ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు
భారతదేశంలో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ప్రపంచ కుబేరులు ఇద్దరు పోటీపడుతున్నారు. వారిలో ఒకరు ప్రపంచంలోనే అందరికంటే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ కాగా, మరొకరు ఇండియాలోనే అత్యంత ధనవంతుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరు అయిన ముఖేష్ అంబానీ. ప్రజలకు ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి వీరిద్దరూ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారో ఇక్కడ క్లియర్ గా తెలుసుకుందాం.
టెస్లా, స్పేస్ ఎక్స్, స్టార్ లింక్, న్యూరాలింక్, బోరింగ్ కంపెనీ, ట్విట్టర్ ఇలా వివిధ రంగాల్లో అనేక కంపెనీలు కలిగిన ఎలాన్ మస్క్ భారత దేశంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆయనకు కలిసొచ్చేలా ఉంది. ఇండియాలో శాటిలైట్ స్పెక్ట్రమ్ సేవలు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ కాంట్రాక్ట్ ను సంపాదించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఇండియాలో ఇప్పటికే టెలికాం రంగంలో అగ్రగామిగా కొనసాగుతూ ఎక్కువ శాతం ప్రజలకు ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న రిలయన్స్ జియో ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఎప్పటి నుంచో దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్, కాల్స్ వంటి టెలికాం సేవలు అందిస్తున్న తమ సంస్థకే కాంట్రాక్ట్ వచ్చేలా చూడాలని జియో అధినేత ముఖేష్ అంబానీ పోటీపడుతున్నారు.
శాటిలైట్ స్పెక్ట్రమ్ సేవలను అడ్మినిస్ట్రేటివ్ మెథడ్ ద్వారా ఏదైనా కంపెనీకి అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయం ఎలాన్ మస్క్ కు కలిసి వస్తోంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ టెలి కమ్యూనికేషన్స్ యూనియన్(ITU) ప్రపంచ వ్యాప్తంగా శాటిలైట్ స్పెక్ట్రమ్ పనులు చేస్తుంది. ఈ సంస్థతో చాలా దేశాలు టై అప్ అయి ఉన్నాయి. అందులో భారతదేశం కూడా ఉంది. ఈ సంస్థ పెట్టిన రూల్స్ ప్రకారం సభ్యత్వం పొందిన దేశాలు పనిచేయాల్సి ఉంటుంది. ఈ ITUతో ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కు మంచి రిలేషన్ ఉంది. అంటే ITU నిబంధనలు ఫాలో చేయగల కెపాసిటీ స్పేస్ ఎక్స్ కు మాత్రమే ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ మెథడ్ ద్వారా ఎలాన్ మస్క్ కు ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించే కాంట్రాక్ట్ ఇవ్వడానికే అవకాశం ఉంది.
Mukesh Ambani
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ముఖేష్ అంబానీకి మింగుడుపడని విషయంగా మారింది. ఎందుకంటే సాధారణంగా ఇండియన్ గవర్నమెంట్ స్పెక్ట్రమ్ ఎలాకేషన్స్ లో వేలం పాట విధానాన్ని ఫాలో అవుతుంది. ఆ వేలం పాటలో ఎక్కువ ధరకి పాడిన టెలికాం కంపెనీలకు ప్రభుత్వం లైసెన్స్ ఇస్తుంది. ఈ విధానాన్ని ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా అమలు చేస్తుంది. కాని శాటిలైట్ స్పెక్ట్రమ్ సేవలు అమలు చేసేందుకు మాత్రం ఈ ఆక్షన్ విధానాన్ని ఫాలో అవ్వలేదు. అడ్మినిస్ట్రేటివ్ విధానం వల్ల ప్రభుత్వం ఫిక్స్ చేసిన బడ్జెట్, కండిషన్స్ కి ఓకే అనుకునే కంపెనీలకు మాత్రమే ప్రభుత్వం లైసెన్స్ ఇస్తుంది. అందులో పోటీ ఉండదు కాబట్టి ముఖేష్ అంబానీ ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై భారత ప్రభుత్వంతో తాను ప్రత్యేకంగా మాట్లాడతానని ముఖేష్ అంబానీ ప్రకటించారు. దీనికి స్పందించిని ఎలాన్ మస్క్ తాను ముఖేష్ అంబానీతో ప్రత్యేకంగా మాట్లాడతానని తన ఎక్స్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇండియాలో టెలికాం సర్వీసులన్నీ టవర్లు,కేబుల్స్, బూస్టర్స్ సాయంతో పని చేస్తాయి. అయితే ఇవి నగరాల్లో తప్ప పల్లెలు, కొండప్రాంతాల్లో సరైన సేవలు అందించలేకపోతున్నాయి. ఇప్పుడు కొత్తగా రానున్న టెలికాం సేవలు శాటిలైట్ ద్వారా పనిచేస్తాయి. అంటే భూమి ఉపరితలంపై శాటిలైట్స్ ఉంచి వాటి ద్వారా సేవలు అందిస్తారన్న మాట. దీని వల్ల దట్టమైన అడవులు, పెద్ద పర్వతాలపై కూడా ఇంటర్నెట్, కాల్స్ సేవలు చాలా స్పష్టంగా వినియోగించుకోవచ్చు. ఇలా శాటిలైట్స్ ద్వారా సేవలందించడంలో ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్ లింక్ ఎప్పటి నుంచో సేవలందిస్తోంది. సుమారు 100 దేశాల్లో 6,419 ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది.
ముఖేష్ అంబానీ టెలికాం రంగంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎయిర్‌వేవ్ వేలంలో బిలియన్ల కొద్దీ పెట్టుబడి పెట్టిన జియో ఇప్పుడు ప్రముఖ శాటిలైట్ ఆపరేటర్ అయిన లక్సెంబర్గ్‌కు చెందిన SES ఆస్ట్రాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది ఎలాన్ మస్క్ స్టార్ లింక్ కంటే మెరుగైన సేవలు అందించనుంది. అంటే భూమికి తక్కువ ఎత్తులోనే శాటిలైట్స్ ను ఉంచి ప్రజలకు హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. అందుకే ముఖేష్ అంబానీ ఇందులో పెట్టుబడులు పెట్టారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఫాలో అవుతున్న అడ్మినిస్ట్రేటివ్ విధానం వల్ల ఎలాంటి వేలం లేకుండా కేవలం కంపెనీ శక్తి సామర్థ్యాలను పరిగణించి లైసెన్స్ ఇవ్వనున్నారు. ఇది జియోకు ఒకరకంగా పెద్ద నష్టం తెచ్చే విషయమనే చెప్పాలి.