వస్తున్నా నేనే వస్తున్నా.. వచ్చే సీజన్ లో ఆర్సీబీకి తిరిగి రానున్న మిస్టర్ 360
IPL 2022: ఐపీఎల్ చరిత్రలో తనకంటూ ఓ పేరు లిఖించుకున్న అతికొద్ది మంది ఆటగాళ్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఒకడు. గతేడాది అతడు పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

AB de Villiers
ఆధునిక క్రికెట్ లో గొప్ప బ్యాటర్లు అనదగ్గవారిలో తప్పక ఉండే పేరు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్. అభిమానులు మిస్టర్ 360 గా పిలుచుకునే ఈ మాజీ ఆర్సీబీ లెజెండ్.. 2021 సీజన్ తర్వాత ఐపీఎల్ నుంచి కూడా రిటైరైన విషయం తెలిసిందే.
అయితే ఈ విధ్వంసకర ఆటగాడు తిరిగి 2023 సీజన్ లో మెరవబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. ఇటీవలే ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లి ఇందుకు సంబంధించి ఓ హింట్ ఇవ్వగా తాజాగా ఏబీడీ దానిని కన్ఫర్మ్ చేశాడు.
ఓ ఇంటర్వ్యూలో కోహ్లి మాట్లాడుతూ.. ‘మీరు వచ్చే సీజన్ లో ఏబీడీని రెడ్ జెర్సీలో చూసే అవకాశముంది..’ అని వ్యాఖ్యానించాడు. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
తాజాగా ఇదే విషయమై ఏబీడీ మాట్లాడుతూ.. ‘విరాట్ అలా చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా చెప్పాలంటే తర్వాత సీజన్ లో నేను ఆర్సీబీ తరఫున ఏం పాత్ర పోషించాలో నాకు కూడా సరిగ్గా తెలియదు..
కానీ వచ్చే ఏడాది మాత్రం కచ్చితంగా ఐపీఎల్ లో ఉంటా. నా సామర్థ్యాన్ని వాళ్లు ఎలా ఉపయోగించుకుంటారో నాకు తెలియదు గానీ నేనైతే ఐపీఎల్ ను చాలా మిస్ అవుతున్నాను. వచ్చే ఏడాది బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచులు జరుగుతాయని ఆశిస్తున్నాను. సోషల్ మీడియాలో కూడా అందుకు సంబంధించి వార్తలు వస్తున్నాయి.
కావున నేను నా సెకండ్ హోమ్ గా భావించే బెంగళూరు కు తిరిగి రావడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. నాకెంతో ఇష్టమైన చిన్నస్వామి స్టేడియంలో అభిమానుల కేరింతల మధ్య ఐపీఎల్ ను చూడాలని అనుకుంటున్నాను. నేను కచ్చితంగా వస్తాను. ఆ క్షణం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను..’ అని చెప్పుకొచ్చాడు.
అయితే డివిలియర్స్ 2018 లోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగినా అతడు తర్వాత మూడేండ్ల పాటు ఐపీఎల్ ఆడాడు. గత సీజన్ అనంతరం ఏబీడీ.. ట్విటర్ వేదికగా ఐపీఎల్ నుంచి కూడా తాను రిటైరవుతున్నట్టు చెప్పిన విషయం తెలిసిందే. కాగా వచ్చే ఏడాది ఏబీడీ ఆర్సీబీ తరఫున ఏ పాత్ర పోషిస్తాడనేదానిమీద ఇంకా స్పష్టత లేదు.