ఇళ్లు కదలకుండా నెలకు రూ. 50 వేలు సంపాదించవచ్చు.. ఈ వ్యాపారంతో సాధ్యమే
Business Idea in Telugu: ఇంటి నుంచి చిన్న వ్యాపారాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇంట్లోనే కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసుకొని బాగా ఆర్జిస్తున్నారు. అలాంటి ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.

వైపర్ తయారీ వ్యాపారం
ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్న తరుణంలో చాలా మంది స్వయం ఉపాధి వైపు ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే మొదలుపెట్టగలిగే వ్యాపారాలపై ఆసక్తి పెరుగుతోంది. అలాంటి ఒక మంచి అవకాశం వైపర్ మేకింగ్. ఇల్లు శుభ్రం చేసే సమయంలో వైపర్ అనేది తప్పనిసరి వస్తువుగా మారిపోవడంతో, దీనికి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది.
మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్
నిజానికి వైపర్లు ఉపయోగం ఒకప్పుడు కేవలం పెద్ద పెద్ద పట్టణాలకు మాత్రమే పరిమితమై ఉండేది. ఎందుకంటే ఎక్కువగా టైల్స్, మార్బుల్స్ వాడకం పట్టణాల్లో నిర్మించే ఇళ్లలో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ భవంతులను నిర్మిస్తున్నారు. దీంతో టైల్స్ వాడకం పెరిగింది. దీని వల్ల ప్రతి ఇంటికి వైపర్ అవసరం ఏర్పడింది. అంటే పట్టణాలు, గ్రామాలు రెండింటిలోనూ ఈ ఉత్పత్తికి మంచి మార్కెట్ ఉంది.
వ్యాపారం ఎలా ప్రారంభించాలి.?
వైపర్ తయారీకి ప్రధానంగా రెండు యంత్రాలు అవసరం:
* కటింగ్ మెషిన్ – షీట్స్‌ను కట్ చేయడానికి.
* బటన్ ప్రెస్సింగ్ మెషిన్ – క్యాప్‌లో షీట్స్‌ను ఫిట్ చేయడానికి.
* వీటితో పాటు రబ్బరు షీట్స్ (ఒక్కో షీట్ ధర సుమారు రూ. 200, ఒక్క షీటుతో 10 వైపర్లు తయారవుతాయి)
* క్యాప్‌లు, బటన్స్
* స్టిక్స్ (వైపర్ కర్ర)
* ప్యాకింగ్ మెటీరియల్
ఎలా తయారు చేస్తారు.?
* ముందుగా రబ్బరు షీట్‌ను కటింగ్ మెషిన్‌తో తగిన పరిమాణంలో కట్ చేయాలి.
* కట్ చేసిన షీట్స్‌ను క్యాప్‌లో అమర్చాలి.
* ఆ క్యాప్‌లో బటన్స్ ప్రెస్సింగ్ మెషిన్ ద్వారా సెట్ చేయాలి.
* చివరగా స్టిక్‌ను క్యాప్‌తో జోడించాలి.
* ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి పంపాలి. ఈ సింపుల్ ప్రాసెస్‌తో తక్కువ సమయంలోనే ఎక్కువ ఉత్పత్తి చేయవచ్చు.
పెట్టుబడి, లాభాలు
ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి సుమారు రూ. 10,000 – రూ. 15,000 పెట్టుబడి సరిపోతుంది. ఒక్క వైపర్ తయారీ ఖర్చు సుమారు రూ. 25 నుంచి రూ. 30 వరకు అవుతుంది. అదే మార్కెట్లో రిటైల్ ధర రూ. 70 నుంచి రూ. 100 ఉంటుంది. అంటే ఒక్కో వైపర్‌పై కనీసం రూ. 40 లాభం వస్తుంది. రోజుకు 50 వైపర్లు తయారు చేస్తే, సుమారు రూ. 2,000 వరకు సంపాదన సాధ్యమే. ఇలా చూసుకుంటే నెలకు కనీసం రూ. 50 వేలు సంపాదించవచ్చు.
ఎలా అమ్మాలి.?
తయారు చేసిన వైపర్లను హోల్‌సేల్ దుకాణాలు, హార్డువేర్ షాపులు, గృహావసరాల షాపులలో సప్లై చేయవచ్చు. డైరెక్ట్‌గా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు (Amazon, Flipkart, Meesho) ద్వారా అమ్మకాలు చేయవచ్చు. డోర్ టు డోర్ మార్కెటింగ్ ద్వారా కూడా స్థానికంగా విక్రయించవచ్చు. అలాగే ప్రతీ వారం జరిగే మార్కెట్స్ (అంగడీ)లో కూడా విక్రయించుకోవచ్చు.