సెలవు అడిగితే మీ బాస్ రియాక్షన్ కూడా ఇదేనా..? ఈ అనుభవం ప్రతి ఉద్యోగిదీ
ఉద్యోగులు వేరే పనుల కోసమో లేదా ఆరోగ్యం బాగోలేకనో సెలవు అడుగుతుంటారు. కానీ కొందరు బాస్ లు ఏదో వారి ఆస్తులు అడిగినట్లు ఫీల్ అవుతారు. ఇలాంటి అనుభవమే ప్రతి ఉద్యోగికి ఎదురవుతుంటుంది.

ప్రతి ఉద్యోగి పరిస్థితి ఇంతే..!
Employee struggles : దేవుడు వరం ఇచ్చినా పూజారి ఇవ్వలేదన్న మాట వేతనజీవులకు సరిగ్గా సరిపోతుంది. కంపెనీ ఛైర్మన్, ఎండీ వంటి ఉన్నత ఉద్యోగులు సెలవు ఇచ్చినా మేనేజర్, టీం లీడర్ వంటివారు ఇవ్వడానికి ఇష్టపడరు. ఏదో కారణం చెప్పి సెలవు ఇవ్వకుండా, కొన్నిసార్లు మేనేజ్మెంట్ ఇచ్చిన అప్రూవ్ చేసిన సెలవులను కూడా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. సెలవు అన్న మాట వినగానే ముఖం చిట్లించేవారే ఎక్కువ. చివరకు ఆరోగ్యం బాగోలేక సిక్ లీవ్ అడిగినా ఏదో వాళ్ల ఆస్తి అడినట్లుగా ఫీలయ్యే మేనేజర్లు, టీఎల్ లే ఎక్కువగా కనిపిస్తుంటారు.
ప్రతి ఉద్యోగి సెలవు కావాలంటే తమ మేనేజర్లని బతిమాలుకోవాల్సిందే... అయినా చాలామంది సెలవు దొరక్క ఇబ్బంది పడుతుంటారు. అందుకే వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారని అబద్ధాలు చెప్పి సెలవు తీసుకుంటారు. బాస్ ల తీరువల్ల సెలవు తీసుకుని హాయిగా రిలాక్స్ అయ్యే అవకాశం ఉండదు... విరామం లేకుండా పనిచేయడం వల్ల ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ప్రభావం పనిపై పడుతుంది. అందుకే విదేశాల్లో వీకెండ్ లో రెండ్రోజుల సెలవు... టైమ్ టు టైమ్ వర్క్ కల్చర్ ఉంటుందని చెబుతుంటారు.
భారత్ బాస్ vs జపాన్ బాస్
ఇక్కడ మనకో డౌట్ రావచ్చు... మన ఇండియన్ బాస్ ల మాదిరిగానే విదేశీ కంపెనీల బాస్ లు వ్యవహరిస్తారా? సెలవులు అడగ్గానే ఇస్తారా... మనోళ్లలా అతి చేస్తారా? అని. దీనికి విదేశీ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నడిచే కంపెనీలో పనిచేసే ఉద్యోగి సోషల్ మీడియా వేదికన జవాబు ఇచ్చాడు. భారత్, జపాన్ బాస్‌ల మధ్య ఉన్న తేడాను చూపించాడు. సెలవు అడిగినప్పుడు భారతీయ, జపనీస్ బాస్‌లు ఇచ్చిన రియాక్షన్‌ను పోస్ట్ చేశాడు.
సెలవు (leave) అడిగినప్పుడు బాస్‌ల రియాక్షన్ ఇలా ఉంది?
రెడ్డిట్‌లో ఒక యూజర్ సెలవు అడిగినప్పుడు భారతీయ బాస్, జపనీస్ బాస్ ఇచ్చిన రియాక్షన్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశారు. ఇద్దరూ సెలవు మంజూరు చేశారు. కానీ సెలవు ఇచ్చాక పెట్టిన కండిషన్ అందరి దృష్టిని ఆకర్షించింది.
జపనీస్ బాస్ : ఉద్యోగి ఊరికి వెళ్లాలి, సెలవు ఇవ్వండి అని అడిగినప్పుడు… ‘‘మంచిది! మీ అభ్యర్ధనను గమనించాను. సెలవు తీసుకొండి. ఇంటికి వెళ్లేటప్పుడు జాగ్రత్త’’ అని మెసేజ్ చేశారు.
భారతీయ బాస్ : ‘‘సెలవు మంజూరు చేశాను. దయచేసి మెయిల్స్ కోసం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండండి’’ అని స్పందించారు.
ఈ రెండు బాస్‌ల మెసేజ్‌లను పోస్ట్ చేసిన వ్యక్తి, అత్యవసర పని మీద ఊరికి వెళ్లాల్సి వచ్చింది. తన దగ్గర ఇంకా ఏడు క్యాజువల్ సెలవులు మిగిలి ఉన్నాయి. ఇద్దరూ తనకు సెలవు ఇచ్చారు. కానీ ఇద్దరి స్పందన భిన్నంగా ఉంది.తనకు సెలవు ఇవ్వడం ద్వారా వ్యక్తిగత సహాయం ఏదో చేస్తున్నట్లుగా ఇండియన్ బాస్ ప్రవర్తించాడని ఆ యూజర్ సోషల్ మీడియాలో తన ఆవేదన, అసహనం వ్యక్తం చేశాడు.
సోషల్ మీడియాలో కామెంట్స్
రెడ్డిట్ యూజర్ లీవ్ పోస్ట్‌కు చాలా కామెంట్స్ వచ్చాయి. ఇతర ఉద్యోగులు తమ అనుభవాలను పంచుకున్నారు. ''గతంలో తాను జపనీస్ క్లయింట్‌లతో పనిచేశాను. వాళ్ళు నాతో కూడా ఇలాగే ప్రవర్తించారు. జపనీస్ క్లయింట్‌లతో పోలిస్తే భారతీయ క్లయింట్‌ల స్వభావం భిన్నంగా ఉంటుంది'' ఒక యూజర్ కామెంట్ చేశారు.
ఫ్రాన్స్‌లో పనిచేస్తున్న ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని చెప్పారు. ''ఇక్కడ పని కంటే జీవితం ముఖ్యం. కానీ ఇండియాలో జీవితం కంటే పనే ముఖ్యం'' అని అన్నారు. ఈ పోస్ట్ వర్క్ కల్చర్‌లోని తేడాలపై పెద్ద చర్చకు దారితీసింది.
సెలవు తీసుకున్నా భారతీయులకు ప్రశాంతత ఉండదు... ఆ సమయంలో కూడా పని వెన్నంటే ఉంటుందని ఈ పోస్ట్ సూచిస్తుంది. ఈ మధ్య కాలంలో 9-6 ఉద్యోగాలు చేసి ప్రజలు విసిగిపోయారు.. అందుకే ఉద్యోగం కంటే సొంత వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. వీటన్నింటికీ ఇండియాలో ఉన్న పనిశైలి, సెలవుల గొడవ కూడా ఒక ముఖ్య కారణం అవుతోంది.