- Home
- Sports
- Cricket
- మహిళల ఐపీఎల్‌లో ఐదు టీమ్స్ కోసం 8 ఫ్రాంచైజీల కన్ను.. అంతగా ఆసక్తి చూపని కోహ్లీ టీమ్
మహిళల ఐపీఎల్‌లో ఐదు టీమ్స్ కోసం 8 ఫ్రాంచైజీల కన్ను.. అంతగా ఆసక్తి చూపని కోహ్లీ టీమ్
WIPL: మహిళల ఐపీఎల్ ను ఐదు జట్లతో నిర్వహిస్తామని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది. అయితే పోటీ పడే జాబితాలో మాత్రం ఐపీఎల్ నుంచే 8 మంది బడా పారిశ్రామికవేత్తలు ఉన్నారు.

పురుషుల ఐపీఎల్ ను విజయవంతంగా నిర్వహిస్తూ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్పోర్ట్స్ లీగ్ గా అవతరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాదిరే భారత్ లో మరో క్రికెట్ లీగ్ రానుంది. ఈ ఏడాది మార్చి నుంచి ఉమెన్స్ ఐపీఎల్ మొదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా తుది తేదీలు ఖరారు కానప్పటికీ మార్చి 5 నుంచి ఈ లీగ్ మొదలుకానున్నట్టు తెలుస్తున్నది.
ఇక ఉమెన్స్ ఐపీఎల్ లో టీమ్స్ ను దక్కించుకోవడానికి గాను ఐపీఎల్ లో పది ఫ్రాంచైజీలలో సుమారు 8 ఆసక్తిగా ఉన్నాయట. ఇప్పటికే టెండర్ దాఖలు ప్రక్రియను కూడా మొదలుపెట్టాయట. ఈనెల 3న బీసీసీఐ టెండర్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో రిపోర్టు ప్రకారం.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ , కోల్కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ లతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కూడా ఉమెన్స్ ఐపీఎల్ లో టీమ్ కోసం పోటీ పడుతుందట.
మహిళల ఐపీఎల్ ను ఐదు జట్లతో నిర్వహిస్తామని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది. అయితే పోటీ పడే జాబితాలో మాత్రం ఐపీఎల్ నుంచే 8 మంది బడా పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వీరితో పాటు గతేడాది ఐపీఎల్ వేలంలో టీమ్ ను దక్కించుకోవడానికి విశ్వప్రయత్నం చేసిన గ్లేజర్ ఫ్యామిలీ కూడా బిడ్ వేసేందుకు రెడీ అవుతుందని తెలుస్తున్నది.
ఐపీఎల్ లో అత్యంత క్రేజ్ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో పాటు గతేడాది భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ ను దక్కించుకున్న సంజీవ్ గొయెంకా కూడా ఉమెన్స్ ఐపీఎల్ మీద అంతగా ఆసక్తి చూపడం లేదని సమాచారం.
ఇక ఈ లీగ్ కు సంబంధించి జనవరి 23తో టెండర్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ఐదు టీమ్స్, మ్యాచ్ వేదికలు, ఇతరత్రా వివరాలు ప్రకటించే అవకాశముంది. పిబ్రవరిలో ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఉండనుంది. మార్చి 5 నుంచి 23 వ తేదీ వరకు ఉమెన్స్ ఐపీఎల్ నిర్వహించే అవకాశమున్నట్టు సమాచారం.