- Home
- Business
- TCS Jobs: టీసీఎస్‌లో జాబ్ కావాలా? కేవలం చాట్ జీపీటీ వస్తే సరిపోదు.. ఈ స్కిల్స్ ఉండాల్సిందే
TCS Jobs: టీసీఎస్‌లో జాబ్ కావాలా? కేవలం చాట్ జీపీటీ వస్తే సరిపోదు.. ఈ స్కిల్స్ ఉండాల్సిందే
TCS Jobs: టీసీఎస్ ఇకపై ఏఐ నైపుణ్యాలు ఉన్న ఫ్రైషర్లకే ప్రాధాన్యం ఇవ్వనుంది. కేవలం చాట్ జీపీటీ తెలిస్తే చాలదనీ, కొత్త టెక్నాలజీ నైపుణ్యాలు తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఆ వివరాలు మీకోసం.

ఫ్రైషర్లకు మైండ్ బ్లోయింగ్ న్యూస్.. టీసీఎస్ లో 80 శాతం ఉద్యోగాలు వాళ్లకే
ఐటీ రంగంలో ఉద్యోగాలు సాధించాలనుకునే యువతకు ప్రముఖ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. కంపెనీలో కొత్తగా చేరే ఉద్యోగుల విషయంలో టీసీఎస్ తమ నియామక ప్రక్రియను వేగంగా మారుస్తోంది. రాబోయే రోజుల్లో తాము తీసుకోబోయే కొత్త ఉద్యోగుల్లో దాదాపు 80 శాతం మంది డిజిటల్, ఏఐ నైపుణ్యాలు ఉన్నవారే ఉంటారని టీసీఎస్ స్పష్టం చేసింది.
ఈ మధ్య కాలంలో ఐటీ రంగంలో ఏఐ ప్రాధాన్యం విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. జులై నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ మొత్తం 4,500 మంది కొత్త ఉద్యోగులను తమ కంపెనీలోకి తీసుకుంది. అందులో దాదాపు 25 నుంచి 30 శాతం మంది ప్రత్యేకమైన ఏఐ నైపుణ్యాలు కలిగిన వారు కాగా, 80 శాతం మంది కొత్త తరం టెక్నాలజీ నైపుణ్యాలు ఉన్నవారని టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హారతి సుబ్రమణ్యన్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నియామకాలు కొనసాగుతాయని, మార్కెట్‌లో సరైన ప్రతిభ కలిగిన అభ్యర్థులు అందుబాటులోనే ఉన్నారని పేర్కొన్నారు.
ఎవరికి ఎక్కువ ప్రయోజనం? ఫ్రైషర్లకా లేక అనుభవజ్ఞులకా?
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తుండటంతో, అనుభవం ఉన్న ఉద్యోగుల కంటే ఫ్రైషర్లకే ఎక్కువ అవకాశాలు ఉంటాయా అనే చర్చ నడుస్తోంది. యంగ్ జనరేషన్ ఉద్యోగులు కొత్త ఏఐ టూల్స్‌ను చాలా త్వరగా నేర్చుకుంటారు. అలాగే కంపెనీలకు కూడా వీరిని హైర్ చేసుకోవడం ఆర్థికంగా కలిసి వస్తుంది.
అయితే ఈ అంశంపై టీసీఎస్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ కే కృతివాసన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "కొత్త విషయాలను నేర్చుకోవడానికి, మారే పరిస్థితులకు అలవాటు పడటానికి ఒక వ్యక్తి ఎంత సిద్ధంగా ఉన్నాడనే దానిపైనే ఈ ప్రయోజనం ఆధారపడి ఉంటుంది" అని ఆయన చెప్పారు. ఒక సీనియర్ లేదా మిడ్ లెవల్ ఇంజనీర్ కొత్త టెక్నాలజీని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే అది వారికి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందన్నారు.
ఏఐ బిజినెస్‌తో మారనున్న టీసీఎస్ లాభాలు
టీసీఎస్ సంస్థ ప్రస్తుతం తన ఏఐ బిజినెస్‌ను భారీగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తరణ ద్వారా కంపెనీ ప్రాఫిట్ మార్జిన్లు మరింత మెరుగుపడతాయని భావిస్తోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ మొత్తం ఆదాయంలో ఏఐ విభాగం వాటా ఏకంగా 10 శాతానికి చేరింది.
ముందు ముందు ఏఐ డీల్స్ సంఖ్య పెరిగే కొద్దీ కంపెనీ లాభాల శాతం కూడా పెరుగుతుందని సీఈఓ కృతివాసన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కస్టమర్లు మొదట ఏదైనా ఒక చిన్న బిజినెస్ విభాగంలో ఏఐ ప్రాజెక్టులను ప్రారంభిస్తారని, అక్కడ మంచి ఫలితాలు కనిపించగానే మిగతా విభాగాలకు కూడా విస్తరిస్తారని హారతి సుబ్రమణ్యన్ వివరించారు. సెప్టెంబర్ క్వార్టర్‌లో టీసీఎస్ పొందిన $9.6 బిలియన్ల కాంట్రాక్టుల్లో స్పష్టమైన ఏఐ వాటా ఎంత ఉందో చెప్పకపోయినప్పటికీ, ప్రస్తుతం తాము చేసే దాదాపు ప్రతి పనిలోనూ ఏఐ ఏదో ఒక రూపంలో భాగమై ఉందని కృతివాసన్ వెల్లడించారు.
కేవలం ఏఐ నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందా?
ఏఐ సాధనాలను ఉపయోగించడం వేరు, నిజమైన నైపుణ్యాన్ని పెంచుకోవడం వేరు అని నిపుణులు చెబుతున్నారు. ఐటీ ఉద్యోగుల తీరుపై నిపుణులు మాట్లాడుతూ.. భారత్‌లో 90 శాతానికి పైగా ఉద్యోగులు ఏదో ఒక ఏఐ టూల్‌ను ఉపయోగిస్తున్నారు. కానీ అది కంపెనీకి పూర్తి స్థాయి ఏఐ సామర్థ్యాన్ని తెచ్చిపెట్టదని పేర్కొంటున్నారు.
ఏర్పడిన ప్రమాణాలు లేకుండా, కంపెనీ అవసరాలకు సరిపోలేలా కాకుండా, క్వాలిటీ చెక్ లేకుండా కేవలం టూల్స్ వాడితే ఉపయోగం ఉండదని చెప్పారు. ఏఐ వాడకం పెరిగినంత మాత్రాన ప్రతిభ పెరిగినట్లు కాదని అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగులను సొంతంగా ఏఐ నేర్చుకోమని వదిలేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, కంపెనీలకు ఏ స్కిల్స్ అవసరమో గుర్తించి వాటిపై స్పష్టత ఇవ్వాలని సూచిస్తున్నారు.
ఉద్యోగులు అలర్ట్ అవ్వండి
ప్రస్తుత ఐటీ రంగంలో నిలదొక్కుకోవాలంటే కేవలం చాట్ జీపీటీ లేదా మరో ఏఐ టూల్ ఎలా వాడాలో తెలుసుకోవడం మాత్రమే సరిపోదు. ఆ టెక్నాలజీని ఉపయోగించి నిజమైన సమస్యలకు ఎలా పరిష్కారం చూపుతున్నాం అనేదే ముఖ్యం.
కంపెనీ బిజినెస్‌ను అర్థం చేసుకోవడం, ప్రాజెక్టులలో నమ్మకమైన ఫలితాలను సాధించడం, టెక్నాలజీని సరైన రీతిలో అమలు చేయడం రాబోయే రోజుల్లో ప్రతి ఉద్యోగికి చాలా ముఖ్యం కానుంది. సాంకేతికత మారినా బిజినెస్ ప్రాసెస్, నాణ్యమైన అవుట్‌పుట్ అందించే వారికి ఐటీ రంగంలో ఎప్పుడూ తిరుగుండదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

