. వార్న్ మరణం నేపథ్యంలో గిల్ క్రిస్ట్ ఓ క్రీడా ఛానెల్ తో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.
గిల్లీ మాట్లాడతూ.. ‘వారం క్రితమే నేను వార్న్ (మార్చి 4న వార్న్ మరణించాడానికి రెండ్రోజుల ముందు) తో మాట్లాడాను. ఇక అతడు చనిపోయే సరిగ్గా 8 గంటల ముందు అతడు నాకు ఒక మెసేజ్ పెట్టాడు.
నన్ను చర్చీ అని పిలిచే అతికొద్దిమంది సన్నిహితుల్లో వార్నీ ఒకడు. చాలా కొద్దిమందికి మాత్రమే ఆ పేరు తెలుసు. ఇంగ్లాండ్ తో యాషెస్ సందర్బంగా ఓ ఇంగ్లీష్ అభిమాని నన్ను ఎరిక్ గిల్చర్చ్ అని పిలిచాడు. అప్పట్నుంచి నా సన్నిహితులు నన్ను చర్చీ అని పిలిచేవారు. వారిలో వార్న్ ఒకడు.
ఇక వార్న్ పంపిన మెసేజ్ విషయానికొస్తే... వార్న్ మరణానికి ఒకరోజు ముందు ఆసీస్ దిగ్గజ వికెట్ కీపర్ రాడ్ మార్ష్ కూడా మరణించాడు. అతడి మరణానికి సంతాపంగా నేను ఒక వాయిస్ మెసేజ్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశాను.
అది విన్న వార్న్ నాకు మెసేజ్ చేశాడు. మార్ష్ కు మంచి ట్రిబ్యూట్ ఇచ్చారు సార్ అని నన్ను మెచ్చుకున్నాడు. కానీ అతడు మెసేజ్ చేసిన కొద్దిగంటలకే ఇలా జరిగిపోయింది. వార్న్ పంపిన మెసేజ్ ను నేను నా జీవితంలో డిలీట్ చేయను...’ అంటూ గిల్ క్రిస్ట్ ఎమోషనల్ అయ్యాడు.
కాగా మార్చి 4న థాయ్లాండ్ లోని తన విల్లాలో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో షేన్ వార్న్ మరణించిన విషయం తెలిసిందే. శవపరీక్షల అనంతరం ప్రత్యేక విమానంలో వార్న్ పార్థీవ దేహాన్ని ఆస్ట్రేలియాకు పంపించింది థాయ్లాండ్. ఈ నెల 30 న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో వార్న్ కు తుది వీడ్కోలు ఇచ్చేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సన్నాహకాలు చేస్తున్నది.