- Home
- Sports
- Cricket
- Virat Kohli: కొన్నిసార్లు బ్రేక్ తీసుకుంటేనే మంచిది.. కోహ్లికి ఇంగ్లాండ్ మాజీ సారథి సూచన
Virat Kohli: కొన్నిసార్లు బ్రేక్ తీసుకుంటేనే మంచిది.. కోహ్లికి ఇంగ్లాండ్ మాజీ సారథి సూచన
IPL 2022: ఐపీఎల్ లో అత్యంత చెత్త ఆటతీరుతో వరుసగా విఫలమవుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కొన్నాళ్లు రెస్ట్ తీసుకుంటేనే మంచిదనే డిమాండ్ నానాటికీ పెరుగుతున్నది. ఆ తర్వాతైనా అతడు రాణించగలడనే నమ్ముతున్నారు.

మునుపెన్నడూ లేని విధంగా ఐపీఎల్-15లో అధ్వాన్న ఆటతో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నాడు టీమిండియా, ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లి. 12 మ్యాచులు ఆడినా కోహ్లి ఇంతవరకు ‘చాలా భాగా ఆడాడు..’ అని అనిపించే ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు.
12 మ్యాచులలో 19.64 సగటుతో 219 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ముక్కీ మూలిగి ఒక్కటంటే ఒక్కటే హాఫ్ సెంచరీ చేశాడు. అదీగాక ఈ సీజన్ లో మూడు సార్లు డకౌటయ్యాడు. ఆదివారం సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఎదుర్కున్న తొలి బంతికే నిష్క్రమించి మరోసారి విమర్శల పాలయ్యాడు.
మొత్తంగా ఐపీఎల్ లో కోహ్లి ఆరు సార్లు డకౌట్ అవగా.. అందులో మూడు డకౌట్లు ఈ సీజన్ లోనివే కావడం గమనార్హం. ఇదొక్కటి చాలు ఈ సీజన్ లో కోహ్లి ఎంత తడబడుతున్నాడో చెప్పడానికి.
అయితే కోహ్లి ఇలా అవడానికి కారణం క్రికెట్ ఎక్కువగా ఆడటం వల్లే అనే వాదనలు కూడా ఉన్నాయి. టెస్టు, వన్డే, టీ20 లు అనే తేడా లేకుండా తీరిక లేని క్రికెట్ ఆడటం వల్లే కోహ్లి ఇలా ఫామ్ కోల్పోయి చతికిలపడుతున్నాడని, అతడు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే మంచిదని కూడా సూచనలు, సలహాలిస్తున్నారు మాజీ క్రికెటర్లు, కోహ్లి ఫ్యాన్స్.
గతంలో రవిశాస్త్రి కూడా కోహ్లి విశ్రాంతి తీసుకోవాలని.. కొన్నాళ్ల పాటు క్రికెట్ కు దూరంగా ఉండి ఆ తర్వాత మళ్లీ బ్యాట్ పడితే మునపటి విరాట్ ను చూడొచ్చని ఇటీవలే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సన్ రైజర్స్ తో మ్యాచ్ లో డకౌట్ అయ్యాక వాన్ తన ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఒక ఆటగాడికి కొన్నిసార్లు ఆట నుంచి విరామం అవసరం అవుతుంది. తీరిక లేని క్రికెట్ ఆడే ఈ క్రికెటర్లు (కోహ్లి పేరును ప్రస్తావించకుండా) విరామం తీసుకోవడం వారి కెరీర్ కు కూడా మంచే జరుగుతుంది..’ అని రాసుకొచ్చాడు.
ఐపీఎల్ లో ఇతర ఆటగాళ్లకు సాధ్యం కాని విధంగా సుమారు 6,500 పరుగులు చేసిన కోహ్లి.. ఈ సీజన్ లో మాత్రం విఫలమవుతుండటం అతడి అభిమానులతో పాటు టీమిండియాకు కూడా ఆందోళనకరంగా మారింది. రాబోయే రోజుల్లో కీలక సిరీస్ లు, ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో కోహ్లి తిరిగి మునపటి ఫామ్ ను అందుకుంటాడో..? లేదో..? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.