- Home
- Sports
- Cricket
- 13 ఫ్లైట్‌లు, 17 మ్యాచులు, రెండు ఫైనల్స్... పఠాన్ బ్రదర్స్‌కి క్రికెట్ అంటే ఎంతిష్టమో చెప్పేందుకు...
13 ఫ్లైట్‌లు, 17 మ్యాచులు, రెండు ఫైనల్స్... పఠాన్ బ్రదర్స్‌కి క్రికెట్ అంటే ఎంతిష్టమో చెప్పేందుకు...
టీమిండియాకి ఒకే సారి ప్రాతినిథ్యం వహించిన అతికొద్ది మంది బ్రదర్స్‌లో ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ కూడా ఉంటారు. ఈ ఇద్దరూ కలిసి కొన్ని మ్యాచుల్లో, విడివిడిగా ఎన్నో మ్యాచుల్లో టీమిండియాకి విజయాలు అందించారు. అయితే రాజకీయాలో మరి ఇంకేదైనా కారణమో కానీ పఠాన్ బ్రదర్స్‌కి టీమిండియాలో రావల్సినన్ని అవకాశాలైతే రాలేదు...

27 ఏళ్ల వయసులో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఇర్ఫాన్ పఠాన్, పదేళ్ల పాటు టీమ్‌లో చోటు కోసం ఎదురుచూసి నిరాశగా రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. టీమిండియా తరుపున టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి భారత ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన ఇర్ఫాన్ పఠాన్, 2007 వరల్డ్ కప్ ఫైనల్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు. తాను ఆడిన ఆఖరి వన్డేలో ఐదు వికెట్లు తీసిన తర్వాత కూడా ఇర్ఫాన్ పఠాన్ ఈ రకమైన అనుభవాన్ని చవి చూడాల్సి వచ్చింది...
క్రిస్ గేల్, కిరన్ పోలార్డ్‌లతో సమానంగా పోల్చదగ్గ అరవీర విధ్వంసకర హిట్టర్, ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్‌ది కూడా ఇదే పరిస్థితి. 2007 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన యూసఫ్ పఠాన్, 2012లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు...
భారీ సిక్సర్లు బాదుతూ ఒంటి చేత్తో మ్యాచులను మ్యాచును మలుపు తిప్పగల సత్తా ఉన్న ప్లేయర్‌గా దిగ్గజాల ప్రశంసలు అందుకున్న యూసఫ్ పఠాన్ కూడా టీమిండియాలో చోటు కోసం 2021 వరకూ ఎదురుచూశాడు. రిటైర్మెంట్ తర్వాత ఈ అన్నాదమ్ములిద్దరూ 2022లో రెండు సిరీస్‌ల్లో పాల్గొన్నారు...
legends cricket league
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 టోర్నీలో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో ఇండియా లెజెండ్స్ తరుపున ఆడిన యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్... లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీజన్ 2లోనూ పాల్గొన్నారు. అందులో ఇర్ఫాన్ పఠాన్, బిల్వారా కింగ్స్ టీమ్‌కి కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. దాదాపు ఒకే షెడ్యూల్‌లో జరిగిన ఈ రెండు సిరీసుల్లో పాల్గొన్న పఠాన్ బ్రదర్స్, తమ అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు...
‘13 ఫ్లైట్‌లు, 17 మ్యాచులు, 2 ట్రోఫీలు, రెండు ఫైనల్స్... గత 26 రోజుల్లో మా షెడ్యూల్ ఇది. మేం రెండు గంట వ్యవధిలో 6 మ్యాచులు ఆడాం. మాకు సహకరించిన పాజీ సచిన్ టెండూల్కర్‌కి థ్యాంక్యూ... ’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్...
Image credit: LLC
‘రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్, లెజెండ్స్ లీగ్ క్రికెట్ దాదాపు ఒకేసారి జరిగాయి. రెండింట్లో ఆడదామని ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు. అయితే రెండు లీగుల్లో ఒకేసారి ఆడాలంటే ఫిజికల్‌గా, మెంటల్‌గా సిద్ధంగా ఉండాలి. ఎన్నో సమస్యలను, మరెన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాం. అయితే ఆట ముందు అవన్నీ చిన్నవే..
ప్రతీ రోజూ 5-6 గంటలు ప్రాక్టీస్ చేస్తూ, ప్రయాణాలు చేస్తూ గడిపాం. ఫిజియో, సపోర్టింగ్ స్టాఫ్ మాకెంతో సాయం చేశారు. రెండు టోర్నీల్లోనూ మంచి పర్పామెన్స్ ఇవ్వడం చాలా సంతృప్తినిచ్చింది... ఇదో అద్భుత అనుభవం. నేను చాలా ఎంజాయ్ చేశా...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్...
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్, లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 రెండు టోర్నీల్లో కలిపి యూసఫ్ పఠాన్ 13 మ్యాచుల్లో 341 పరుగులు చేశాడు. ఇందులో ఐదు 30+ స్కోర్లు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ 21.2 ఓవర్లు వేసి 10 వికెట్లు తీశాడు యూసఫ్ పఠాన్...
తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ ఈ రెండు టోర్నీల్లో కలిపి 12 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసి 227 పరుగులు చేశాడు. ఇందులో రెండు సార్లు 30+ స్కోర్లు చేశాడు. 13 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీశాడు ఇర్ఫాన్ పఠాన్. యూసఫ్ పఠాన్ 27 సిక్సర్లు, 22 ఫోర్లు బాదితే... ఇర్ఫాన్ పఠాన్ 11 ఫోర్లు, 18 సిక్సర్లు బాదాడు..