ప్రతి నెలా డబ్బులు సేవ్ చేయడానికి SIP బెటరా? RD మంచిదా?
డబ్బులు దాచుకోవడానికి అనేక మార్గాలుంటాయి. అయితే సేవింగ్స్ లోనూ వడ్డీ పొందాలంటే కొన్ని మాత్రమే ఉంటాయి. వాటిలో సరైన ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా ప్రతి నెల కొంత అమౌంట్ దాచుకోవాలంటే SIP (Systematic Investment Plan) ఒక మార్గం. అదేవిధంగా పోస్టాఫీసులో RD (Recurring Deposit) కూడా మరో మంచి దారి. మరి ఈ రెండింటిలో ఎందులో ఎక్కువ సేఫ్టీ, వడ్డీ లభిస్తుందో ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మ్యూచువల్ ఫండ్స్ లో SIP విధానం, పోస్ట్ ఆఫీస్ RD ఈ రెండూ సేవింగ్స్ కు అందుబాటులో ఉన్న బెస్ట్, రిస్క్ లేని పద్ధతులు. అయితే ఇవి పెట్టుబడి లక్ష్యాలు, రాబడులు, రిస్క్ స్థాయిలను బట్టి వేర్వేరు ప్రయోజనాలు కలిగిస్తాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో కాస్త రిస్క్ ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ రిటన్స్ బాగుంటాయి. పోస్టాఫీసులో రిస్క్ ఉండదు. అందువల్ల చివరిలో వచ్చే వడ్డీ కూడా అంత ఎక్కువ ఉండదు. 5 సంవత్సరాలకు నెలకు కొంత మొత్తం చొప్పున సేవ్ చేయడానకి ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఇప్పుడు చూద్దాం.
SIPలో ఇన్వెస్ట్ చేయడం
SIP అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ప్రతి నెల పెట్టుబడి పెట్టే విధానం. ఇది ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులను క్రమపద్ధతిలో సమీకరించడం ద్వారా స్థిరమైన ఆదాయాన్ని వడ్డీ రూపంలో పొందే అవకాశం ఇస్తుంది. SIPలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మార్కెట్ హెచ్చుతగ్గులపై ప్రభావం లేకుండా స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చు. దీన్ని రూపాయి-కాస్ట్ యావరేజింగ్ అని పిలుస్తారు. మార్కెట్ స్థితిగతులపై ఆధారపడి లాంగ్ టర్మ్ లో SIP నుంచి ఎక్కువ రాబడి వస్తుంది. అయితే స్టాక్ మార్కెట్ నష్టాలు, ఇతర కారణాల వల్ల ఇక్కడ కొన్ని రిస్కులు కూడా ఉంటాయి. ఇది పెట్టుబడి, రాబడిపై ప్రభావం చూపుతాయి.
పోస్ట్ ఆఫీస్ RDలో ఇన్వెస్ట్ చేయడం
పోస్ట్ ఆఫీస్ RD అనేది ప్రతి నెలా ఫిక్స్‌డ్ అమౌంట్ డిపాజిట్ చేసే పథకం. ఇది చిన్న మొత్తాలు పొదుపు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. RDపై వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. ఇది సురక్షితమైన పెట్టుబడి. RDలో రిస్క్ లేమి ఉండదు. అంటే మీరు పెట్టుబడి చేసిన మొత్తం వడ్డీతో కలిపి మీకు తిరిగి వస్తుంది. పోస్ట్ ఆఫీస్ RD పథకాలు ప్రభుత్వ భద్రతతో ఉంటాయి. కనుక ఇది సురక్షితమైన పెట్టుబడులలో ఒకటి అని చెప్పొచ్చు. ఎక్కడ ఏ ప్రాడ్ జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత ఉంటుంది.
ఏది మంచిదంటే..
SIP మునుపటి రాబడుల మీద ఆధారపడి ఉంటే.. పోస్ట్ ఆఫీస్ RD స్థిర రాబడులపై ఆధారపడి ఉంటుంది. మీరు లాంగ్ టర్మ్ పెట్టుబడి చేయడానికి సిద్ధంగా ఉంటే, రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా SIP మీకు మంచిది. మీరు కనీస రిస్క్ లేకుండా సురక్షిత రాబడులు కోరుకుంటే పోస్ట్ ఆఫీస్ RD మంచి ఎంపిక.
5 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.5000 ఇన్వెస్ట్ చేస్తే RD 6.7 శాతం వార్షిక వడ్డీని వస్తుంది. దీనికోసం మీరు ముందుగా మీ సమీపంలోని పోస్టాఫీసు లేదా బ్యాంకులో RD ఖాతా ఓపెన్ చేయాలి. పోస్ట్ ఆఫీస్ 5 సంవత్సరాల RD కోసం 6.7 శాతం వార్షిక వడ్డీని అందిస్తుంది. పోస్టాఫీసులో ప్రతి నెలా రూ. 5000 చొప్పున 5 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి రూ. 3,00,000 అవుతుంది. 6.7 శాతం వడ్డీ రేటుతో ప్లాన్ మెచ్యూరిటీ అయ్యే సరికి మొత్తం రూ.3,56,830 మీకు అందుతుంది. ఇందులో వడ్డీ రూ.56,830.
మీరు SIP మోడ్‌లో రూ. 5000 ఇన్వెస్ట్ చేస్తే 5 సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి రూ. 3,00,000 అవుతుంది. దీనికి మీరు ప్రతి సంవత్సరం 12% వడ్డీ సంపాదించడానికి వీలుంటుంది. ఈ లెక్కన 5 సంవత్సరాల తర్వాత మీకు మొత్తం రూ.4,12,432 అందుతుంది. ఇందులో వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.1,12,432.
సెక్యూర్డ్ రికరింగ్ డిపాజిట్‌లో చెల్లించిన రూ.3 లక్షలు వడ్డీ రూపంలో రూ.56,830 మాత్రమే. అందువల్ల మీరు రిస్క్ తీసుకోగలిగితే అంటే SIPలో పెట్టుబడి పెడితే రూ. 3 లక్షల రాబడి రూ. 1 లక్ష కంటే ఎక్కువ వడ్డీ పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ లెక్కన SIP పెట్టుబడిపై వచ్చే రాబడి రికరింగ్ డిపాజిట్ కంటే దాదాపు రెట్టింపు ఉంటుంది. ఇక నిర్ణయం మీదే.